Monday, September 27, 2010

The Grand Design


కవర్‌స్టోరీ

స్టీఫెన్ హాకింగ్-ఐన్‌స్టీన్ తర్వాత అంతటి పేరుప్రఖ్యాతుల్ని, గౌరవాన్ని సంపాదించుకున్న శాస్త్రవేత్త. ఆయన పేరు వినగానే రెండు విషయాలు మనసులో మెదులుతాయి. ఒకటి వీల్‌చైర్‌కి అంకితమైపోయిన ఆయన శరీరం, రెండోది ఆయన రాసిన 'ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్'. అనంత విశ్వం పుట్టుక గురించి రాసిన పుస్తకం. 1988లో అచ్చైన ఆ పుస్తకమే ఆయన్ని సామాన్య జనకోటికి సుపరిచితుణ్ణి చేసింది. ఒక్క ఇంగ్లీషులోనే 90 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. వందకి పైగా భాషల్లోకి అనువాదమైంది. ఆ స్టీఫెన్ హాకింగే ఇప్పుడు మరొక శాస్త్రవేత్త లియొనార్డ్ మ్లాదినోవ్‌తో కలిసి 'ద గ్రాండ్ డిజైన్' అనే పుస్తకం రాశారు. ఈ నెల 7న విడుదలైన ఆ పుస్తకం విశ్వం గురించిన 'శాస్త్రీయ అవగాహన చరిత్ర'ను మరోసారి పరిశీలిస్తుంది. ఆ పుస్తకంలోని కొన్ని భాగాలే ఈ వారం కవర్‌స్టోరీ.


"మనుషుల జీవితకాలం చాలా తక్కువ. ఆ కొద్ది కాలంలో ఈ విశ్వంలోని ఏ కొద్ది భాగాన్నో మాత్రమే మనం శో«ధిస్తాం. మనలో తలెత్తిన ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతాం.... మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనమెలా అర్థం చేసుకోవాలి? ఈ విశ్వం ఇలాగే ఎందుకుంది? ఇది అసలెక్కడినుంచి వచ్చింది? ఎవరైనా సృష్టించారా? మనల్ని ఈ సందేహాలు నిత్యం వేధించకపోయినా ఎప్పుడో ఒకసారి అయినా మనం వాటిగురించి ఆలోచించకుండా ఉండలేం.
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాల్సింది తత్వశాస్త్రం. అయితే తత్వశాస్త్రానికి ఎప్పుడో కాలం చెల్లింది. శాస్త్రీయ రంగం, ముఖ్యంగా భౌతికశాస్త్ర రంగంలో జరుగుతున్న అభివృద్ధిని అర్థం చేసుకునేంతగా తత్వశాస్త్రం ఎదగలేదు. జ్ఞానాన్వేషణ అనే ప్రయాణంలో శాస్త్రవేత్తలే కాగడా పట్టుకు ముందుకు నడిపించే నాయకులయ్యారు. ఆ క్రమంలోనే ఈ మధ్యకాలంలో కనుగొన్న విషయాలు, చేసిన సైద్ధాంతిక ప్రతిపాదనలు మన ప్రశ్నలకి సమాధానాలిస్తున్నాయి. వాటిని అందించడమే ఈ పుస్తకం ఉద్దేశం.......

ఆధునిక భౌతికశాస్త్రం అభివృద్ధి చెందేవరకు ప్రపంచాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకోవచ్చని అనుకునే వాళ్లు. మనకి కనిపిస్తున్నట్టే వస్తువులు ఉంటాయని, మనం అవగతం చేసుకున్నదే వాస్తవమని మనం అనుకోవచ్చు గాక. కాని ఆధునిక భౌతిక శాస్త్రం అలా భావించదు. మనకి కనిపించే దృశ్యాల్ని మనం అర్థం చేసుకునే తీరు, అవే దృశ్యాల్ని ఆధునిక భౌతికశాస్త్రం విశ్లేషించే తీరు ఒకలా ఉండవు. అందుకే విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి 'మోడల్ డిపెండెంట్ రియలిజం'ని ఉపయోగించాలి. అంటే ఏమిటంటే... మన ఇంద్రియాలు మెదడుకి చేరవేసే సంకేతాల్ని బట్టి మన మెదడులో మన చుట్టూ ఉన్న ప్రపంచ నమూనా ఏర్పడుతుంది. మన చుట్టూ జరిగే ప్రక్రియల్ని ఆ నమూనా వివరించగలిగితే ఆ వాస్తవాన్నే మనం నిజం అని నమ్ముతాం. అయితే ఒకే భౌతిక సందర్భాన్ని వేర్వేరు సిద్ధాంతాలు వేర్వేరుగా వివరించవచ్చు. ఏదైనా ఒక ప్రక్రియని రెండు భిన్న సిద్ధాంతాలు వేర్వేరుగా వివరించినపుడు వాటిలో ఏది మెరుగో చెప్పలేం కాని మనకి అనుకూలంగా ఉన్న సిద్ధాంతాన్ని ఉపయోగించుకోవచ్చు.

శాస్త్ర విజ్ఞాన రంగంలో వచ్చిన మార్పుల్ని గమనిస్తే... ఒకదాని తర్వాత ఒకటిగా మెరుగైన సిద్ధాంతాలు, నమూనాలు వస్తూనే ఉన్నాయి. ప్లాటో నుంచి న్యూటన్ సిద్ధాంతాల దాకా, క్వాంటమ్ సిద్ధాంతాల దాకా మనం కొత్తకొత్త నియమాలను తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ క్రమానికి ముగింపు లేదా అని అనుకుంటూనే ఉన్నా ఈ విశ్వానికి సంబంధించిన ప్రతి కదలికను, మన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని వివరించగలిగే ఒకే ఒక సిద్ధాంతం ఉండదా? ఈ ప్రశ్నకి సమాధానం మనవద్ద లేదు కాని అలాంటి సిద్ధాంతం గనక ఒకటుంది అనుకుంటే అదే ఎం. సిద్ధాంతం. ఆ సిద్ధాంతంపై ఆధారపడే ఈ చర్చ మొత్తం జరగనుంది. ఎం-సిద్ధాంతం ప్రకారం మన విశ్వం ఒక్కటే కాదు, మరెన్నో విశ్వాలున్నాయి. వాటి సృష్టికి ఏ దేవుడి అవసరమూ లేకపోయింది. భౌతిక సిద్ధాంతాలను బట్టి చూసినపుడు ఆ విశ్వాలన్నీ వాటంతటవే ఏర్పడ్డాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే మనలాంటి జీవులు ఉండడానికి అనుకూలంగా ఉంటాయి. మొత్తం విశ్వాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే ఆ విశ్వం ఎలా ప్రవర్తిస్తుందో మాత్రమే తెలుసుకుంటే సరిపోదు, అలా ప్రవర్తించడానికి కారణాలు తెలుసుకోవాలి.

ఈ విశ్వం ఎందుకుంది? శూన్యమే ఉండొచ్చుగా!
మనం ఎందుకున్నాం?
ఈ విశ్వాన్ని గురించి తెలియజేయడానికి కొన్ని సిద్ధాంతాలు మాత్రమే ఎందుకున్నాయి, వేరేవి ఎందుకు లేవు?

జీవితానికి, విశ్వానికి... సమస్తానికి సంబంధించి ఇవే అంతిమ ప్రశ్నలు. ఈ పుస్తకంలో పై ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తాం.......

***

వాస్తవం అంటే ఏమిటి?

కొన్నేళ్ల క్రితం సంగతి... ఇటలీలోని మోంజా అనే నగర కౌన్సిల్ గోల్డ్ ఫిష్‌లను గోళాకార గాజు పాత్రల్లో ఉంచకూడదని నగర పౌరులను కోరింది. గుండ్రంగా ఉన్న గాజు గోడల గుండా చేప బయటి ప్రపంచాన్ని చూసినపుడు, దాని కళ్లకి బాహ్య ప్రపంచం వంగినట్టు కనిపిస్తుందని వారి వాదన. మరి మనం చూసేది సత్యమని మనకెలా తెలుసు? మనం కూడా గోల్డ్ ఫిష్‌లాగే ఒక మహాగోళంలో నుండి బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నామేమో. గోల్డ్ ఫిష్ చూసేదానికి మనం చూసేదానికి తేడా ఉన్నా, మనం చూసేదే వాస్తవమని మనం ఎలా చెప్పగలం? నేరుగా వెళుతున్న ఏదైనా వస్తువు గోల్డ్ ఫిష్‌కి వలయాకారంలో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. దాన్నిబట్టి ఆ చేప వేరే శాస్త్రీయ పరిశీలనలు చేయొచ్చు, ఆ ఫిష్‌బౌల్ నుండి చూసినపుడు అవన్నీ కరెక్టే అని కూడా అనిపించవచ్చు...... ఖగోళంలోని వస్తువుల కదలికల ఆధారంగా టాలమీ క్రీ.శ. 150లో ప్రకృతి నియమాలను ప్రతిపాదించాడు. దాని ప్రకారం భూమి విశ్వానికి కేంద్రం... కాని 16వ శతాబ్దంలో కొపెర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

పై రెండు సిద్ధాంతాల్లో ఏది వాస్తవమో తెలుసుకోవడం కంటే, మనం చేస్తున్న పరిశోధనలకి ఏది పనికొస్తుందని భావిస్తామో దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఫిష్‌బౌల్ లోపల ఉన్నపుడు ఆ చేపకి కనిపిస్తున్న వాస్తవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కాని బయట నుండి చూసినపుడు అది పనికి రాదు... అందుకే ఎం-సిద్ధాంతం కొన్ని సిద్ధాంతాల సముదాయం కాబట్టి ఆ సిద్ధాంతం ఉపయోగించి విశ్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ విశ్వంలో ప్రతి వస్తువు కదలికలను, ప్రవర్తనను శాస్త్రీయ సిద్ధాంతాలతో వివరించవచ్చు...

***

సృష్టి గురించి....

సృష్టికి సంబంధించి చైనీయులు 1782లో ఒక సంఘటన జరిగిందని నమ్ముతారు. దాని ప్రకారం.... అప్పుడు ఒక్కసారిగా విశ్వం మొత్తం మారిపోయింది. పది సూర్యగ్రహాలు ఒకేసారి ప్రత్యక్షమయ్యాయి. వాటి వేడికి ప్రజలందరూ ఇబ్బంది పడడంతో అప్పటి చక్రవర్తి ఒక్క సూర్యుణ్ణి మాత్రం ఉంచి మిగిలిన వాటిని బాణంతో కూల్చేయమని ఆజ్ఞాపించాడు..... సౌరమండలంలో ఎక్కువ సూర్యులుంటే జీవానికి అనువుగా ఉండదని చైనీయులు గ్రహించారు... సౌరమండలంలోని గ్రహాలలో కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి కాబట్టే ఇక్కడ జీవం ఆవిర్భవించింది. అయితే ఈ సౌరమండలంలో గ్రహాల గమనానికి సంబంధించి శాస్త్రవేత్తల ప్రతిపాదించిన నియమాలను ఇక్కడ ప్రస్తావించాం. సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాల గమనం కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటుందన్న విషయాన్ని వివరించాం. అందుకే దేవుడు, దెయ్యం లాంటి మరే ఇతర శక్తి తమ ఇష్టం వచ్చినట్టుగా ఈ విశ్వాన్ని నడపలేదని మేం అంటున్నాం.

***

నియమం అంటే ఏమిటి?


ఒక నియమానికి ఒక క్రమం ఉంటుంది. ఏదైనా చర్య జరిగినపుడు ఆ చర్య జరిగిన క్రమాన్ని బట్టి శాస్త్రవేత్తలు దాని తర్వాత ఏం జరుగుతుందో అంచనా వేస్తారు. అయితే మనం చూసినదల్లా నియమం అయిపోదు. రోజూ సూర్యుడు తూర్పున ఉదయించడం మనం చూస్తున్నంత మాత్రాన 'సూర్యుడు తూర్పున ఉదయించును' అని సిద్ధాంతీకరించలేం కదా. దాన్ని శాస్త్రీయ నియమంగా గుర్తించలేం....
ఆధునిక శాస్త్రంలో అన్ని నియమాలూ గణిత సమీకరణాల్లో ఇమిడి ఉంటాయి. వాటిలో కొన్ని నియమాలకి ఖచ్చితమైన విలువలు ఉండొచ్చు, కొన్నిటికి ఉండకపోవచ్చు. ఆ నియమాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వర్తించవచ్చు. న్యూటన్ గమన నియమాలు భూమ్మీద ప్రయాణించే వస్తువులకి వర్తిస్తాయి కాని కాంతి వేగంతో ప్రయాణం చేస్తున్న వస్తువులకు వర్తించవు. అయినా వాటిని నియమాలుగా గుర్తించాం... ఈ సృష్టి కొన్ని నియమాలకి కట్టుబడి ప్రవర్తిస్తుందని చెప్పింది శాస్త్రవేత్తలే.

సృష్టి ఆ నియమాలకు తగ్గట్టుగా ప్రవర్తించేలా రూపొందించిందెవరు?
ఆ నియమాలకి మినహాయింపు ఉంటుందా?
అసలు ఆ నియమాలు ఎందుకు?

ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు వారి వారి సమాధానాలిచ్చారు. అయినా ఈ నియమాలన్నీ సృష్టించింది దేవుడే అనుకునేవారు కూడా ఉన్నారు. ఈ సృష్టి నియమాల సముదాయమే దేవుడని అంటారు వారు. ఒకవేళ అవి దేవుడి సృష్టే అయితే వాటికి మినహాయింపులు ఉంటాయా? ఆయనే సృష్టించిన వాటికి మినహాయింపులు కల్పించడం ఏమిటి.....

ఖగోళంలోని గ్రహ, నక్షత్రాలకు సంబంధించి మాత్రమే అలాంటి నియమాలు వర్తిస్తాయని, భూమిపైన జరిగే రకరకాల ప్రక్రియలకు, మానవుల ప్రవర్తనకు ఆ నియమాలు వర్తించవని మొదట్లో భావించే వారు. ఎందుకంటే భూమ్మీద జరిగే వాటికి కారణాలను ప్రాచీన నాగరికులు కనుగొనలేక పోయారు. అయితే క్రమంగా ఖగోళమే కాదు, భూమ్మీద జరిగే ప్రతి క్రియకి కొన్ని నియమాలున్నాయని, వాటికి కట్టుబడే అవి జరుగుతాయని కనుగొన్నారు....
ఈ మొత్తం విశ్వం ఒకానొక నిర్ధారిత సమయంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి తగిన నియమాలు ఉన్నపుడు మాత్రమే ఆ నిర్ధారిత సమయం నుంచి విశ్వంలో క్రమంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో పరిశీలించగలం, అధ్యయనం చేయగలం. ఆ నియమాలన్నీ అన్ని వేళలా నిరూపించబడాలి. అప్పుడే అవి నియమాలవుతాయి. వాటికి మినహాయింపులు ఉండకూడదు. అంటే... వాటికి కట్టుబడి కాకుండా ఏ అద్భుతాలో జరగడానికి తావుండకూడదు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించడంలో దేవుళ్లు దెయ్యాల ప్రమేయం ఉండకూడదు.....
శాస్త్రీయ నిర్ధారణ అనే ఆలోచన వచ్చాకే న్యూటన్ గమన నియమాలు మనకు తెలిశాయి. ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్దాంతంతో శాస్త్రీయ నిర్ధారణ మరో అడుగు ముందుకేసింది. ఆ తర్వాత వచ్చిన మరికొన్ని నియమాలు విశ్వాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడంలో దోహదపడ్డాయి. అయితే ఈ నియమాలన్నీ విశ్వానికి సంబంధించినంత వరకు వివిధ చర్యలు ఎలా జరుగుతున్నాయనే విషయాన్నే పరిశీలిస్తున్నాయి కాని ఎందుకలా జరుగుతున్నాయనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాయి.

ఆ ప్రశ్నకి సమాధానం దేవుడని, ఈ విశ్వాన్ని సృష్టించింది దేవుడేనని కొందరంటారు. ఈ సృష్టికి మూలం దేవుడైనపుడు ఆ దేవుణ్ణి సృష్టించినవారెవరు అనే ప్రశ్న కూడా తలెత్తకుండా ఉండదు. అలా వాదించుకుంటూ పోతే... ఏదైనా వస్తువుని ఎవరూ సృష్టించనవసరం లేదని, అది అలా ఏర్పడవచ్చని, అదే దేవుడని కూడా వాదించే వారున్నారు. అయితే ఈ సృష్టి ఎందుకలా ఏర్పడిందన్న ప్రశ్నకి సమాధానం చెప్పడానికి దేవుడు అవసరం లేదు. సైన్సే వాటికి సమాధానం చెబుతుందని మేమంటున్నాం."
(ఎలాగో తెలుసుకోవాలంటే ఎం. సిద్ధాంతాన్ని తెలుసుకోవాల్సిందే, పుస్తకం చదవాల్సిందే)

ఎం-సిద్ధాంతం అంటే...

పరమాణు స్థాయిలో పదార్థాల ప్రవర్తనని అభ్యసించేది క్వాంటమ్ సిద్ధాంతం. ఖగోళంలోని గ్రహాల, నక్షత్రాల గురించి అభ్యసించేది సాపేక్ష సిద్ధాంతం. ఈ రెండిటినీ కలిపి ప్రతిపాదించినది స్ట్రింగ్ సిద్ధాంతం. ఇది పరమాణువు నుంచి అనంత విశ్వం దాకా దేనిగురించి అయినా అభ్యసించడానికి దోహదపడుతుంది. కాబట్టి దీన్ని 'థియరీ ఆఫ్ ఎవ్విరిథింగ్' అని అంటారు. దీని కొనసాగింపుగానే ఎం. సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎం. అంటే మెంబ్రేన్.

Sunday, September 19, 2010

Bhagwati Brothers

భగవతి బ్రదర్స్

జస్టిస్ ప్రఫుల్లచంద్ర ఎన్ భగవతి- సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.
జగదీష్ భగవతి-ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత పాల్‌క్రుగ్మన్ గురువు.
సనత్ ఎన్ భగవతి-ప్రముఖ న్యూరాలజిస్ట్, 'ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ పీడియాట్రిక్ న్యూరోసర్జరీ' మాజీ అధ్యక్షుడు.
ప్రవీణ్ భగవతి-'వరల్డ్ ఫౌండ్రీ ఆర్గనైజేషన్' మాజీ అధ్యక్షుడు.
'భగవతి' పేరు పెట్టుకుంటే ఎవరైనా ఇలాగే గొప్పవాళ్లవుతారా? లేకపోతే ఆ పేరు పెట్టుకున్న ప్రముఖుల్లో వీళ్లు కొందరా? వీళ్లంతా అన్నదమ్ములైతే కాదు కదా... అనుకుంటున్నారా? మీరు ఊహించింది నిజమే. ఈ నలుగురూ అన్నదమ్ములే. వారివారి రంగాల్లో అత్యున్నత స్థానానికి చేరిన 'భగవతి బ్రదర్స్'. అదే వారి స్పెషాలిటీ.


ఈ నలుగురే కాదు. భగవతిలు మొత్తం ఏడుగురు అన్నదమ్ములు. ఒకసారి 1920లలోకి వెళ్తే... ముంబైలో నివాసముంటున్న గుజరాతీ లాయర్ నట్వర్‌లాల్ హెచ్ భగవతికి ఏడుగురు సంతానం. అందరూ కొడుకులే. వారిలో పెద్దవాడైన జస్టిస్ పి ఎన్ భగవతి 1921 డిసెంబర్ 21న పుట్టారు. 'అందరం మగ పిల్లలమే కావడంతో మా తల్లిదండ్రులు మా కజిన్ ఒకమ్మాయిని దత్తత తీసుకున్నారు. అలా మాకొక చెల్లెలు కూడా తోడైంది. అంతేకాదు, చుట్టాల పిల్లలు మరో ఇద్దరు కూడా మా ఇంట్లోనే ఉండి చదువుకునేవారు. మొత్తం పదిమంది పిల్లలవడంతో మాకు నిత్యం సందడే. ఒక్కో రూంలో ఇద్దరం, ముగ్గురం ఉండేవాళ్లం. ఎప్పుడు చూసినా ఎవరోఒకరు అల్లరి చేస్తూనే ఉండేవారు. అలా మా బాల్యమంతా చాలా ఆనందంగా గడిచింది. అందుకేనేమో ఇప్పటికీ నాకు నిశ్శబ్దం అంటే నచ్చదు సరికదా... అలా ఉంటే అసలు పనే చేయలేను. మా అన్నయ్య జస్టిస్ పిఎన్ భగవతి కూడా అంతే. ఓ వైపు ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నా అదేమీ పట్టించుకోకుండా తాను ఇవ్వవలసిన జడ్జిమెంటును స్టెనోకు గంటల తరబడి డిక్టేట్ చేస్తూనే ఉండేవారు' అని జగదీష్ భగవతి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

నట్వర్‌లాల్ హెచ్ భగవతి అప్పటికే పేరుమోసిన లాయర్, ఆయన స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడమే కాకుడా కొడుకుల్ని కూడా పాల్గొనేలా ప్రోత్సహించారు. ఆయన స్ఫూర్తి తోటే జస్టిస్ పిఎన్ భగవతి కాలేజీలో చదువుకునే రోజుల్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్లారు. మిగతా వాళ్లంతా చిన్నపిల్లలు కావడంతో ఉద్యమంలో పాల్గొనక పోయినా ఆ రోజుల్ని కళ్లారా చూసిన వాళ్లే.
స్వాతంత్య్రానంతరం నట్వర్‌లాల్ భగవతి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. రిటైరైన తర్వాత బెనారస్ హిందూ యూనివర్శిటీకి వైస్ చాన్సలర్‌గా కూడా పని చేశారాయన. తండ్రి స్ఫూర్తి తోనే ఆయన కొడుకుల్లో నలుగురు ప్రతిభలో తండ్రిని మించిన కొడుకులయ్యారు. వారిలో పెద్దవాడు జస్టిస్ పిఎన్ భగవతి.

లెక్కలు వదిలి లాయరై...

జస్టిస్ పి ఎన్ భగవతి బొంబాయి మొత్తంలోనే మెట్రిక్యులేషన్‌లో రెండో ర్యాంక్ సా«ధించారు. ఆ తర్వాత బొంబాయి లోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజి నుండి 1941లో గణితంలో బిఏ ఆనర్స్ చేసి అదే కాలేజిలో గణితశాస్త్రంలోనే ఎంఏలో చేరారు. 1942లో స్వాతంత్రోద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. తర్వాత నాలుగు నెలలపాటు అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే 'లా' చదవాలని నిర్ణయించుకున్నారు. బొంబాయి ప్రభుత్వ లా కాలేజిలో లా పూర్తి చేసి బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1960లో గుజరాత్ హైకోర్టు జడ్జిగా, 1967లో అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1973లో సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపికై 1985-86లో భారత ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన హయాంలోనే 'ప్రజాప్రయోజనాల వ్యాజ్యాల' స్వీకరణ మొదలైంది. జస్టిస్ భగవతి ఎన్నో అంతర్జాతీయ మానవహక్కుల సంస్థల్లో వివిధ స్థాయిల్లో పనిచేశారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిటీకి చైర్మన్‌గా కూడా ఉన్నారు.

ఆయన ఇచ్చిన తీర్పువల్ల ప్రయోజనం పొందిన ఒక ఊరి గిరిజనులు తమ ఊరి పేరును భగవతిపురంగా మార్చుకున్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని శ్రామికులకు, బాల కార్మికులకు సంబంధించి ఆయన వెలువరించిన తీర్పులు కేంద్రప్రభుత్వాన్ని ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టేలా చేశాయి. అందుకే జస్టిస్ భగవతిని స్వతంత్రభారత చరిత్రలోనే గొప్ప న్యాయమూర్తిగా పరిగణిస్తారు.
ఆ అన్నయ్యకు ఏమాత్రం తీసిపోలేదు జగదీష్ భగవతి.

గ్లోబలైజేషన్ గురు...

ప్రపంచంమొత్తంలో ఇప్పుడు ఎక్కువమంది చర్చిస్తున్న అంశం ఏదంటే 'ప్రపంచీకరణ' అని తడుముకోకుండా చెప్పేయొచ్చు. ఈ వివాదాస్పద సిద్ధాంతాన్ని నిస్సంకోచంగా సపోర్ట్ చేసి 'గ్లోబలైజేషన్ గురు'గా పేరొందిన ఆర్థికవేత్త జగదీష్ భగవతి. ప్రస్తుతం కొలంబియా యూనివర్శిటీకి చెందిన 'స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్'లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. 76 ఏళ్ల భగవతి గౌరవార్థం ఆయన పేరుమీద అదే యూనివర్శిటీలో 'జగదీష్ భగవతి చైర్' కూడా ప్రారంభించారు.

2004లో వచ్చిన 'ఇన్ డిఫెన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్' పుస్తకమే ఆయన్ని గ్లోబలైజేషన్ గురుని చేసింది. 'ఫ్రీ ట్రేడ్' సిద్ధాంతకర్తగా ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆయన్ని మన దేశ ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్‌తో సత్కరించింది. అంతేకాదు... జపాన్ ప్రభుత్వం ఆయన్ని 2006లో 'ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్-గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్'తో గౌరవించింది. చాలాయేళ్లుగా నోబెల్ పురస్కారం అందుకోగల వారి జాబితాలో ఆయన పేరు ఉంటూనే ఉంది. ఆయనకు రాకపోయినా ఆయన ప్రియశిష్యుడు పాల్ క్రుగ్మన్ నోబెల్ బహుమతి పొందారు.

ఇరవయ్యేళ్లకే ఇండియా వదిలి కేంబ్రిడ్జి యూనివర్శిటీలో బిఏ పూర్తి చేసిన జగదీష్ 1967లో అమెరికాలోని 'మసాసుచెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -ఎం.ఐ.టీ' నుండి పీహెచ్‌డీ పూర్తి చేశారు. మన దేశంలోని పలు యూనివర్శిటీలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. దాదాపు అర్ధశతాబ్దంగా ఆయన రాస్తున్న పుస్తకాలు, వ్యాసాలు, చేసిన ప్రసంగాలు ఆయన కీర్తిని మరింత పెంచాయి. మన దేశ ఆర్థికవ్యవస్థ గురించి కూడా ఆయన చాలా రచనలు చేశారు. 'హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ'లో ప్రారంభించబోతున్న 'హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్' కోసం ఆయన్ని మన దేశం తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే గనక జరిగితే 'మా యూనివర్శిటీ కీర్తి గణనీయంగా పెరుగుతుంద'ని విద్యార్థులు, ప్రొఫెసర్లు అంటున్నారు.

ఆర్థికవేత్తగా కీర్తిప్రతిష్టలు మూటగట్టుకున్న జగదీష్ భగవతి నిజానికి 'లా' చదివి న్యాయవాది కావాలని ఆయన తండ్రి కోరిక. 'ఒక కొడుకు లాయర్ అయ్యాడుగా... అది చాలు అని నేను వారించేవాడిని. మా నాన్న కోరిక ఆయన బ్రతికి ఉండగా తీర్చలేకపోయాను కాని ఇప్పుడు నేను ఎకనామిక్స్‌తో పాటు లా ప్రొఫెసర్నయ్యాను. ఆ విధంగా కొంతయినా మా నాన్న కోరిక తీర్చగలిగాను' అని జగదీష్ భగవతి పేర్కొన్నారు.

న్యూరాలజిస్ట్‌గా...

భగవతి కుటుంబంలోనే మరొకరు డాక్టరై ప్రతిభలో తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. ఆయనే సనత్ ఎన్. భగవతి. 1952లో మెడిసిన్ డిస్టింక్షన్‌తో పూర్తి చేశారు. 1956లో లండన్‌లోని ప్రఖ్యాత ఆట్కిన్‌సన్ మార్లీ హాస్పిటల్‌లో 'రిజిస్ట్రార్'గా చేరారు. ఆ సమయంలో గ్రేట్ బ్రిటన్‌లోనే గొప్ప న్యూరోసర్జన్‌గా పేరొందిన కెన్నెత్ టిల్ అనే డాక్టర్‌తో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్న సనత్ ఆ తర్వాత చికాగోలోని చ్రిల్డన్స్ మెమోరియల్ హాస్పిటల్‌లో పని చేశారు. ఆ సమయంలోనే తన ప్రతిభాపాటవాలతో గొప్ప న్యూరోసర్జన్‌గా పేరు సంపాదించి స్వదేశం తిరిగొచ్చారు. 1962లో బాంబే హాస్పిటల్‌లో కన్సల్టెంట్ న్యూరోసర్జన్‌గా, గ్రాంట్ మెడికల్ కాలేజిలో గౌరవ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. అప్పటి నుండి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ది న్యూరొలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా, ట్రెజరర్‌గా, సెక్రటరీగా... ఆ తర్వాత 1989లో ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో న్యూరోసర్జన్ల సంఘాలలో వివిధ స్థాయిల్లో పని చేశారు. 'ఆసియన్ ఆస్ట్రేలియన్ సొసైటీ ఆఫ్ న్యూరోసర్జన్స్'కి అధ్యక్షుడై, ఆ తర్వాత 2005లో ఇంటర్నేషనల్ న్యూరలాజికల్ పీడియాట్రిక్ సొసైటీకి కూడా అధ్యక్షుడయ్యారు. ప్రపంచంలోనే ఒక న్యూరోసర్జన్‌కి దక్కే అతిపెద్దగౌరవం కూడా అదే.

ఫౌండ్రీ ఇంజనీర్...

అన్నల్లాగే పేరు తెచ్చుకున్నాడు ప్రవీణ్ భగవతి కూడా. పూనే ఇంజనీరింగ్ కాలేజిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రవీణ్ ఉన్నత చదువులకోసం జర్మనీ వెళ్లారు. ఆ దేశంలోని 'ఆచెన్ హోచూల్' నుండి 1962లో పిహెచ్‌డీ పూర్తి చేశారు. తన అన్నల్లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించారో ఏమో ప్రవీణ్ తన పరిశోధనా జ్ఞానంతో వ్యాపారం వైపు దృష్టి సారించారు. అహ్మదాబాద్‌లో 'భగవతి ఆటోకాస్ట్స్ లిమిటెడ్' స్థాపించారు. మన దేశంలోని అన్ని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలకి కావాల్సిన స్పేర్‌పార్ట్‌లను తయారు చేస్తుంది ఆ సంస్థ. వ్యాపారంతోపాటు పరిశోధనలో కూడా రాణించిన ఆయన 'ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఫౌండ్రీమెన్'కు అధ్యక్షుడయ్యారు. మన దేశంలో ఆటోమొబైల్స్‌కి పెరుగుతున్న గిరాకీతోపాటు ఆటోకాస్ట్ ఇండస్ట్రీ కూడా గతంలో మరెన్నడూ లేనంతగా ఎదుగుతోంది. అయితే దానికో దిశను నిర్దేశించింది మాత్రం ప్రవీణే. అందుకే ఆయన చేసిన కృషి ఫలితంగా 2006లో 'వరల్డ్ ఫౌండ్రీమెన్ ఆర్గనైజేషన్'కి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

***

నలుగురు అన్నదమ్ములూ తమతమ రంగాల్లో ఉన్నతస్థానాలు అ«ధిరోహించిన వైనాన్ని ప్రస్తావిస్తూ జగదీష్ భగవతి ఇలా అన్నారు. "చదువుకి ఉన్న విలువను మా నాన్న నుంచి చిన్నప్పుడే తెలుసుకున్నాం. కేవలం తెలుసుకోవడంతో ఊరుకోకుండా దానిని ఆచరణలో పెట్టాం. భగవతి టౌన్‌షిప్ గనక నిర్మిస్తే అందులో ఉండే వాళ్లందరూ ప్రముఖులే అవుతారని మా ఫెండ్స్ నవ్వుతుంటారు.''

- నాగేశ్వరరావు తమనం

Monday, September 6, 2010

caught on facebook


కవర్‌స్టోరీ

చౌరస్తాలో నిలబడ్డట్టే

కన్నతల్లికోసం ముప్పయ్యేళ్లు ఎదురు చూసిన ఒకామెకి ఆ తల్లిని ఒకే ఒకరోజులో వెతికి పెట్టింది.
చెయ్యని నేరానికి జైలు కెళ్లిన ఓ యువకుణ్ణి నిర్దోషిగా నిరూపించింది.
ఒంట్లో బాగోలేదని సాకులు చెప్పి పని ఎగ్గొట్టిన ఒక ఉద్యోగి గుట్టు బయటపెట్టింది.
డిప్రెషన్‌లో ఉన్నానంటూ హెల్త్ ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్ చేసుకుని ఆ సమయమంతా పార్టీల్లో ఎంజాయ్ చేసిన ఒకామెకి ఆ డబ్బు రాకుండా చేసింది.
లాగ్ అవుట్ చెయ్యని పాపానికి ఒకాయన చేసిన దొంగతనాలన్నీ బయటపెట్టింది.
మనసులో ఉన్నదాన్ని వ్యక్తపరిచినందుకు మరొకరి ఉద్యోగమే పోగొట్టింది.
ఈ 'మంచి చెడు'లన్నీ చేస్తున్నది ఏ నిఘా సంస్థో కాదు. వికీలీక్స్ అంతకన్నా కాదు. అదో ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్క్. ఇంటర్నెట్ వాడే వాళ్లందరికీ చిరపరిచితమైన ఫేస్‌బుక్. ఆ విశేషాలే ఈ వారం కవర్‌స్టోరీ.


ఆన్‌లైన్లో అమ్మ దొరికింది

డానా లారీకి ఇప్పుడు 41 ఏళ్లు. కాలిఫోర్నియాలోని రోజ్‌విల్లెలో నర్స్‌గా పని చేస్తున్న ఆమెకి తనని పసితనంలోనే దత్తత తీసుకొన్నారని తెలుసు. ఆ ఒక్కముక్క తప్ప తన అసలు తల్లిదండ్రులెవరో, వాళ్లు ఎక్కడుంటారో తెలీదు. వాళ్ల గురించి తెలుసుకోవడానికి లారీ చేయని ప్రయత్నం లేదు. పిల్లల్ని దత్తత ఇచ్చే ఎన్నో సంస్థల్ని సంప్రదించింది. వాళ్ల రికార్డులన్నీ తిరగేసింది. 'ఎడాప్షన్ ఏజెన్సీలు' ఆన్‌లైన్లో పొందు పరిచిన జాబితాలన్నీ జల్లెడ పట్టింది. ఇలా కొన్నాళ్లపాటు వెతికినా ఎలాంటి ఆధారాలుగానీ, కనీసం వారి ఆనవాళ్లు గానీ ఏమీ దొరకలేదు ఆమెకి.

ఈ సంవత్సరం జనవరి 10న ఫేస్‌బుక్‌లో చేరి తన తల్లికోసం వెతుకుతున్నట్లు చెప్పుకుంది. ఫేస్‌బుక్ ద్వారా ఈ వార్త లక్షల మందికి చేరింది. వారిలో కొందరు 'అమ్మ'ను వెతకడానికి పూనుకున్నారు. ఆ నోటా ఈ నోటా పాకి అది చివరకు వాళ్లమ్మను చేరింది. దీనంతటికీ పట్టింది 24 గంటలే. అంటే కొన్నేళ్లుగా తాను వెతుకుతున్న అమ్మని ఆమె ఫేస్‌బుక్‌లో 24 గంటల్లోనే వెతుక్కోగలిగింది. అంతేకాదు జనవరి 15 కల్లా తన తండ్రిని కూడా కలుసుకోగలిగింది.

ఇన్నేళ్లుగా తనకీ ఆలోచన ఎందుకు రాలేదు అనుకుని ఆశ్చర్యపోతోంది లారీ. ఇంటర్నెట్‌లేని రోజుల్లో దత్తత తీసుకోబడిన చాలామందికి వారి అసలు తల్లిదండ్రులెవరో తెలుసుకోవడం కొంచెం..కాదు కాదు చాలా కష్టం. అయితే లారీ తన తల్లిదండ్రుల్ని కనుగొనడంతో ఇప్పుడు చాలామంది ఇదే బాట పడుతున్నారు. అయితే వాళ్లని దత్తత తీసుకున్న పేరెంట్స్‌కి ఇది పెద్ద సమస్య అవుతోంది. వాళ్లు అసలు తల్లిదండ్రులకే దగ్గరైపోతారేమోనని దత్తత తీసుకున్న వాళ్లు ఆందోళన చెందుతుంటే, తమ పిల్లల్ని ఆన్‌లైన్లో చూసి వారి గురించి తెలుసుకుని పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని పశ్చాత్తాపం చెందుతున్నారు అసలు తల్లిదండ్రులు.

రెండేళ్లు వెనక్కి వెళితే- లారీయే 19 ఏళ్ల క్రితం దత్తత ఇచ్చిన తన కొడుకుని 'మై స్పేస్' అనే మరో సోషల్ నెట్‌వర్క్ ద్వారా కలుసుకోగలిగింది. ఇప్పుడు లారీ తన కొడుకు, అమ్మ, నాన్న... అందరినీ కలవగలిగింది. ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడూ కలుసుకుంటారు. ఫేస్‌బుక్ ఉంది కాబట్టి ఎవరెక్కడుంటున్నారో తెలుసుకోవడం సులభమవుతోంది అంటున్నారు.

మెసేజ్ సేవ్ చేసింది...

న్యూయార్క్‌కి చెందిన 19 ఏళ్ల రోడ్నీ ఫేస్‌బుక్ సహకారంతో జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. అలా తప్పించుకున్న మొట్టమొదటి వ్యక్తి అతనే అని అక్కడి న్యాయవాదులు అంటున్నారు. 2009 అక్టోబర్‌లో ఓ మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తుల్ని గన్‌తో బెదిరించి ఎవరో దోచుకున్నారు. అయితే అంతకుముందు ఓ దొంగతనం కేసులో రోడ్నీ హస్తం ఉండడంతో ఇది కూడా తనే చేశాడని పోలీసులు భావించి అతన్ని జైల్లో పెట్టారు. దొంగతనాన్ని చూసిన వాళ్లు కూడా అది చేసింది రోడ్నీయే అని సాక్ష్యం చెప్పడంతో అతనికి శిక్ష ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే రోడ్నీకి తెలుసు నిజమేమిటో. కానీ అదెలా నిరూపించాలో తెలియలేదు.

చివరికి ఫేస్‌బుక్‌తో అది సాధ్యమైంది. ఆ దొంగతనం జరిగినప్పుడు రోడ్నీ మాన్‌హాటన్‌లోని తన తండ్రి అపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు. ఆయన కంప్యూటర్ నుండి రోడ్నీ తన గర్ల్‌ఫ్రెండ్‌కి ఫేస్‌బుక్‌లో మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్‌ను రోడ్నీ తండ్రి కోర్టుకు సమర్పించాడు. జడ్జి కూడా ఫేస్‌బుక్ ఓపెన్ చేసి ఆ మెసేజ్ ఏ టైమ్‌కి వెళ్లిందో, ఏ 'ఐపి' అడ్రస్ నుంచి వెళ్లిందో పరిశీలించి రోడ్నీ తండ్రి ఐపి అడ్రస్ నుంచే వెళ్లిందని నిర్ధారించుకున్నాడు. ఒకే వ్యక్తి రెండు చోట్లా ఎలా ఉంటాడు అని అడిగి కేసు కొట్టి వేశాడు. మొత్తం మీద రోడ్నీని ఫేస్‌బుక్ అలా రక్షించింది. ఇంటర్నెట్‌లో మనం మెసేజ్‌లు పంపించినా, చాటింగ్ చేసినా, మెయిల్ చేసినా ఆ సమయం రికార్డు అవుతుంది. దాన్ని ట్యాంపర్ చెయ్యడం ఎవరి వల్లా కాదు. అందుకే ఇప్పుడది 'అథెంటిక్ ప్రూఫ్' అని న్యూయార్క్ పోలీసులు అంటున్నారు.

వైట్‌హౌస్ 'సెక్యూరిటీ'ని బయట పెట్టింది...

మిచెల్లె, తరిక్ సలాహిలు వాషింగ్టన్ వాసులు. ఆ నగరంలోని 'బ్రేవో' అనే టెలివిజన్ చానల్ నిర్వహించే 'ది రియల్ హౌజ్‌వైవ్స్ ఆఫ్ డి.సి.' అనే రియాలిటీ షోలో ఎలాగైనా పాల్గొనాలని నిశ్చయించుకున్నారు ఈ జంట. అయితే ఆ షోలో పాల్గొనే అవకాశం రావడం అంత తేలిక కాదు. రాత్రికి రాత్రే ఇన్‌స్టంట్‌గా పాపులర్ అయిన వ్యక్తులకి మాత్రమే దాంట్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ. ఏదో ఒక వింత పనో కొంటె పనో చేస్తే తప్ప అప్పటికప్పుడే అంత పాపులారిటీ ఎలా వస్తుంది చెప్పండి? అందుకే అలాంటి పని ఒకటి చేయాలనుకున్నారు ఆ జంట. మన దేశ ప్రధాని గత ఏడాది నవంబర్‌లో అమెరికా సందర్శించినపుడు ఆయన గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు నవంబర్ 24 సాయంత్రం విందు ఇచ్చారు. ఆ విందుకి ఆహ్వానం కొద్దిమంది ప్రముఖులకి తప్ప మరెవరికీ ఉండదు.

అయినా దానిలోకి ఆహ్వానం లేకుండా చొరబడాలనుకున్నారు. అనుకోవడమే కాదు, అంత పని చేసి చూపించారు కూడా. అమెరికా అధ్యక్ష భవనం సెక్యూరిటీని కూడా దాటుకుని ఎలాగైతేనేం లోపలికెళ్లారు. బరక్ ఒబామాతోటి, ఇతర ప్రముఖులతోటి కరచాలనాలు, పలకరింపులు లాంటివి జరిగాయి. అందరు నాయకులతోటి ఫోటోలు కూడా దిగారు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోలన్నీ మిచెల్లె ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది. వైట్‌హౌస్ సెక్యూరిటీ ఎంతబాగా పనిచేస్తోందో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోవడమే కాకుండా మిచెల్లె, తరిక్ సలాహీలు సెలబ్రిటీలయిపోయారు. ఫేస్‌బుక్‌లో వాళ్లకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అనుకున్నట్టుగానే వాళ్లు ఆ రియాలిటీ షోలో పాల్గొనడానికి ఎంపికయ్యారు.

అంత ఆసక్తి పనికి రాదు...

హాలిడేస్‌లో మనం ఎక్కడెక్కడ తిరిగామో, ఏయే ప్రదేశాలు సందర్శించామో... ఎంత ఎంజాయ్ చేశామో... ఆ వింతలూ విశేషాలూ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌తో అప్పటికప్పుడే పంచుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చెయ్యొచ్చు, వాటి గురించి రాయొచ్చు. అందరిలాగే అదే పని చేశాడు మ్యాక్సి సోపో. ఆ విశేషాలే ఆయన్ని జైలు పాలు చేశాయి. అమెరికాలోని సీటిల్‌కి చెందిన 26 ఏళ్ల సోపో ఓ బ్యాంకు నుండి రెండులక్షల డాలర్లు కాజేసి మెక్సికో పారిపోయాడు. తన వద్ద ఉన్న డబ్బుతో అక్కడ తెగ ఎంజాయ్ చేశాడు. చేస్తే చేశాడు కాని ఆ విశేషాలన్నీ ఎవరికీ చెప్పకుండా ఉంటే బాగుండేది. కాని సోపో మాత్రం 'నేను స్వర్గంలో ఉన్నాన'ంటూ ఫేస్‌బుక్‌లో తన విహార యాత్ర విశేషాలన్నీ రాశాడు. అంతటితో ఆగకుండా ఆ విశేషాల్ని సాధ్యమైనంత ఎక్కువమందితో పంచుకోవాలనుకుని ఫేస్‌బుక్‌లో ఎవరిని పడితే వారిని ఫ్రెండ్స్ లిస్ట్‌లో చేర్చుకుని ఆ విశేషాలన్నీ తెలిపాడు. ఐతే సోపో అమెరికా న్యాయశాఖ అధికారి ఒకాయన్ని కూడా ఫ్రెండ్స్ లిస్ట్‌లో చేర్చుకోవడంతో ఆయన సోపో గురించి ఆరాతీశాడు. చివరికి సోపోని మెక్సికోలో అరెస్టు చేసి అమెరికా తీసుకొచ్చారు.

గ్రూప్ తెచ్చిన కష్టాలు....

ఒక దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగేంత కెపాసిటీ ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌కి ఉందో లేదో కాని క్రొయేషియా ప్రధాని మాత్రం ఆ గ్రూప్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. ఆ దేశ ప్రధాని ఇవో శానాడర్‌ను 'ఇష్టపడని వాళ్లని కనీసం 5000 మందినన్నా కూడగడతాను' అనే పేరుతో ఓ ఫేస్‌బుక్ గ్రూప్‌ను 22 ఏళ్ల నిక్సా క్లెకాక్ అనే యువకుడు ప్రారంభించాడు. ఆ విషయం ప్రభుత్వాధికారులకి తెలిసి ఆయన్ని అరెస్టు చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రభుత్వం హరించి వేస్తున్నదని జనం ఆ అరెస్టుని నిరసించారు.

అయితే అరెస్టుకి కారణం క్లెకాక్ ఆ గ్రూప్‌ని మొదలుపెట్టడం కాదని, ఆ గ్రూప్‌లో ఉంచిన ప్రధాని ఫోటో గురించి అని చెప్పారు. నాజీ యూనిఫార్మ్‌లో ఆయన ఫోటో పెట్టాడు. కాబట్టి ప్రధానిని ఆ డ్రస్‌లో చూపడం నేరమని అన్నారు. చివరికి తేలిందేమిటంటే ఆ గ్రూప్‌లో చేరిన వాళ్లలో ఎవరో ఆ ఫోటోని పెట్టారని, క్లెకాక్‌కి దానితో ఏ సంబంధం లేదని. అయితే అప్పటికే ఆ యువకుడు జైలుకెళ్లాల్సి వచ్చింది.

ఆఫీస్‌కి డుమ్మా కొడితే....

21 ఏళ్ల కైల్ డాయిల్ 2008 అక్టోబర్‌లో ఓ రోజు ఫేస్‌బుక్ ఓపెన్ చేసి తన స్టేటస్ మెసేజ్‌లో 'ఫుల్‌గా తాగాను...అందుకే ఆఫీసుకి పోవట్లేదు' అని రాసుకున్నాడు. ఆస్ట్రేలియాకి చెందిన డాయిల్ ఒక కాల్ సెంటర్ ఉద్యోగి. మీ సీక్రెట్‌లు ఇతరులకి తెలిస్తే దానికి మేం బాధ్యులం కాదు అని ఫేస్‌బుక్ పదేపదే పేర్కొంటున్నా డాయిల్ లాంటి చాలామంది తామేం చేసినా ఫేస్‌బుక్‌లో రాసుకుంటున్నారు. ఒంట్లో బాగోలేదని ఆఫీస్‌కి సెలవు పెట్టిన డాయిల్ ఫేస్‌బుక్ పేజ్‌ని ఆఫీస్‌లో వాళ్లు చూశారు.
అనారోగ్యం సాకుతో శెలవు తీసుకున్నాడని గ్రహించి జీతంలో కోత విధించారు. అయితే ఫేస్‌బుక్‌లో తాను అలా రాసినందువల్లే జీతంలో కోత పడిందని డాయిల్‌కి తెలీదు. అకారణంగా తన జీతంలో కోత విధించారని, తాను అనారోగ్యం వల్లనే ఆఫీస్‌కి రాలేదని బుకాయించాడు. అప్పుడు తాను ఫేస్‌బుక్‌లో రాసిన దాన్ని తీసి ఆయనకే మెయిల్ చేశారు. జీతంలో కోత పడినా డాయిల్‌కు మాత్రం కొందరు ఫాన్స్ దొరికారు. ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఫేస్‌బుక్ గ్రూపులు కూడా మొదలు పెట్టారు.

లాగవుట్ చెయ్యకపోతే అంతే మరి...

ఫేస్‌బుక్‌కి ఎంతగా బానిస అయిపోయినా దొంగతనానికి వెళ్లినపుడు ఆ పనేదో చూసుకోవాలి కాని కంప్యూటర్ కనపడిందని ఫేస్‌బుక్‌లోకి ఎంటరైపోకూడదు. రోమ్‌లో జొనాథన్ పార్కర్ అనే దొంగ ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. కంప్యూటర్ కనిపించడంతో ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. అయితే దొంగతనం చేయాలనే హడావిడిలో లాగ్అవుట్ చెయ్యడం మర్చిపోయి వెళ్లిపోయాడు. తర్వాత సీన్‌లోకి ఎంటరైన పోలీసులు ఆ ఫేస్‌బుక్ ఎకౌంట్ ఓపెన్ చేసి ఉండడం చూసి ఆయనే దొంగ అని నిర్థారించుకుని దాంట్లో ఉన్న వివరాల ద్వారా ఎలాగైతేనేం ఆయన్ని పట్టుకున్నారు.

పార్టీలకెళ్తే...హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా వస్తుంది?

ఉద్యోగులు, ఉద్యోగార్థులు తమ ఆన్‌లైన్ ఇమేజ్‌ని కాపాడుకోవాలని, తమకి సంబం«ధించినంత వరకు ఎలాంటి నెగటివ్ విషయాలు ఎక్కడా రాకుండా ఉండాలని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా ఇరుక్కుపోతారు. అలాగే దొరికిపోయింది నటాలీ బ్లెంకార్డ్ అనే కెనడాలోని క్యుబెక్ వాసి. పని వత్తిడి వల్ల డిప్రెషన్‌కి లోనయ్యానని, అందుకు గాను తనకు రావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని అప్లయ్ చేసుకొంది. అయితే ఆమె ఆ శెలవు రోజుల్లో పార్టీలకి, ఫంక్షన్లకి తిరుగుతూ ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలని ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఆ ఫొటోలని చూసిన ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె ఇప్పుడు కోర్టుకెక్కింది. మరి కోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.

'మా మంచి అమ్మ'గా ఉంటే అంతే

అమెరికాలోని ఒహయోలోని ఓ స్కూల్లో పార్ట్ టైం టీచర్‌గా పనిచేసే మేరీ ఎలెన్ హౌస్ మంచి అమ్మగా ఉండాలనుకుందో ఏమో తన కొడుకుతో పాటు మరో ముగ్గురు విద్యార్థులు తన ఇంట్లో మందు తాగడానికి పర్మిషన్ ఇచ్చేసింది. అయితే ఆ టీనేజ్ స్టూడెంట్స్ పార్టీ చేసుకుని ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. విద్యార్థులు ఆన్‌లైన్లో ఏయే వెధవ వేషాలేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉన్న ఆ స్కూల్ రిసోర్స్ ఆఫీసర్ ఆ ఫొటోలు చూశాడు. తన ఇంట్లో మందు తాగనిచ్చినందుకు మేరీకి 30 రోజులు జైలు శిక్షతోపాటు 500 డాలర్ల ఫైన్ వేశారు.

అన్నీ అనుకున్నట్టు జరగవుగా. ఇలాంటి సంఘటనల వలనో లేదా రోజూ గంటల కొద్దీ ఫేస్‌బుక్‌లో గడపడం వల్ల బోర్ కొట్టిందో ఏమో ఇప్పుడు దాని నుంచి బయటపడాలనుకునే వారు కూడా ఎక్కువవుతున్నారు. అందుకే గూగుల్‌లో '"how to delete Facebook account'' అనే సెర్చ్‌లు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఈ జనరేషన్ అంతే. ఏ నెట్‌వర్క్‌లోనైనా చేరడం, అంతలోనే అది నచ్చక బయటికొచ్చేయడం అన్నీ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతున్నాయి.

ఫేస్‌బుక్ జనాభా ఎంత?

యాభై కోట్లు దాటిందని ఆ మధ్య పత్రికల్లో కూడా వచ్చింది. అవును... దాన్నే గనక ఒక దేశం అనుకుంటే జనాభా పరంగా అది ప్రపంచంలోనే మూడో పెద్ద దేశమవుతుంది. ప్రపంచంలోని ప్రతి నలుగురు నెటిజన్లలో ఒకరు ఫేస్‌బుక్ యూజర్. నిజానికి దానిది స్కూల్లో చేరే వయస్సే... అంటే జస్ట్ సిక్స్ ఇయర్స్. అవును పుట్టిన ఆరేళ్లకే ఈ సోషల్ నెట్‌వర్క్ అంతగా ఎదిగి ఇంటర్నెట్ సూపర్‌పవర్స్‌లో ఒకటిగా మారింది. హార్వర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ మార్క్ జూకర్‌బర్గ్ రూపొందించిన ఈ నెట్‌వర్క్ ఇప్పుడు ప్రపంచంలోనే మరే నెట్‌వర్క్‌కి లేనంతమంది యూజర్లని సంపాదించుకుంది. దీన్ని రూపొందించినపుడు జూకర్‌బర్గ్ వయసు 21 ఏళ్లు.

మైక్రోసాఫ్ట్ మనకి కంప్యూటర్లని చేరువ చేయడమే గాక వాటిని ఉపయోగించడం సులభతరం చేసింది. కావల్సిన సమాచారాన్ని గూగుల్ ఒక సెర్చ్‌తో మన కళ్లముందు ప్రత్యక్షమయ్యేలా చేసింది. యూట్యూబ్ మనల్ని వీడియోలతో ఎంటర్టెయిన్ చేస్తూనే ఉన్నది. అయితే ఫేస్‌బుక్ అలాకాదు. మనల్ని కంప్యూటర్‌కి అతుక్కుపోయేలా చేస్తుంది. మన భావాల్ని వ్యక్తపరచడానికి, కొత్త స్నేహాల్ని ఏర్పరచుకోవడానికి, పాత స్నేహితుల్ని వెదుక్కోవడానికి అదో అవకాశంగా మారింది. అందుకే ఎప్పుడో స్కూల్లో కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహాల గురించి ఆరా తీయాలన్నా ఇప్పుడు జనమంతా మరోమారు ఆలోచించకుండా ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేస్తున్నారు.

13 ఏళ్లు దాటితే చాలు

13 ఏళ్లు దాటిన వాళ్లెవరైనా ఫేస్‌బుక్‌లో చేరొచ్చనడంతో హైస్కూల్ స్టూడెంట్స్ కూడా ఫేస్‌బుక్‌లో ఎకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. విద్యార్థులేం చేస్తున్నారో ఆరా తీయడానికి టీచర్లు... పిల్లలేం చేస్తున్నారో తెలుసుకోవడానికి తల్లిదండ్రులు... ఫ్రెండ్స్ గురించి తెలుసుకోడానికి తోటి వాళ్లు... ఇలా అన్ని వయసుల వాళ్లూ ఫేస్‌బుక్‌లో చేరుతున్నారు. అందుకే ఇప్పుడు నెటిజెన్లకి అది క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. ఎవరెక్కడున్నా, ఏం చేస్తున్నా ఆ విశేషాలన్నీ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమవుతున్నాయి.

ఇతరులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి, తొంగి చూసే అలవాటు ఎంతో కొంత అందరిలోనూ సహజంగా ఉండేవే కాబట్టి అలాంటి వారందరూ ఫేస్‌బుక్‌లో ఎదుటివాళ్ల గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. ఫేస్‌బుక్ జనాభా పెరుగుతున్నట్టే దాంట్లో తమ సొంత విషయాల్ని పేర్కొనడం కూడా ఎక్కువైంది. ఇంతకు ముందు వ్యక్తిగతం అనుకున్న చాలా విషయాలు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో రాస్తున్నారు. అందుకే ఇప్పుడు ఒక్కొక్కరి ఫేస్‌బుక్ ఎకౌంటూ ఒక్కో ఓపెన్ డైరీ. ఉద్యోగులు తమ బాస్‌ల గురించి, విద్యార్థులు లెక్చరర్ల గురించి కామెంట్లు రాయడానికి ఫేస్‌బుక్‌నే ఎంచుకొంటున్నారు.

ఈ మెయిల్‌లా కాకుండా ఫేస్‌బుక్‌లో రాసిన వాటిని ఎవరైనా చూడొచ్చు. సగటున ఒక్కొక్కరూ కనీసం గంట సేపు ఫేస్‌బుక్ వాడుతున్నారు. రోజుకి కోట్లలో మెసేజ్‌లు రాస్తున్నారు. వారానికి పదికోట్ల కొత్త ఫొటోలొచ్చి ఫేస్‌బుక్‌లో చేరుతున్నాయి. పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లు, పుట్టినరోజులు దగ్గర్నుంచి వీకెండ్ పార్టీల దాకా ఏ చిన్న విశేషమైనా దాని ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టడం, వాటి సంగతుల్ని వివరించడం ఇప్పుడు నెటిజన్లకి ఫేవరైట్ పాస్‌టైం. అయితే ఒక్కోసారి ఆ ఫోటోలు, మనం రాసే రాతలే మనల్ని ఇరకాటంలో పెట్టొచ్చు. ఒక్కోసారి మనల్ని రక్షించనూ వచ్చు. అందుకే ప్రైవసీ గురించి కొత్త చర్చని లేవనెత్తింది ఫేస్‌బుక్. దాచుకోవడం నుంచి ప్రదర్శించడం వైపు ఆ చర్చ మళ్లింది.