Thursday, December 23, 2010

జస్ట్ మైనస్.. అంతే!


ఎంత చలేస్తోందంటే...
పెదాలు పగిలి.. నవ్వొచ్చినా నవ్వలేనంత...
పాదాలు పగిలి.. నడవాలన్నా నడవలేనంత...
పల్లెటూళ్లలో అయితే పొద్దున్నే చలిమంటలు వేసుకునేంత...
పట్టణాల్లో అయితే ముసుగు తన్ని బారెడు పొద్దెక్కేదాకా పడుకునేంత...
ఉష్ణోగ్రత పది డిగ్రీలకి చేరితేనే మనం గజగజా వణికిపోతున్నాం... స్వెటర్లు, ఇన్నర్లు వేసుకుంటున్నాం... చాలక షాల్స్ కప్పుకుంటున్నాం... అరికాళ్లకి సాక్స్ తొడుక్కొని, తలకి మంకీ క్యాప్ తగిలించుకుంటున్నాం.
...అదే ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే దేశాల్లో అయితే ఉష్ణోగ్రత మైనస్ 70 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోతుంది... అంత చలిలో అసలు జనం బయట తిరగగలుగుతారా? ఇంట్లోనే హీటర్లు పెట్టుకుని గడిపేస్తారా? అలా అయితే సంవత్సరంలో సగం కాలం వాళ్లు ఇంటికే పరిమితమై ఉండాల్సి ఉంటుంది. అలా ఉండలేకో లేక అలవాటయ్యో అక్కడి జనం అంత చలిలో కూడా ఘనీభవించిన నదులపై ఆటలాడుకుంటారు... డాగ్‌రేస్‌లు, స్కీయింగ్ పోటీలతో బిజీగా గడుపుతారు. ఆ ప్రాంతాల్లో ఉండే జంతువులు కూడా చలికాలాన్ని రకరకాలుగా ఆస్వాదిస్తాయి. ఆ వింతలు విశేషాలే ఈ వారం కవర్ స్టోరీ!

ఎముకలు కొరికే చలిని ఎంత బాగా ఆస్వాదించవచ్చో, చలిపులికి భయపడకుండా మంచుకురిసే కాలంలో ఎన్ని రకాల ఆటలాడుకోవచ్చో మనకు తెలియాలంటే... ఉత్తర ధృవానికి సమీపంగా ఉండే కెనడా, గ్రీన్‌లాండ్, స్వీడన్, నార్వే, ఫిన్‌లాండ్, రష్యా లాంటి దేశాలకి వెళ్లాల్సిందే...

స్వీడన్: ఐస్ హోటల్


ఐస్‌తో కట్టిన హోటల్ రూమ్‌లో ఐస్‌తో చేసిన కుర్చీలో కూర్చుని భోజనం చేశాక ఐస్ బెడ్ మీద దుప్పటి పరుచుకుని నిద్రపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి... వింటుంటేనే థ్రిల్లింగ్‌గా ఉంది కదూ. కాని ఆ పని చేయాలంటే స్వీడన్ వెళ్లాలి. ఆ దేశం లోని 'జుక్కాస్‌జార్వి' అనే చిన్న పట్టణ సమీపాన టార్న్ నదిపైన ఉంటుంది ఈ ఐస్ హోటల్. ఆర్కిటిక్ వలయానికి 200 కిలోమీటర్లు ఉత్తరంగా ఉంటుంది ఈ ప్రాంతం. చలి కాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుంది. అంతా సరే కాని మంచుతో హోటల్ ఎలా కడతారు?
ఏటా డిసెంబర్ వచ్చిందంటే చాలు ప్రపంచం నలుమూలల నుంచి మంచు ప్రేమికులు, ఆర్కిటెక్ట్‌లు ఇక్కడికి చేరుకుంటారు. ఆ ఏడాది నిర్మించబోయే 'ఐస్ హోటల్' డిజైన్‌ని తయారు చేసుకుంటారు. గడ్డ కట్టి ఉన్న టార్న్ నది నుంచి వేల టన్నుల హిమఖండాల్ని పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి కోస్తారు. వాటితో ఆ నది పైనే ఐస్ హోటల్ నిర్మిస్తారు. రిసెప్షన్ దగ్గర్నించి పై కప్పు, కుర్చీలు, టేబుళ్ళు, మంచాలు అన్ని ఐస్‌తోటే చేస్తారు. చివరికి మంచినీళ్ళు, మందు తాగే గ్లాస్‌లు కూడా మంచుతో చేసినవే. ఈ హోటల్లో ఐస్ బార్, కాన్ఫరెన్స్ హాల్స్, ఐస్ చర్చ్ కూడా ఉంటాయి. డిసెంబర్ 20కల్లా ఈ హోటల్ సిద్ధమై మార్చి నెల వరకూ కొనసాగుతుంది. ఈ నాలుగు నెలల్లో ప్రపంచం నలుమూలల నుండి వేలాదిమంది వచ్చి ఈ హోటల్‌ని సందర్శిస్తూ ఉంటారు.

అంతర్జాతీయ సందర్శకులు పెరగడం వల్ల బ్రిటన్ నుంచి ఇక్కడికి నేరుగా విమాన సర్వీసుని కూడా ప్రవేశపెట్టారు. యూరోపియన్లకి ఈ ఐస్ హోటల్‌ని సందర్శించడం ఒక కల. అంతేకాదు వందలాది ప్రేమ జంటలు ఇక్కడ ఐస్ చర్చ్‌లో పెళ్ళి చేసుకుని ఒకటవుతుంటారు. 1992లో మొదటి సారి ఈ హోటల్‌ని నిర్మించారు. దీనికి క్రేజ్ పెరగడంతో ఇప్పుడు కెనడా, రష్యా, నార్వే దేశాల్లో కూడా ఐస్ హోటళ్లు వెలిశాయి. టార్న్ ఐస్ హోటల్ మూతబడే సమయంలోనే స్వీడన్‌లో మరో భారీ పోటీ జరుగుతుంది. అదే 'స్కీయింగ్ రేస్'

స్వీడన్: స్కీయింగ్

చలి కాలంలో ఆరు బయట ఆడుకునే ఆటల్లోకల్లా ఎక్కువ పాపులర్ ఆట స్కీయింగ్. కాళ్ళకి మీటర్ పొడవుంటే పలుచని ప్లేట్‌లు, రెండు చేతుల్లో రెండు అంతే పొడవున్న 'స్టిక్'లు... అరికాలి నుంచి తలదాకా అంతా కప్పేసి ఉండే 'హాట్ సూట్' వేసుకున్న స్కీయర్లు మంచుకొండల్లో చాలా వేగంగా దూసుకుపోతుంటారు. ఉత్తర అమెరికా, యూరోపియన్ దేశాల్లో... మంచు పర్వతాలుండే ప్రాంతంలో ఈ రేస్‌లు జరుగుతాయి. స్వీడన్‌లో జరిగే 'గ్చట్చజూౌఞఞ్ఛ్ట' రేస్ ఈ రేసులన్నిట్లోకి పెద్దది. ఇందులో ఏటా 16 వేల మందికి పైగా పాల్గొంటారు. కొండలు, గుట్టలు దాటుకుంటూ, పడుతూ లేస్తూ 92 కి.మీ. దూరం ప్రయాణించి గమ్యాన్ని చేరుకోవడం మహామహా స్కీయర్లకే తేలిక కాదు. అది కూడా 12 గంటల్లోపల చేరుకోవాల్సి ఉంటుంది. ఏటా మార్చి నెల మొదటి ఆదివారం జరిగే ఈ పోటీని తిలకించడానికి లక్షల మంది వస్తారు. రేస్‌లకి వేదిక అయిన 'Dalarna' పట్టణం ఆ సమయంలో సందర్శకులతో నిండిపోతుంది. హోటళ్ళ రూములను నెలల ముందే బుక్ చేసుకంటారు.

మారథాన్ రన్నింగ్ పోటీలకి రెండు రెట్లు ఎక్కువ దూరం ఉండే ఈ రేస్‌ను నిర్వహించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. 500 ఏళ్ళ క్రితం గుస్తావ్ వాసా అనే ఆయన స్వీడన్ అంతటా పర్యటించి, ప్రజల్ని కూడగట్టి 'స్వీడిష్ తిరుగుబాటు'ని లేవదీశాడు. ఆ తర్వాత ఆయన స్వీడన్ రాజయ్యాడు. ఆ పర్యటన స్ఫూర్తితోటే ఇప్పటికీ శీతాకాలంలో స్కీయింగ్ రేసును నిర్వహిస్తున్నారట. 'గుస్తావ్ వాసా' పేరు నుంచే ఈ 'వాసాలొప్పెట్' కూడా వచ్చింది. ఏటా 3500 మందికి పైగా వాలంటీర్లు ఈ రేస్ ఏర్పాట్లలో పాలు పంచుకుంటారు. సుమారు నలభై దేశాల నుంచి వేల మంది స్కీయర్లు ఈ రేస్‌లో పాల్గొంటారు. గెలిచిన వారికి భారీ బహుమానాల్ని అందిస్తారు.

సైబీరియా: హాట్ స్ప్రింగ్స్


స్వీడన్‌కి సమాంతరంగానే ఉంటుంది రష్యాలోని సైబీరియా ప్రాంతం. సైబీరియా అంటేనే మంచు ఎడారుల నిలయం. ఉష్ణోగ్రత ఎప్పుడూ జీరోకి అటూ ఇటూ ఉంటుంది. అదే చలికాలంలో అయితే మైనస్ ఇరవైకి పడిపోతుంది. ఆ చలిని తట్టుకోవడానికే ట్యూమెన్ నగరంలో జనం కొలనుల్లో దిగి జలకాలాడతారు. అంత చలిలో నీటికొలనుల్లో జలకాలా అనుకోకండి. అవి వేడి నీటి కొలనులు. ఎవరో కాచి పోసిన నీళ్ళు కాదు. సహజంగా ఏర్పడిన కొలనులవి. రష్యాలోని మిగతా నగరాలతో పోలిస్తే ట్యూమెన్‌కి ఉన్న ప్రత్యేకత అక్కడున్న కొలనులే. అందుకే రష్యా రాజధాని మాస్కోతో పాటు చాలా ప్రాంతాల నుండి కొలనుల్లో ఈతకొట్టడానికి ఇక్కడ వాలిపోతుంటారు. ఈ వేణ్ణీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూ ఉపరితలం మొత్తం మంచుతో కప్పబడినా భూమి లోపల మాత్రం చాలా వేడిగా ఉంటుంది. 'నివురు గప్పిన నిప్పు'లాగా అన్నమాట. ఆ వేడివల్ల కొలనుల్లో ఉండే నీళ్ళు ఏడాది పొడవునా వెచ్చగానే ఉంటాయి. అందుకే మైనస్ డిగ్రీల చలిని తట్టుకోవడానికి 55 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఆ నీళ్ళలో దూకేస్తారు. కారుల్లోనే బట్టలు విడిచి పార్కింగ్‌కి 300 మీటర్ల దూరంలో ఉండే ఆ కొలనుల వద్దకి గజగజ వణుకుతూ పరుగుతీసి ఒక్కసారిగా నీళ్లలో దూకేసి ఊపిరి పీల్చుకుంటారు. గంటలసేపు అలా నీళ్ళల్లో గడిపి ఇక చాల్లే అనుకుని ఒడ్డుకు వచ్చేలోపే... ఐదారు సెకన్లలోనే వంటి మీద ఉన్న నీటి బిందువులు ఘనీభవించి 'ఐస్' అయిపోతాయట.

జపాన్: మంచు 'మంకీ'లు

వేడినీటిలో మునగవచ్చన్న తెలివి మనుషులకే కాదు కోతులకి కూడా ఉంటుంది. ఎంత కాదన్నా అవి మన పూర్వీకులు కదా! అంత తెలివి ఉంది కాబట్టే ఆ కోతులు వేణ్ణీళ్ళ ప్రవాహాల్లో చలికాలమంతా గడిపేస్తాయి.
జపాన్ ఉత్తర ప్రాంతంలోని 'యమనోచి' అనే పట్టణంలో ఓ కోతుల పార్కు ఉంది. అది 'యొకొయూ' నదీ లోయలో ఉంటుంది. ఆ పార్కుని 'హెల్స్ వ్యాలీ' అని పిలుస్తారు. అంటే 'నరక లోయ'. ఆ లోయలో ఉన్న వేడినీటి ప్రవాహమే దానికి ఆ పేరు తెచ్చింది. ఆ ప్రవాహంలో నీళ్ళు తెర్లుతూ ఉంటాయి. మంచు కప్పుకున్న కొండల మధ్య ఉండే ఆ కొలనుకు మనుషులు చేరుకోవాలంటే సాహసమే కాని ఆ కొండల్లోనే నివసించే మంచు కోతులకి అది చాలా చిన్న విషయం. మిగతా కాలమంతా పార్కులో గడిపే ఆ కోతులు చలికాలం వచ్చిందంటే చాలు ఉదయాన్నే బయల్దేరి కొలనుకి చేరుకుంటాయి. చీకటిపడేదాకా కొలనులోనే ఆడుకుంటూ చలి బారి నుంచి తప్పించుకుంటాయి. చీకటిపడగానే తిరిగి తమ ఆవాసాలకి వెళ్లిపోతాయి. చలికి భయపడి రాలేని సందర్శకులు ఆ నీటిలో మునిగే కోతుల్ని చూడడానికి మాత్రం సాహసం చేసి మరీ వస్తుంటారు. ఆ వానరాలు మాత్రం వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటాయి. ఒడ్డుకి వచ్చి మంచు ముద్దల్ని వారిపై విసురుతూ ఆటపట్టిస్తాయి.

వేడినీటిలో మునగాలనే తెలివితేటలు ఈ కోతులకి మొదటి నుంచే ఉన్నాయా అంటే... కాదంటున్నారు ఆ ప్రాంతం వాళ్లు. ఇదంతా 1963 తర్వాతే జరిగిందని అంటున్నారు. సహజంగా నీళ్ళంటే భయపడతాయట కోతులు. మరి ఏ కోతి ఎప్పుడు ప్రమాదవశాత్తూ జారి ఆ లోయలో పడిందో గాని అప్పట్నించి మొదలై ఉంటుంది ఈ కోతుల 'వేడినీటి విడిది' అంటున్నారు జపనీయులు.

కెనడా: రంగు మార్చుకునే కుందేళ్లు

కోతులు నీళ్ళలో దూకితే... కుందేలు చలికాలం రాగానే ఏకంగా తన రంగునే మార్చేసుకుంటుంది. అలా అయితేనే అది తనని తాను చలికాలంలో కాపాడుకోగలుగుతుంది... చలి నుంచి కాదు... దాన్ని వేటాడే జంతువుల నుంచి. దీన్ని 'పోలార్ హేర్' (ధృవ కుందేలు) లేదా మంచు కుందేలు అని అంటారు. అంటే ఊసరవెల్లి టైప్ అన్నమాట.
ఉత్తర అమెరికాలోని కెనడా, అలస్కాలలో ఎక్కువగా కనిపించే ఈ కుందేలు ఏడాదికి ఎనిమిది నెలలు బ్రౌన్ రంగులోనే ఉంటుంది. చలికాలం మంచు కురవడం మొదలైందంటే చాలు... తన వెంట్రుకల్ని తెల్లగా మంచు రంగులోకి మార్చేసుకుంటుంది. పొడవుగా, నిటారుగా ఉండే దాని చెవుల చివర్లో ఉన్న వెంట్రుకలు మాత్రమే మామూలు రంగులో ఉంటాయి. మిగతా శరీరమంతా తెల్లగా మారిపోతుంది. అందుకే పరీక్షగా చూస్తే తప్ప మంచులో దీన్ని గుర్తించలేము. మిగతా కాలంలో గడ్డి, చెట్ల ఆకులు తినే ఈ జంతువు చలికాలంలో మాత్రం అప్పుడు పూసే పువ్వుల్ని, చనిపోయిన జంతువుల మాంసాన్ని తింటుంది. దాని శరీరంలోని ప్రొటీన్లు చలికాలంలో తగ్గిపోవడం వల్ల వాటిని పొందడం కోసమే మాంసం తింటుందట. రంగు మార్చుకోవడమే కాదు ఆ కాలంలో కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే బయట తిరుగుతుంది. చలికాలం ముగిసే నాటికి మళ్లీ బ్రౌన్ రంగులోకి మారిపోతుంది. ఇలా పూర్తిగా రంగు మారడానికి ఎనిమిది నుంచి పది వారాలు పడుతుందట.

అన్నీ లాంగ్ స్లీప్‌లోకి

మంచు దట్టంగా కురిసే ప్రాంతాల్లో 'మంచు కుందేలు' లాంటి కొన్ని జంతువులు మామూలుగానే జీవించినా కొన్ని జీవాలు మాత్రం ఆ కాలంలో గాఢనిద్రలోకి జారుకుంటాయి. నెలల పాటు అలా నిద్రించి తిరిగి ఉష్ణోగ్రత పెరగగానే లేచి మామూలుగా తిరుగుతాయి. అలా నిద్రించడాన్నే సుప్తావస్థ అని అంటారు. అన్ని జీవాలూ మనుషుల్లా తగిన సౌకర్యాలు సమకూర్చుకోలేవుగా మరి. గబ్బిలాలు, పాములు, 'పెయింటెడ్ టర్టిల్' అనే రకం తాబేలు ఈ కోవలోకి వస్తాయి. ఇవన్నీ సుష్టుగా భుజించి శీతాకాలం వచ్చే నాటికి కొన్ని నెలలు ఆహారం లేకపోయినా తట్టుకునే శక్తిని సమకూర్చుకుంటాయి. చలికాలం ప్రారంభం కాగానే తమ ఆవాసాల్లోకి వెళ్లిపోయి నిద్రకి పూనుకుంటాయి. ఏ వారం, పది రోజులకో ఓసారి లేస్తాయి... మళ్లీ నిద్రపోతాయి. ఆ కాలంలో తిండి లేకపోవడం వల్ల చిక్కి సగమైపోతాయి... అయితేనేం మళ్ళీ తర్వాత బాగా తిని కొన్ని రోజులకు మామూలు స్థితికి వచ్చేస్తాయి.

ఒక్కో జంతువు శీతాకాలాన్ని ఎదుర్కొనడానికి ఒక్కో విధంగా రెడీ అవుతుంది. అందుకేనేమో వీటి ప్రవర్తనను ఆధారం చేసుకుని చాలా నమ్మకాలు ఏర్పడ్డాయి. ఈ కింద పేర్కొన్నవి జరిగితే శీతాకాలం ఎక్కువ రోజులు ఉంటుందని జనం నమ్మకం. అవేవంటే...
1. జంతువుల వెంట్రుకలు దట్టంగా పెరిగినప్పుడు
2. పిచ్చుకలు తమ గూళ్ళను చెట్లపై తక్కువ ఎత్తులో కట్టుకున్నప్పుడు, అవి ఆహారాన్ని ముందుగానే సమకూర్చుకుంటున్నప్పుడు
3. చీమలు పుట్టల్ని ఎత్తు మీద కట్టుకున్నప్పుడు
4. చలికాలానికి ముందే సాలీళ్లు ఎక్కువగా కనిపించినప్పుడు
5. పక్షులు ముందుగానే వలస వెళ్లిపోయినప్పుడు
... ఇలా ప్రజల్లో చాలా నమ్మకాలు ఉన్నాయి.
జంతువులన్నీ ఇలా శీతాకాలాన్ని గడపడానికి సిద్ధమవుతుంటే అలస్కాలోని వేటకుక్కలు మాత్రం రేస్‌కు సిద్ధమవుతూ ఉంటాయి. మంచులో వందల కిలోమీటర్లు పరిగెట్టగల కుక్కలు అవి.

అలస్కా: ది గ్రేట్ డాగ్ రేస్

అలస్కాలో ఏటా మార్చి నెల మొదటి శనివారం మొదలవుతుంది డాగ్ రేస్. ఒక్కో జట్టులో 16 కుక్కలు ఉంటాయి. ఓ చిన్న బండిపై వాటి యజమాని కూర్చుంటే ఆ కుక్కలన్నీ ఆ బండిని లాక్కుంటూ మంచు కొడల్లో 1,868 కి.మీ ప్రయాణించి గమ్యాన్ని చేరాల్సి ఉంటుంది. రేస్ పూర్తవడానికి 10 నుంచి 30 రోజులు దాకా పట్టవచ్చు. మార్గమధ్యంలో మంచు తుపానులకి, చలికి కుక్కలకు, మనుషులకు ఆరోగ్యం క్షీణించవచ్చు. అందుకే ఈ రేస్‌లో పాల్గొనడమంటేనే పెద్ద సాహసం. అయినా సరే ఎన్నో జట్లు ఈ రేస్‌లో పాల్గొంటాయి. కొండలు, టండ్రా గడ్డిభూములు, నదులు దాటుకుంటూ ప్రయాణిస్తాయి. ఒక్కోసారి ఉష్ణోగ్రత మరీ తగ్గి మైనస్ 70 డిగ్రీలకి చేరుతుంది. అయినా రేసులు మాత్రం ఆగిపోవు. డాగ్ రేస్ అంత పేరున్న క్రీడ అలస్కాలో మరొకటి లేదంటే ఆశ్చర్యం కాదు. అలస్కాకు చెందిన యాభైకి పైగా జట్లతోపాటు మరో 20 దేశాల నుంచి కూడా జట్లు వచ్చి ఈ రేసులో పాల్గొంటాయి. మహిళలు కూడా ఇందులో పాల్గొనడమే కాదు రెండుసార్లు గెలిచారు కూడా! ఇంతదూరం సాగే రేస్ భూమి మీద మరోటి లేదు. అందుకే దీనిని 'లాస్ట్ గ్రేట్ రేస్ ఆన్ ఎర్త్' అని అంటారు.

రేస్‌లో పాల్గొనే వాళ్లనే కాదు, వారి కుక్కల్ని సైతం ఇక్కడ సెలబ్రిటీలుగా భావిస్తారు. చిన్న చిన్న పోటీలు అలస్కాలో ఎప్పట్నించో జరుగుతున్నా ఎంతో దూరం సాగే ఈ రేస్ మొదలైంది మాత్రం 1973లో. ఎనిమిది రోజుల 22 గంటల 47 నిమిషాల 2 సెకన్లలో చేరుకుని 2002లో మార్టిన్ బుసర్ రికార్డు సృష్టించాడు. సంబరంలా సాగే ఈ పోటీకి ప్రపంచ మీడియాతో పాటు చాలా దేశాల సినీ తారలు కూడా వెళతారు. అందుకే ఈ రేస్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.

వింటర్ ఒలింపిక్స్

ఇప్పటి దాకా మనం చెప్పుకున్న ఆటలన్నీ ఆయా దేశాల ప్రత్యేకతలయితే నాలుగేళ్లకోసారి జరిగే 'వింటర్ ఒలింపిక్స్'కి మరో రకం ప్రత్యేకత ఉంది. సమ్మర్ ఒలింపిక్స్‌లో ఉండే క్రీడలేవీ వింటర్ ఒలింపిక్స్‌లో ఉండవు. కేవలం మంచులో ఆడే ఆటలే ఉంటాయి. స్కీయింగ్, ఐస్‌హాకీ, ఫిగర్ స్కేటింగ్, స్పీడ్ స్కేటింగ్, ఇలా... మొత్తం పదిహేను రకాలు ఆటలుంటాయి. వీటిని ఆటలనే కన్నా మంచుపై విన్యాసాలంటేనే బాగుంటుందేమో.
వింటర్ ఒలింపిక్స్‌ను మొదటిసారి 1924లో ఫ్రాన్స్‌లో నిర్వహించారు. ఉత్తరార్థగోళంలో చలికాలం నవంబర్ ఫిబ్రవరిల మధ్య వస్తుంది కదా... అందుకే వింటర్ ఒలింపిక్స్ ప్రతి సారి ఫిబ్రవరి నెలలో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది (2010) జరిగిన 21వ వింటర్ ఒలింపిక్స్‌కు కెనడాలోని వాంకోవర్ వేదికగా నిలిచింది. మొత్తం 82 దేశాలకు చెందిన 2,600 మంది క్రీడాకారులు దీనిలో పాల్గొన్నారు. ఈ క్రీడలు కెనడాలో జరగడం ఇది మూడోసారి. దక్షిణార్థగోళంలో అంటార్కిటికా ఖండంలో తప్ప మరెక్కడా చెప్పుకోదగినంతగా చలి ఉండదు కాబట్టి వింటర్ ఒలింపిక్స్ దక్షిణార్థగోళంలో ఇంతవరకు జరగలేదు.

పైన చెప్పిన ఆటలు, విశేషాలన్నీ ఉత్తరార్థగోళానికే పరిమితమైనా నిజానికి భూగోళం మీద అతి శీతల ప్రాంతం మాత్రం అంటార్కిటికా. ఆ ఖండంలో స్థిరనివాసాలు లేవు కాబట్టి ఇలాంటి విశేషాలకు అవకాశం కూడా లేదు. అయితే చాలా దేశాలకు ఇక్కడ పరిశోధనా కేంద్రాలున్నాయి. ఆ కేంద్రాలలో 5000 మందికి పైగా శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తూ ఉంటారు. కాని శీతాకాలం వచ్చేనాటికి వారిలో చాలామంది తిరిగి వచ్చేస్తారు. కేవలం ఓ వెయ్యిమంది మాత్రమే అక్కడ ఉంటారు. భూమ్మీద రికార్డు చేసిన అత్యల్ప ఉష్ణోగ్రత మైనస్ 89.2 డిగ్రీలు. అంటార్కిటికా లోని రష్యాకి చెందిన పరిశోధనా కేంద్రం 'వోస్టాక్ స్టేషన్'లో నమోదైన ఉష్ణోగ్రత అది.

***

ఇక్కడ పేర్కొన్న వింటర్ విశేషాలు కొన్ని మాత్రమే. చెప్పుకుంటూపోతే ఇంకా ఇలాంటివి బోలెడుంటాయి. వీటిలో కొన్ని మరీ విడ్డూరంగా ఉన్నాయని మీరనుకోవచ్చు. అయితే ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను అందమైన అనుభవాలుగా ఎలా మలచుకోవచ్చో ఈ విశేషాలు చదువుతుంటే తెలియట్లేదూ!

వింటర్‌లో బడికెళ్లాల్సిందే...

మన దేశంలోని కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా శీతాకాల ఉష్ణోగ్రతలు మైనస్‌లలోకి దిగిపోతాయి. కాశ్మీర్ లోయలో అయితే సరస్సులన్నీ హిమ శిలలుగా మారిపోతాయి. మనకి వేసవి సెలవులు ఇచ్చినట్టు అక్కడ చలికాలం సెలవులు కూడా ఇస్తారు. అందుకే చలికాలం వచ్చిందంటే అక్కడ బడిపిల్లలందరికీ పండగ. మంచులో రకరకాల ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ సంవత్సరం మాత్రం స్కూళ్లకి చలికాలం సెలవులు లేవని ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆధునిక విద్యా విధానం మొదలైన తర్వాత 1880 నుంచి ఇప్పటి దాకా వింటర్ హాలిడేస్ రద్దు చేయడం ఇదే మొదటిసారి. చిట్టిపొట్టి చిన్నారులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు లెండి. ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ఇచ్చి సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లు యధావిధిగా కొనసాగాలని సూచించింది ప్రభుత్వం. ఈ సంవత్సరం కాశ్మీర్లో నెలల తరబడి కొనసాగిన ఆందోళనలు, కర్ఫ్యూల వల్ల స్కూళ్లు అసలు నడవలేదు. పాఠాలు పూర్తి చేయడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదట.

* నాగేశ్వరరావు తమనం

Tuesday, November 9, 2010

ఓన్లీ వన్ కాంటాక్ట్ ప్లీజ్!

డియర్ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్, కొలీగ్, క్లాస్‌మేట్, రూమ్‌మేట్, ఎక్సెట్రా...,

ఫస్ట్ టైం యాహూ మెయిల్‌లో ఒకరికొకరం ఇ-ఉత్తరాలు రాసుకున్నాం. 'మెయిల్ ఐడి' లేని మనవాళ్లని ఇంటర్నెట్ సెంటర్లకి లాక్కెళ్లి మరీ వాళ్లచేత ఎకౌంట్లు ఓపెన్ చేయించాం. మొత్తమ్మీద అందరం ఆన్‌లైన్లోకి ఎంటరయ్యాం. ఆ తర్వాత పాతవాళ్లమే కొత్తగా జీ మెయిల్లో చూసుకున్నాం, చాటింగ్ చేసుకున్నాం. గ్రీన్ లైట్ చూసి చాటింగ్ మొదలెట్టి... రెడ్ లైట్ కనపడినా అంటిపెట్టుకునే ఉన్నాం. యాక్టివ్, ఇన్-యాక్టివ్ గుర్తులు కూడా మనల్ని సేవ్ చెయ్యలేకపోయాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొందరం, ఆన్‌లైన్లో చేసేదేమీ లేక ఇంకొందరం, ఏం చెయ్యాలో తెలియక మరికొందరం మెయిళ్లు చేసుకున్నాం, గంటలు గంటలు 'చాట్'భారతాలు రాసుకున్నాం. రైటింగ్ ప్రాక్టీస్ చేశాం. ఇష్టం వచ్చినట్టు షార్ట్‌కట్‌లు ఉపయోగించాం. ఆ షార్ట్‌కట్‌లని అర్థం చేసుకోవడానికి మళ్లీ షార్ట్ టర్మ్ రీసర్చ్ ప్రాజెక్టులు చేశాం.

కస్టమ్ మెసేజ్‌లో 'ఫుల్ బిజీ...కెనాట్ చాట్, సారీ' అని రాసుకుంటే మాత్రం ఒదిలిపెట్టామా? పాపం మనవల్ల మనకి ఎదురౌతున్న ఈ ప్రాబ్లమ్స్ గమనించేనేమో చివరికి జి మెయిల్ కరుణించింది. 'ఇన్‌విజిబుల్' ఆప్షన్ ఇచ్చింది. 'దీని చాటున దాక్కోవచ్చు' అంది. ఆన్‌లైన్లో ఉంటూనే లేనట్టు బిల్డప్పిచ్చి ఎలాగో కాంటాక్ట్‌ల నుండి తప్పించుకున్నాం. అదీ ఎంతకాలం... ఆన్‌లైన్‌కి అలవాటైన ప్రాణాలు అంత తేలిగ్గా ఆఫ్‌లైన్ అవుతాయా? అందుకే అందరం 'ఇన్‌విజిబుల్'గా ఉంటున్నామని అందరికీ తెలిసిపోయింది. ఇన్‌విజిబుల్ కాస్త విజిబుల్ అయిపోయింది.

వీటన్నిటి నుండి ఎలా బయట పడాల్రా దేవుడా అనుకుంటూ ఉండగానే అవతరించింది ఆర్కుట్. కథ మళ్లీ మొదటికొచ్చింది... యాహూ మెయిల్లో ఉన్న బ్యాచే జీ మెయిల్లోకి వెళ్లి ఇప్పుడు ఆర్కుట్‌లో చేరమని ఇన్వైట్ చేసుకున్నాం. అప్పటిదాకా మెయిల్లో కాంటాక్టులుగా మాత్రమే ఉన్న మనం ఆర్కుట్‌తో 'సోషల్ నెట్‌వర్క్'గా ఎదిగాం. ఓపక్క ఇ-మెయిళ్లు, చాటింగులు చేసుకుంటూనే ఆర్కుట్‌లో 'శ్క్రాప్'లు... అవును ఆ 'తుక్కే' రాసుకున్నాం. దాంతో మనకి మరో ఎడ్వాంటేజ్ వచ్చింది. ఎవరు ఎవరికి ఏ తుక్కు రాసినా దాన్ని వేరేవాళ్లు చదవొచ్చు. అందుకే తొంగిచూడడం ఎక్కువైపోయింది. మనం రాసేవాటికి కరెక్ట్‌గా సూట్ అవ్వాలనే ఆర్కుట్ వాళ్లు వాటికి 'శ్క్రాప్' అని పేరు పెట్టారట. ఆర్కుట్ బాటలోనే 'ట్యాగ్డ్', 'హై ఫైవ్', 'మై స్పేస్'...ఇలా కొత్తకొత్త నెట్‌వర్క్‌లెన్నో పుట్టుకొస్తే కనపడిన ప్రతి దాన్ని క్లిక్ చేశాం. జాయినయ్యాం. మారింది నెట్‌వర్కే కాని ఆ నెట్‌వర్క్‌లో చేరింది మళ్లీ మన గుంపే. ఇంతలో మొదలైంది ఫేస్‌బుక్ ఫీవర్!

'ఫేస్‌బుక్‌లో లేవా... యూ ఆర్ సో అన్‌కూల్ ఓకే...' అని అంతపెద్ద నోరేసుకుని అని తోటివాళ్లంటుంటే చివరికి దాన్లో కూడా చేరక తప్పలేదు. ఇక్కడ కూడా ఓల్డ్ ఫ్రెండ్సే తగిలారు. సో... వుయ్ మీట్ ఎవ్రివేర్... ఒకరినొకరం పలకరించుకోవడానికి ఇన్ని మార్గాలు అవసరమా? ఏదో పనుండి రెండ్రోజులు ఆన్‌లైన్‌కి రాకపోతే 'యు డిడ్ నాట్ గివ్ ఎనీ రిప్లయ్ టు మై మెయిల్, వాట్ హ్యాపెన్డ్' అని ఫేస్‌బుక్‌లో ప్రైవేట్ మెసేజ్. అదీ చాలదన్నట్టు సెల్‌ఫోన్లో 'ప్లీజ్ రెస్పాండ్ టు మై మెయిల్' అని ఎస్ఎమ్ఎస్.

అంత అవసరం ఉందా? కాసేపైనా వదల్రా?
ఇంటర్నెట్ ప్రపంచాన్ని కనెక్ట్ చేసింది... నిజమే. అయితే ఇన్ని కనెక్షన్లు అవసరమా? 'టెక్నాలజీస్ ఆర్ ఎక్స్‌టెన్షన్స్ ఆఫ్ అవర్ బాడీ' అని మార్షల్ మెక్‌లూహన్ ఎప్పుడో చెప్పినట్టు సెల్‌ఫోన్ ఇప్పుడు మన శరీర భాగాల్లో ఒకటై ఉండనే ఉంది. కాబట్టి మన మధ్య సో మెనీ కాంటాక్టులు, కనెక్షన్లు, నెట్‌వర్కుల అవసరం లేదేమో. జస్ట్ ఒక్క ఇ-మెయిల్ చాలు. నో మోర్ న్యూ కనెక్షన్స్ ప్లీజ్!
- ఒక నెట్ బాధితుడు

- నారాత

అన్నయొస్తున్నాడో...!

అన్నయ్యొచ్చినాడో... ఎలుగులొ ఎన్నెల్దెచ్చినాడో
అన్నయ్యొచ్చినాడో... హల్‌చల్ చిందుల్దెచ్చినాడో
ఎలుగులొ ఎన్నెల్దెచ్చినాడో... హల్‌చల్ చిందుల్దెచ్చినాడో...

సినిమాల్లో రీయెంట్రీకి రెడీ అయిన చిరు ఓ టీవీ చానల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన స్టూడియోలోకి ఎంటరయ్యేసరికి జోష్ సినిమాలోని ఈ 'అన్నయ్య' పాట వస్తూ ఉంది. అది విన్న చిరంజీవి "అదేంటండీ... ఆ పాట పెట్టారు? మా సినిమా వాళ్లు ఫాలో అయ్యే సంప్రదాయం తెలీదా మీకు. ఏ హీరో సినిమాలో అయినా బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగో, మ్యూజిక్కో వాడాల్సొస్తే ఆ హీరో పాత పాటలే వాడతారు కాని వేరే హీరో పాటల్ని పెట్టరని తెలుసు కదా.
అంతెందుకు ఏ నటవారసుడి సినిమా అయినా చూడండి, వాటిలో వాళ్ల నాన్న పాటో, తాత పాటో అన్నయ్య పాటో పెట్టుకుంటారు కాని వేరే హీరోల పాటల్ని చచ్చినా పెట్టరు. నా సినిమాలు, మా వాళ్ల సినిమాలు ఏమీ చూడలేదా?'' అని ఎప్పట్లాగే కొంత మొహమాటపడుతూ అడిగారు. "అలా ఏం లేద్సార్, మీ రీయెంట్రీకి ఈ పాట అయితేనే బాగా సూటయ్యిద్దనీ... తీసెయ్యాలంటే చెప్పండి. మీరు చెప్పినట్టే చేద్దాం. మీరు ఏ చిన్న విషయాన్నైనా చాలా సీరియస్‌గా తీసుకుంటారని చెప్పారు. మీ అబ్బాయి ఫస్ట్ సినిమా రిలీజైనప్పుడు టీవీ చానళ్లలో ఇంటర్వ్యూ ఇస్తుంటే, కెమేరా ఫ్రేమ్‌లు ఎలా ఉండాలో కూడా మీరే చెప్పారట కదా. చెప్పండి ఠాగూర్ పాటో, స్టాలిన్ సాంగో పెట్టమంటారా'' అడిగాడు టీవీషో ప్రొడ్యూసర్.

"ఇప్పుడు నా కొడుకు గురించెందుకు లెండి. నా రీయెంట్రీ గురించి మీకో ఇంటర్వ్యూ ఇవ్వమన్నారు... వచ్చాను. రాజకీయాల్లో ఎంటరైన తర్వాత మైకుల ముందు మాట్లాడడం ఎక్కువైంది. కెమేరా ఎలా ఉన్నా పర్వాలేదు'' అన్నారు చిరు. "ఇంటర్వ్యూ మొదలు పెడదామా సార్. ప్రశ్నలు ముందే చెప్పమంటారా...'' అడిగాడు యాంకర్.
"అన్నీ నా రీయెంట్రీ గురించైతే అవసరం లేదు. రాజకీయాల గురించైతే మాత్రం ప్రశ్నలు ముందే ఇవ్వాలి. ఇవ్వకుండా అడిగితే నేనింకా రాజకీయాల్లో నేర్చుకోవాల్సింది చాలా ఉందని మాత్రమే చెబుతా. అంతకంటే ఒక్కముక్క కూడా చెప్పనంతే.''
"సరే సార్... మొదలు పెడదామా సార్!''

లాంగ్‌షాట్‌లో యాంకర్, చిరంజీవి ఇద్దరూ కనిపిస్తున్నారు. కట్ చేస్తే యాంకర్ క్లోజప్.
"ఎన్నో యేళ్లపాటు సినీరంగంలో నెంబర్‌వన్ హీరోగా తెలుగు తెరపై నిలిచిన మన చిరు అన్నయ్య తర్వాత సినిమాలకి దూరమై ప్రజలకి దగ్గరయ్యారు.... ఇప్పుడు వెండితెరపైకి మరోసారి రానున్నారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారి రాజకీయ ప్రస్థానం గురించి, సినీరంగంలోకి రీయెంట్రీ గురించి మనతో మాట్లాడనున్నారు'' అని భారీగా ఇంట్రడక్షన్ ఇచ్చాడు యాంకర్. "అదేంటి, నేను ముందే చెప్పాను కదా రాజకీయాల గురించి ఆడగొద్దని. రాజకీయ ప్రస్థానం అంటున్నాడేంటి'' మనసులోనే తిట్టుకున్నారు చిరంజీవి. అయినా తన మనసులోని ఆందోళన ఏ మాత్రం బయటికి కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. వెంటనే కెమేరాని చిరంజీవి మొహం మీదకి ఫోకస్ చేసి క్లోజ్అప్‌లో చూపించారు టీవీ చానల్ వాళ్లు.

"వెల్‌కమ్ టు అవర్ షో సార్. మీరు లావు తగ్గి ప్రజానాయకుడి నుంచి కథానాయకుడిలా తయారై రావడానికి చికిత్స కోసం లండన్ వెళ్లారని వార్తలొచ్చాయి. ఇప్పుడు చూస్తే.....''
"వార్తలు మీరే వేసి మళ్లీ వార్తలొచ్చాయని అంటున్నారు'' అని అనాలనుకున్నాడు కాని అనలేదు. "నన్ను చూసినాక్కూడా ఆ కన్ఫ్యూజన్ ఎందుకు...'' అని మాత్రమే అన్నారు. అంటూ కన్నుగీటారు.
"మీరు రాజకీయాల్లోకి రాకముందు చాలా నెలల పాటు ఇలాగే సస్పెన్స్ సాగింది. మీరు పొలిటికల్ పార్టీ పెడతారా లేదా అనే విషయం కూడా చాలాకాలం పెద్ద సస్పెన్సే. అంతా సినిమా ఫక్కీలోనే జరిగిందనుకోండి. మీరు పార్టీ లాంచ్ చేశాక మీ పార్టీ ఎలాంటి పెనుమార్పులకి శ్రీకారం చుడుతుందనే విషయం గురించి కూడా చాలామంది విశ్లేషకులు తమ ప్రెడిక్షన్స్ చెప్పారు. మీరు వాళ్లకిచ్చిన బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఏంటి?''

"చూడండి, వాళ్లు అన్ని విషయాలూ మాట్లాడారు కాని, నేను ఓడిపోతానా గెలుస్తానా అన్న ఒక్క విషయం మాత్రం ఎవరూ చర్చించనేలేదు. అందుకే నా పాలకొల్లు ఓటమే నేనిచ్చిన బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్'' అని చాలా స్పోర్టివ్‌గా చెప్పారు చిరు.
"సడన్‌గా రాజకీయాలనుంచి బ్రేక్ తీసుకుని సినిమా చేయడానికి కారణం...''
"ఈ విషయం గురించి కూడా చాలాకాలం నుంచి వార్తలొస్తూనే ఉన్నాయి. రజనీకాంత్ స్ఫూర్తితోటే నాకూ మళ్లీ నటించాలనిపించి..''
"అంతేనా... ఇంకేమీ లేదా?''
"పోనీ మీకు తెలిస్తే చెప్పండి''
"అభిమానుల కోరిక మేరకే వస్తున్నానని మీరే చెప్పారు కదా! నిజం చెప్పాలంటే అలాంటి వార్తలు వచ్చినట్టు నాకైతే తెలీదు'' యాంకర్ నీళ్లు నములుతూ అన్నాడు.
"సినిమాల్లో అయితే ఒక్క హిట్ లేకుండా కూడా కొన్నేళ్లపాటు నెంబర్‌వన్‌గా కొనసాగొచ్చు. పాలిటిక్స్‌లో అలా కాదు. ఒక్క ఎన్నికలు చాలు... హీరోలు జీరోలయిపోతారు. తర్వాత ప్రజలకి సేవ చేసే అవకాశం వాళ్లకి రావాలంటే ఎన్నేళ్లో వెయిట్ చెయ్యాలి. అందుకే మళ్లీ సినిమాల్లోకి...'' యాంకర్ ప్రశ్నని ఇగ్నోర్ చేస్తూ అన్నారు.

"ప్రజా సేవంటే గుర్తొచ్చింది. మీరు అంతగా అభిమానించి ఆరాధించే మదర్ థెరిస్సా శతజయంతి ఈ మధ్యే జరిగింది కదా. దేశ విదేశాల్లో కూడా ఆమె జన్మదిన వేడుకలు జరిగితే మరి ఆమె పుట్టిన రోజుని మీ పార్టీ జరిపినట్టు లేదే''
"మా పార్టీ శ్రేణులు జరుపుకున్నాయి లెండి. అయినా మీరు నా సినిమా రీయెంట్రీ గురించి అడుగుతానన్నారు...'' గుర్తు చేశారు అన్నయ్య.
యాంకర్ అక్కడికే వస్తున్నా అన్నట్టు తలూపి... "ఒకప్పుడు సినిమాలు ప్రజల్ని ఎంటర్‌టైన్ చెయ్యడంతోపాటు గొప్ప రాజకీయ నాయకుల్ని కూడా తయారు చేశాయి. ఇప్పుడు ఆ రెంటిలో ఏ పనీ చెయ్యలేకపోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దీని గురించి మీరేమంటారు''
"మీరు ఎవరి గురించి అంటున్నారు?'' సూటిగా అడిగారు చిరు.
"అబ్బే ఎవరి గురించీ కాదు సార్! నా ఉద్దేశం ఇప్పటి సినిమాలు ఎంటర్‌టైన్ చెయ్యలేకపోతున్నాయా అని మాత్రమే''
సర్దుకున్నాడు యాంకర్.
"ఎంటర్‌టైన్ చేసేపని కూడా రాజకీయాలు, మీ న్యూస్ చానళ్లూ కలిసి చేస్తున్నాయి కదా'' చదరంగంలో చెక్ చెప్పినట్టుగా అన్నారు చిరు.

"మా చానళ్ల గురించి ఎందుకు కాని... మీ కొత్త సినిమాకు కథ ఏమనుకుంటున్నారు?'' అసలు విషయానికి వచ్చాడు యాంకర్.
"ముందు మీకేమైనా లీకైతే చెప్పండి. తర్వాత అసలు కథ చెబుతాను''
"చూస్తుంటే సీన్ రివర్సై మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టుంది. సరే చెప్పమన్నారు కాబట్టి చెబుతున్నాను. మీ ఠాగూర్, స్టాలిన్ సినిమాల రేంజ్‌లో కరప్షన్ గురించట. కానీ ఇది కాస్త డిఫరెంటట. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సీట్లమ్ముకుంటే ప్రజల మాట అటుంచి ఆ పార్టీల పరువు, భవిష్యత్తు ఏమైపోవచ్చో, చివరికి ఆ పార్టీలు లీడర్లని, క్యాడర్నీ ఎలా కోల్పోతాయో చెప్పడమే స్టోరీ అని విన్నాం''

"మీకు ఇలా స్టోరీలు లీక్ అవుతున్నాయి కాబట్టే నా సినిమా స్టోరీ ఈ సారి అత్యంత సీక్రెట్‌గా ఉంచాం. సినిమా నా కొడుకే ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి లీక్ అయ్యే చాన్సే లేదు. డైరెక్ట్ చేసేదాకా ఆ స్టోరీ డైరెక్టర్‌కి కూడా తెలీనివ్వం. అంతా సస్పెన్స్. ప్రేక్షకులకి మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం'' ముగిస్తున్నట్టుగా చేతులు జోడించారు చిరు.
"పాలకొల్లు లాంటి సర్‌ప్రైజ్ కాదు కదా'' అనబోయి నాలుక కొరుక్కుని "మీ న్యూలుక్ సూపర్ సార్! మాకూ మిమ్మల్ని మళ్లీ వెండితెరపై చూడాలనుంది. ఆల్ ద బెస్ట్'' అని శెలవు తీసుకున్నాడు యాంకర్.

- తమనం

Saturday, November 6, 2010

మా ఊరి బోయింగ్‌లు

'రయ్...!!!'మంటూ పల్లెటూరి రోడ్డుపై దుమ్ములేపుతూ దూసుకుపోతోంది ఆటో. 'ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటా... ఐదు నిమిషాల్లో వస్తా' అని రాసుంది ఆ ఆటో మీద. డ్రైవర్‌కి రెండు పక్కలా ఇద్దరేసి చొప్పున వేలాడుతున్నారు. వెనక సీట్‌లో కూడా అంతే. ఎవరో కట్టకట్టి లోపల పడేసినట్టు ఓ పదిమందికి పైనే ఇరుక్కుని కూర్చున్నారు. ఆటో వెనక డోర్ తీసేసి, అక్కడ మరో నలుగురు కూర్చున్నారు. ఆటో టాప్ మీద లగేజ్ తాళ్లతో కట్టి ఉంది. 'ఎంతమంది ఎక్కినా నా ఆటోలో ఇంకొకరికి ఖాళీ ఉంటుంద'న్నట్టు దారి పొడవునా జనం కనిపించిన చోటల్లా ఆపుతున్నాడు ఆటో డ్రైవర్. ఆటో ఇంజన్ సౌండ్ వినిపించట్లేదు కాని ఆటోలో ఉన్న సీడీ ప్లేయర్ చేసే సౌండ్ మాత్రం జస్ట్ ఓ మైలు దూరం దాకా వినిపిస్తుంది.... ఇప్పుడు ఏ ఊళ్లో చూసినా ఇదే సీన్. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఆటో ఎప్పుడైతే పల్లెటూర్లో ఎంటరైందో అప్పుడే దాని రూపు, సైజు, ప్రయోజనం అన్నీ మార్చుకుంది. కొత్త హంగులు సమకూర్చుకుని అన్ని ప్రయాణ అవసరాలు తీర్చే మల్టీ పర్పస్ వాహనమైంది. పల్లెప్రజల ప్రియమైన ప్రయాణ సాధనమైన ఆటో గురించే ఈ వారం కవర్‌స్టోరీ.

ముందుగా ఓ పొడుపు కథ

పల్లెటూళ్లని పట్టణాలని కలిపేది, పొద్దుపొడవక ముందు నుంచి పొద్దుపోయేదాకా తిరుగుతూనే ఉండేది, పిల్లల్ని బడికి, కూలీల్ని పనికి తీసుకెళ్లేది, పొలంలో కూరగాయల్ని మార్కెట్‌కి చేర్చేది, మార్కెట్‌నుంచి ఎరువుల్ని పొలానికి చేర్చేది, అన్నిటికన్నా ముఖ్యంగా ఆపదలో అంబులెన్స్ కన్నా ముందుగా వచ్చేది ఒకటుంది... ఏమిటది?

ఆటో ! అవును, ఆ మూడు చక్రాల ఆటోరిక్షా లేకపోతే పల్లెటూరి జనానికి ఏ పనీ జరగట్లేదిప్పుడు. పనికి, బడికి చేర్చడం లాంటి రోజువారీ అవసరాలకే కాదు పెళ్లికైనా, పెళ్లిచూపులకైనా, పుట్టినరోజైనా, బారసాలకైనా...ఏ శుభకార్యానికి వెళ్లాలన్నా నలుగురు కలిస్తే చాలు వారికి అందుబాటులో ఉండేది, పిలవగానే వచ్చి వాలేది ఆటోయే. ఊళ్లో ఆటో ఉంటే అందరికీ సొంతకార్లున్నట్టే అంటున్నారు పల్లెజనం. అది వారి సొంతం కాకపోయినా సొంతం అన్నంతగా అందుబాటులో ఉంటుంది. అందుకే ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోనే ఆశ్రయిస్తున్నారు.
ప్రజల్ని గమ్యం చేర్చడమే కాదు, లగేజీ చేరవేసే వ్యాను, టెంపో, చిన్నసైజు లారీ కూడా అదే. వెనకున్న సీటు పీకేస్తే చాలు ఎంత లగేజీ అయినా మోసుకెళ్తుంది. రైతులు పండించిన కూరగాయల్ని మార్కెట్‌కి చేర్చేదీ, కిరాణాషాపుల యజమానులు టౌన్ నుండి సరుకులు పల్లెలకి తీసుకొచ్చేదీ ఆటోలోనే. అందుకే ఇప్పుడు అదే స్కూల్ వ్యాను, అదే పాల వ్యాను, అదే బస్సు, అదే లారీ, అదే కొరియర్, అదే అంబులెన్స్... ఇంకా చెప్పాలంటే పల్లెటూరి బతుకుబండి అయిపోయింది.

ఇలా ఎంటరైంది...

ఒకప్పుడు...అంటే పదీ పదిహేనేళ్ల క్రితం దాకా ఆటోలు టౌన్‌లలో మాత్రమే కనిపించేవి. పట్టణాలు, నగరాల్లో ఇరుకు గొందుల్లో, సందుల్లో కూడా చొచ్చుకుపోతూ ఉండేవి. వాటిని నడిపేవాళ్లలో ఎక్కువశాతం పట్టణవాసులే అయినా కొందరు చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా ఉండేవారు. వాళ్లంతా ఉదయాన్నే పట్టణానికి వెళ్లి బాడుగకు ఆటో తిప్పుకుని మళ్లీ రాత్రికి పల్లెకి చేరేవాళ్లు. తర్వాత మెల్లమెల్లగా చుట్టుపక్కల గ్రామాలకూ ఆటో చేరువైంది. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా ఆటోలే.

పల్లెటూరికి పట్టణానికి ప్రజల రాకపోకలు రానురాను పెరుగుతున్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా బస్సు సౌకర్యాలు ఏ మాత్రం పెరగలేదనే చెప్పాలి. సరిగ్గా అదే సమయంలో ఎంటరైంది ఆటో. బస్సులకోసం గంటలసేపు పడిగాపులు కాసే జనానికి ఆటో రావడంతో ఆ అవసరం లేకుండా పోయింది. క్రమంగా అన్ని అవసరాలకీ అదే ఆధారమైంది. ఇంతగా ప్రజలకి చేరువవ్వడానికి అసలు కారణం మరొకటుంది.

ఆటోవాలా లోకల్

'చంటిగాడు లోకల్'...ఇప్పుడు ఆటోల మీద ఎక్కువగా కనిపించే డైలాగ్ ఇదే. ఆ డైలాగ్ లాగానే ఆటో అంటేనే లోకల్. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కనీసం ఐదారు ఆటోలుంటున్నాయి. వాటిని కొనుక్కుంటున్నది, నడుపుతున్నది కూడా పల్లెటూరి కుర్రవాళ్లే. "ఎంతకాదన్నా మనఊరి వాళ్లంటే మనకి అభిమానం ఉంటుంది కదా. పైగా అందరూ పరిచయస్తులే. అందుకే వాళ్లు ఏ చిన్న పని చెప్పినా చేస్తాం. గుంటూరు మార్కెట్‌కి కూరగాయలు తీసుకెళ్లడానికి రైతులు రానవసరం లేదు. మేమే తీసుకెళ్లి కొట్లో దించేస్తాం. ఒక్కోసారి ఖాళీ గంపలు, అమ్మితే వచ్చిన డబ్బులు మేమే తీసుకెళ్లి రైతులకిస్తాం. పాల వ్యాపారులు మా ఊర్లో పాల క్యాన్‌లు ఆటోలో వేస్తే చాలు మేమే వాటిని పొన్నూరులో హోటల్ దగ్గర దించేస్తాం. ఇంకా చిన్నా చితకా సాయాలు చాలా చేస్తుంటాం. టాబ్లెట్లు, పళ్లు తెమ్మని తెలిసినవాళ్లు అడిగితే తీసుకొచ్చి ఇస్తాం. ఒకళ్లేమో రీచార్జ్ కార్డు తెచ్చిమ్మని అడిగితే ఇంకొకళ్లు యూరియా బస్తాలు వేసుకురమ్మని అడుగుతారు. ఇవన్నీ బస్సోళ్లు చెయ్యలేరుగా'' అన్నాడు మామిళ్లపల్లి నుండి పొన్నూరుకి, గుంటూరుకి ఆటో నడిపే మస్తాన్. ఆయన గత మూడేళ్లుగా ఆటో నడుపుతున్నాడు.

"దారి పొడుగునా అన్ని ఊళ్ల వాళ్లకి ఈ రూట్‌లో తిరిగే ఆటోల గురించి తెలుసు. ఒక్కొక్కరైతే ఇంట్లో బయల్దేరుతూ ఉండగానే ఇదిగో వస్తున్నా... ఒక్కనిమిషం ఆపు అని అడుగుతారు. అది కాస్తా పావుగంట అవుతుంది. అయినా తప్పదు మాకు. తెలిసినోళ్లు కదా, మొహమాటం కొద్దీ ఆపాలి. ఆపకుండా వెళ్తే వాళ్లు రెండోసారి ఎక్కొద్దూ? పేషెంట్లని ఆస్పత్రి దాకా తీసుకెళ్లి దించాల్సిందే. అవసరమైతే సాయం పట్టి లోపలికి తీసికెళ్లాల్సిందే. బడిపిల్లలకి నచ్చిన పాటలు పెట్టాల్సిందే. డైలీ వచ్చేవాళ్లు కాబట్టి బడిపిల్లలకి ఒక రూపాయి తక్కువే తీసుకుంటాం'' అని చెప్పాడాయన. లోకల్ వాళ్లకి ఈ చిన్నచిన్న ఔదార్యాలు తప్పవుమరి.

ఓనర్లే డ్రైవర్లయితే...

పట్టణాల్లో అయితే ఆటోలను రోజువారీ అద్దెకు ఇచ్చే యజమానులుంటారు. డ్రైవర్లు వాళ్లవద్ద నుండి ఆటోలు తెచ్చుకుని నడుపుకుంటారు. సొంతగా ఆటో నడుపుకునే వారి శాతం చాలా తక్కువ. పల్లెల్లో అలా కాదు. ఆటో నడిపేవాళ్లలో ఇంచుమించు అందరూ యజమానులే. స్కూల్‌లోనే చదువుకి ఫుల్‌స్టాప్ పెట్టిన వాళ్లు, కాలేజీ డ్రాపవుట్లు, కూలి పని ఎక్కడ చేస్తాంలే అనుకునే వాళ్లు... ఇలా రకరకాల వాళ్లు ఎంతోకొంత డబ్బు పోగు చేసుకుని ఆటో కొనుక్కోవాలనుకుంటే చాలు ఫైనాన్స్ సంస్థల సాయంతో ఆటో చేతికొచ్చేస్తుంది. ఈ మధ్య పెళ్లికొడుకులకి కట్నంగా ఆటోలు కొనివ్వడం కూడా పల్లెల్లో ఎక్కువైపోయింది. ఆటో ఉన్నవాళ్లకి పెళ్లిళ్లు కూడా త్వరగా కుదురుతున్నాయట.

సొంతంగా నడుపుకునే వారికుండే లాభాలే వేరని అంటున్నారు ఆటోవాలాలు. ఎలాగంటే...పొద్దుపొద్దునే ఆటో బయటికి తీస్తే మళ్లీ ఇల్లు చేరేది రాత్రికే. ఎంతసేపు నడుపుకుంటే అంత ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఎప్పుడు కావలిస్తే అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. ఎంత లోడ్ అయినా వేసుకోవచ్చు, బాడుగకి ఎంత దూరమైనా వెళ్లొచ్చు. చిన్నచిన్న రిపేర్లన్నీ వాళ్లే చేసుకోవచ్చు.
"మా ఊరికి ఆటో తిప్పడమంటే పెద్ద తంటా. ఎందుకంటే మా నాన్న నేను ఎన్ని ట్రిప్‌లు వేస్తున్నానో కూడా లెక్క పెడతాడు. ఆటో తీసుకుంది మా నాన్న పేరు మీదే. సాయంత్రానికి తక్కువ డబ్బులిస్తే కుదరదు. నెల చివర ఫైనాన్స్ వాళ్లకి కట్టడానికి డబ్బులు తక్కువైతే ఇచ్చేది మా నాన్నే కాబట్టి రోజూ డబ్బులు ఆయన చేతిలోనే పెట్టాలి'' అన్నాడు ఓ కొడుకు. ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నా మొత్తం మీద ఆటోకి అతనే యజమాని. సర్వస్వతంత్రుడు.

అందచందాలూ ఎక్కువే...

దేవుళ్ల ఫోటోలతో, చూడచక్కని రంగురంగుల డెకరేషన్లతో ప్రతి ఆటో అప్పుడే అలికి ముగ్గు పెట్టిన పల్లెటూరి ఇల్లంత సుందరంగా ఉంటుంది. అంతేకాదు సినిమా హీరో హీరోయిన్ల పోస్టర్లు, సినిమా డైలాగులు, ప్రేమ సూక్తులు, స్నేహగీతాలు...వెరసి ఆటోలన్నీ వాటి యజమానుల అభిరుచులను వ్యక్తపరచే వేదికలవుతాయి. వింతవింత ధ్వనులు చేసే కొత్తకొత్త హారన్‌లు, తళతళా మెరిసే స్టికర్లు, రకరకాల డిజైన్లు ఆటోలకే సొంతం.
'సింహంతో వేట, నాతో ఆట వద్దు' అని ఓ ఆటో చాలెంజ్ చేస్తే 'ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటా... ఐదు నిమిషాల్లో వస్తా' అని మరో ఆటో భరోసా ఇస్తుంది. 'సూర్యుడికి చెమట పట్టదు చంద్రుడికి చలి పుట్టదు నాకు భయం వేయదు', 'నన్ను వేటాడాలంటే ఎడం వైపు పుట్టాల్సిన గుండె కుడివైపున పుట్టాలి', 'నీటితో పెట్టుకుంటే మునిగిపోతావ్, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావ్ నాతో పెట్టుకుంటే చచ్చిపోతావ్'లాంటి డైలాగులకి కొదవ లేదు. వీటిని ఆటో సూక్తులంటారో, కవితలంటారో మీ ఇష్టం.

ప్రేమ కావ్యాల గురించైతే చెప్పనక్కర్లేదు. 'నీకోసమే నా అన్వేషణ, నీ కోసమే నా నిరీక్షణ, నీతో గడిపే క్షణం కోసం కొన్ని వేల సార్లు మరణించైనా ఒక్కసారి జన్మిస్తా' అని ఒకరు రాసుకుంటే, 'ప్రేమించే మనసు లేనపుడు ఆకర్షించే అందమెందుకు?' అని మరొకరు ప్రశ్నను సంధిస్తారు. 'క్షణంలో పుట్టేది ప్రేమ, అనుక్షణం వేధించేది ప్రేమ', 'కాలంతో పనిలేనిది, ధనంతో కొనలేనిది ప్రేమ ఒక్కటే', 'చూసే ప్రతిపువ్వు వికసించదు... నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు'...ఇలాంటి కొటేషన్లు ఆటోల మీద కోకొల్లలు. 'అమ్మ దీవెన', 'గాడ్స్ గిఫ్ట్' లాంటివి కూడా ప్రతి ఆటో మీదా కనిపించేవే. ఆటోవాళ్లు తమ వంతుగా ప్రయాణీకులకి సాయం చేస్తుంటారు. అందుకే 'గర్భిణీలకు, వృద్ధులకు ఉచితం' అని కూడా రాసుకుంటున్నారు. నిజానికి పోలీసులకు కూడా మా ఆటోల్లో ప్రయాణం ఉచితమే. 'పోలీసులకు ఉచితం' అని నా ఆటోమీద రాసుకోవాలనుంది కానీ వాళ్లకి భయపడే ఆ పని చేయలేదు అన్నాడు ఓ ఆటోవాలా.

ఆటోలు అందుబాటులో లేని రోజుల్లో చిన్నచిన్న పనులకి కూడా ట్రాక్టర్‌ని పిలవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏడెనిమిది క్వింటాళ్ల బరువులైనా ఆటోల మీద వేసుకొచ్చేస్తున్నారు. మరీ ఎక్కువ సరుకు ఉంటేనే ట్రాక్టర్ అవసరం అవుతుంది. దుక్కి దున్నడానికి తప్ప మిగతా పనులన్నిటికి ఇప్పుడు ఆటోలే వాడుతున్నారు. ఒక ట్రాక్టర్ అవసరమైన చోట ఇప్పుడు నాలుగు ఆటోలు వచ్చి చేరుతుండడంతో ఎక్కువ మందికి ఉపాధి కూడా లభిస్తోంది. ఇదివరకు వరినాట్లు, కోతలు, మిగతా పనుల సీజన్లో కూలీల కోసం చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు ట్రాక్టర్లు పంపించే వారు. ఇప్పుడేమో 'మీరే ఆటోలు వేసుకురండి మేం చార్జీలిస్తాం' అంటున్నారు. ఆటో లేకపోతే దూరం పొలాలకు కూలి పనికోసం ఎవరూ రావట్లేదు కూడా.

నడవడం తగ్గింది...

ఇదివరకు పక్క ఊరుకు వెళ్లాలన్నా, పిల్లలు వేరే ఊళ్లో ఉన్న హైస్కూలుకి వెళ్లాలన్నా నడిచో సైకిలెక్కో వెళ్లే వారు. మెయిన్ రోడ్ మీద బస్సు దిగి ఊరు ఒకటి రెండు కిలోమీటర్లున్నా నడిచే వెళ్లేవారు. ఆటోలు రంగప్రవేశం చేయడంతో ఆ కాస్తంత దూరం కూడా జనానికి ఇప్పుడు అనంత దూరంలా కనిపిస్తున్నది. అందుకే నడిచి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. "బడికి ఎక్కడ నడిచి వెళ్తారులే అని సైకిల్ కొనిస్తే ఆటోలో వెళ్లే తోటి వాళ్లని చూసి సైకిళ్లొదిలేసి ఆటోలెక్కుతున్నారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలూ అంతే. అదేమంటే ఈ పుస్తకాలన్నీ మోసుకుంటూ రోజూ మేం నడవలేం. చూడు ఎంత బరువుందో అని పుస్తకాల బ్యాగ్‌లు చూపిస్తున్నారు. బడిపిల్లలే కాదు, ఊరికి దూరంగా ఉన్న పొలానికి వెళ్లాలన్నా ఆటో ఎక్కేస్తున్నారు పెద్దవాళ్లు. ముసలోళ్లకి ఇదంతా చూడ్డానికి విడ్డూరంగా ఉన్నా మాకు అలవాటైపోయింది'' అన్నాడు ఓ తండ్రి.

ఆలస్యమైనా...సెకండ్‌షోకైనా...

టౌన్‌లో పని పూర్తికావడం కాస్త ఆలస్యం అయితే ఆటో ఆయనకి ఫోన్ చేసి కాసేపు ఆగమంటే చాలు. ఆయన ఆగక పోయినా తర్వాత వచ్చే ఆటో ఆయనకి ఫలానా వాళ్లు వస్తున్నారు, లేట్ అవుతుందట, కాసేపాగి ఎక్కించుకురా అని చెపుతారు. పిల్లలు పట్టణాల నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఏ నడిరాత్రో ట్రైన్ దిగుతారు. అర్ధరాత్రయినా అపరాత్రయినా ఆటో వాళ్లకి ముందు చెప్పి ఉంచితే చాలు ఆ సమయానికి లేచి వచ్చేస్తారు. పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేస్తారు. తెల్లవారుజామున రైల్వే స్టేషన్‌కి వెళ్లాలన్నా అంతే. మారు మాట్లాడకుండా వస్తారు. ఇంత చేసినా డబ్బులు మరీ ఎక్కువేమీ తీసుకోరు. "మన ఊరివాళ్లే కదా, ఎక్కువ అడిగితే రేపు 'ఆయన అంత అడిగాడు' అని అందరికీ చెబుతారు. అందుకే మీరే ఎంతోకొంత ఇద్దురు కానీ ముందు వెళ్దాం పదండి అంటాం. అలాంటప్పుడు వాళ్లే కాస్త ఎక్కువ ఇస్తారు. కొంతమంది పిసినారులు ఎలాగూ ఉంటారు. వాళ్ల గురించి ఊరందరికీ తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ల దగ్గర మాత్రం డబ్బులు గట్టిగానే వసూలు చేస్తాం'' అన్నాడు శాంసన్ అనే ఆటోవాలా.

యూత్ సెకండ్‌షో సినిమా చూడాలంటే వారిలో ఎవరికో ఒకరికి ఆటో ఉంటే చాలు. "పొద్దున్నే బాడుగకి వెళ్లాల్రా అని చెప్పినా వినకుండా మేం వచ్చి నిన్ను నిద్ర లేపుతాంలే, ముందు నువ్వు సినిమాకి ఆటో పెట్టు అంటారు. అందరూ ఫ్రెండ్సే కాబట్టి సినిమా ట్రిప్ వేయక తప్పదు. పైగా పగలు సినిమాలు చూస్తే మాకూ లాసే. బాడుగ తోలుకోవాలి కదా. అందుకే నేను కూడా ఫస్ట్ షోకి కానీ సెకండ్‌షోకి కానీ వెళ్తా. అన్నగారి సినిమా రిలీజ్ రోజున మాత్రం మార్నింగ్ షో సినిమా చూసిన తర్వాతే ఆటో నడిపేది. బండి మనదే కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు తోలుకోవచ్చు'' అంటూ వివరించాడు ఓ సినిమాల వీరాభిమాని.

ఫైనాన్సుల కష్టాలు...

ఊళ్లలో తిరిగేవన్నీ ఫైనాన్సు వ్యాపారుల సాయంతో కొనుక్కున్న ఆటోలే. ఒక ఆటో వెల లక్షా ఎనభై వేల రూపాయలు. అంత డబ్బు ఒకేసారి కట్టడం సాధ్యం కాదు కాబట్టి ఫైనాన్సు వ్యాపారులను ఆశ్రయిస్తారు వాళ్లు. వాళ్లేమో వడ్డీతో కలుపుకుని కట్టాల్సిన మొత్తాన్ని 2 లక్షల 15 వేలుగా నిర్ణయిస్తారు. ముందుగా ఇరవై వేలో ముప్పైవేలో కడితే బండి ఇచ్చేస్తారు. అప్పటినుండి రెండుమూడేళ్లపాటు నెలసరి వాయిదాల్లో మిగతా మొత్తాన్ని చెల్లించాలి. ఒక్కో ఫైనాన్సు వ్యాపారీ కొన్ని వందల ఆటోలకు రుణాలు ఇస్తాడు. ఈ విధంగా ఆటోలకు ఫైనాన్స్ చేయడం కోట్ల రూపాయల వ్యాపారమైంది.

నెలసరి వాయిదాలు చెల్లించలేకపోతే మాత్రం ఆటో తీసుకెళ్లిపోతారు ఫైనాన్సు వాళ్లు. కొందరు వ్యాపారులు నాలుగు నెలల దాకా సమయం ఇస్తారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు సామాన్య జనాన్ని వేధించినట్టు మాకూ వేధింపులు తప్పట్లేదని అంటున్నారు ఆటోవాళ్లు. కొందరు అప్పోసొప్పో చేసి ఆటోలు విడిపించుకుంటున్నా ఫైనాన్స్ సంస్థల దెబ్బకి ఆటోలు వదిలిపెట్టుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు. "ష్యూరిటీ లేకుండా ఆటోలు ఎవరిస్తారు మరి? బ్యాంకులు లోన్లు ఇవ్వవు. ఫైనాన్సు వాళ్లకి అప్పులు ఇవ్వడం తెలుసు, డబ్బులు వసూలు చెయ్యడం తెలుసు, ఆటో తీసుకెళ్లి సెకండ్‌హ్యాండ్‌గా అమ్మడమూ తెలుసు. అందుకే వాళ్లు కేవలం రేషన్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకుని ఆటో చేతిలో పెడతారు. ఆటో వాళ్లకి సీజన్ అన్‌సీజన్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి రోజూ ఎంత ఎక్కువ కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు, డబ్బులు కూడా కట్టొచ్చు'' అన్నాడు ఫైనాన్స్‌పై ఆటో తీసుకున్న వెంకట్రావు.

మృత్యుశకటాలైతే...

ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి ఖాళీ ఉండే ఈ పుష్పక విమానాలే ఒక్కోసారి మృత్యుశకటాలవుతున్నాయి. ఎందరో ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. పల్లెటూరి రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు తక్కువే కాబట్టి అక్కడ ఎలా నడిపినా పెద్ద ప్రమాదముండదు. హైవే ఎక్కినాక కూడా గాల్లో తేలిపోతున్నట్టు అంతే వేగంగా నడిపితే ఫలితం అదుపుతప్పడం... ప్రాణా లు పోవడం జరుగుతుంది. యాక్సిడెంట్లకి కారకులు ఆటోవాళ్లే అనలేం కానీ ఫలితం అనుభవించేది మాత్రం ఆటోల్లో ప్రయాణించేవాళ్లే. బస్సులు, లారీలు, వ్యాన్లు లాంటి పెద్ద వాహనాల్ని ఢీకొంటే నుజ్జునుజ్జు అయ్యేవి ఆటోలే. "మూడు చక్రాల బళ్లు నడపడం అంత సులభం కాదు. హ్యాండిల్ ఎప్పుడూ ఓ పక్కకి లాగుతూ ఉంటుంది కాబట్టి వేగంగా వెళ్లేటప్పుడు కంట్రోల్ చెయ్యలేం. అందుకే యాక్సిడెంట్లు జరుగుతున్నాయ''ని ఒప్పుకోలుగా చెప్పాడు ఓ ఆటో డ్రైవర్. పరిమితికి మించి జనాన్ని ఎక్కించడం ఆటోవాళ్లకి అలవాటైపోతే అలాగే ఎక్కి వెళ్లడం గ్రామస్తులకు అలవాటైపోయింది.

బస్సులు... పోలీసులు...

నిత్యం 'నష్టాల్లో కూరుకుపోతున్నా'నంటున్న ఆర్‌టిసికి ఆటో నష్టం కన్నా లాభాన్నే చేకూర్చింది. ఎలాగంటే తమ బస్సుల్ని గ్రామాలదాకా నడపాల్సిన పని తప్పిపోయింది దానికి. మారుమూల గ్రామాలకయితే బస్సు సర్వీసుల్ని ఇంచుమించు పూర్తిగా ఉపసంహరించుకునే పనిలో పడింది ఆర్‌టిసి. చాలా ప్రాంతాల్లో బస్సు డిపోలను కూడా ఎత్తేసింది. మామిళ్లపల్లిలో కూడా అంతే. ఒకప్పుడు ఆ ఊరు మీదుగా పొన్నూరు తెనాలి మధ్య పది బస్సులు తిరిగేవి. గుంటూరుకి రెండు బస్సులు తిరిగేవి. ఇవి కాక రెండు ప్రైవేటు బస్సులు కూడా ఉండేవి. రెండేళ్ల క్రితం పొన్నూరు డిపో తీసేశారు. ఇప్పుడు ఆ రూట్‌లో ఒకే ఒక్క బస్సు తిరుగుతుంది. జనమందరికీ ఆటోలే గతయ్యాయి. ఆ ఒక్క ఊరే కాదు ప్రతి గ్రామం కథ అంతే.
అయితే ఆటోవాళ్లకి బాడుగలు పెరిగేకొద్దీ పోలీసు వ్యాన్‌లు పల్లెటూర్లు రావడం కూడా పెరిగింది. ఆటోవాళ్లేమో టౌన్ దాటగానే ఎక్కువమంది జనాన్ని ఎక్కించుకుంటారు. దాన్ని అరికట్టడానికని ఫైన్లు వేసినా వాళ్లాపని చేయకుండా ఉండరు. అందుకే ఇప్పుడు పల్లెటూరి రోడ్లపై కాపు కాసే పోలీసు వ్యాన్ల సంఖ్య పెరిగింది.

***

ఎవరెన్ని ఫైన్లు వేసినా, జాగ్రత్తలు తీసుకోమని బుజ్జగించినా పల్లెటూరి జనం ప్రయాణించడానికి ఆటో తప్ప సులువైన వాహనం ఇంకోటేదీ లేదు. అందుకే రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా అతిపెద్ద ప్రైవేటు రవాణా వ్యవస్థగా ఆటో ఎదుగుతూ పోతోంది.

Wednesday, October 20, 2010

Tuesday, October 12, 2010

పర్యావరణ పని... పార్టీ!

ఈ రోజు డేట్ ఎంత?
10-10-10.
అందుకే... మాల్దీవుల అధ్యక్షుడు తన అధికార నివాసం పైకప్పు మీద సోలార్ అద్దాలు అమర్చుకుంటున్నాడు.
అందుకే... జపాన్‌లో సుమో రెజ్లర్లు కారుల్లో కాకుండా సైకిళ్లు తొక్కుకుంటూ పోటీల వేదికకి వెళ్తున్నారు.
అందుకే... భారత్, చైనా, అమెరికాల్లోని 850 కాలేజీలు, యూనివర్శిటీల విద్యార్థులు 'క్లీన్ ఎనర్జీ కాంపిటిషన్'లో పాల్గొంటున్నారు. వీళ్లేకాదు... ఇంచుమించు ప్రపంచ దేశాలన్నిట్లోనూ లక్షలాదిమంది పిల్లలు, పెద్దలు ముందుకొచ్చి ఈ రోజు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరేస్తున్నారు. తమకు తాము ఒక సందేశాన్ని ఇచ్చుకుంటున్నారు. ఏమిటా సందేశం?

గ్లోబల్ వార్మింగ్.
దీని గురించి ఎప్పట్నించో చెపుతున్నారు కదా. మళ్లీ కొత్తగా దేనికి? అయినా దానికీ ఈ తేదీకీ సంబంధం ఏమిటీ అంటారా? అదే.. అదే.. అక్కడికే వస్తున్నాం.
350.org అని ఒక సంస్థ ఉంది. దాన్ని అమెరికాకి చెందిన బిల్ మెక్‌కిబ్బెన్ అనే రచయిత తన స్నేహితులతో కలిసి స్థాపించారు. 'గ్లోబల్ వార్మింగ్' వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ఒక పుస్తకం ద్వారా సామాన్య ప్రజలకి తెలియజేసిన ఆయన అంతటితో ఊరుకోకుండా ఈ సంస్థని స్థాపించారు. 2007లో అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో రెండువేలకు పైగా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణలో తన వంతు కృషి చేశారు మెక్‌కిబ్బెన్.

ఇప్పుడు అదే సంస్థ తమ ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తం చేసింది. పర్యావరణవేత్తల్ని, ఉద్యమకారుల్ని, శాస్త్రవేత్తల్ని, వ్యాపారుల్ని, పారిశ్రామికవేత్తల్ని, రాజకీయ నాయకుల్ని, విద్యార్థుల్ని...అన్ని రకాల వారిని తమ పర్యావరణ ఉద్యమంలో భాగస్వాముల్ని చేసుకుంది. వీరిలో మన దేశ ప్రముఖులు కూడా ఉన్నారు. 'ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లయిమేట్ చేంజ్' మాజీ చైర్మన్ రాజేంద్ర పచౌరీ ఈ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకి తన పూర్తి మద్దతు తెలిపారు. పర్యావరణ మార్పులపై విస్తృతంగా ప్రచారం చేసిన వారిలో పచౌరీ ఒకరు. పర్యావరణవేత్త వందనా శివ ఈ క్యాంపెయిన్‌కు మద్దతు ప్రకటించిన మరో ప్రముఖ వ్యక్తి. వీళ్లే కాకుండా దక్షిణాఫ్రికాకి చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు కూడా ఈ సంస్థకి మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.

350 ఎందుకు?

గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణాన్ని 'పార్టికల్స్ పర్ మిలియన్ (పిపిఎమ్)'లలో కొలుస్తారు. అంటే ఒక మిలియన్ గాలి ధూళిలో కార్బన్ డై ఆక్సైడ్ పార్టికిల్స్ సంఖ్య. ప్రస్తుతం అది 388.15 పిపిఎమ్ ఉంది. అయితే ఒకప్పుడు ఇది ఇంత ఎక్కువగా లేదు. పారిశ్రామికీకరణ, పెట్రోలియం ఉత్పత్తుల వాడకం పెరిగిపోవడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం క్రమంగా పెరిగి ఇప్పుడు ప్రమాద స్థాయికి చేరింది. దీని ఫలితమే గ్లోబల్ వార్మింగ్. కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాన్ని నియంత్రించకపోతే భూ ఉష్ణోగ్రత మరింత పెరగొచ్చు. గ్లేసియర్లు కరిగిపోవచ్చు, సముద్రమట్టం పెరగొచ్చు, చిన్నచిన్న ద్వీపాలన్నీ నీట మునిగిపోవచ్చు.

కార్బన్ డై ఆక్సైడ్ పరిమితి 350 పిపిఎమ్‌కి మించకుడా ఉన్నప్పుడు మాత్రమే మానవులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు మనందరి ముందున్న సవాలు కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం 350కి తగ్గేందుకు కృషి చేయడం. బాక్స్‌లో పేర్కొన్న 'పది మంచిపనులు' అందుకోసమే. సమస్య తీవ్రతని, తీసుకోవాల్సిన చర్యల్ని సూటిగా తెలియజేసే సంస్థకి '350.ఆర్గ్' కన్నా మంచి పేరేముంటుంది అనుకున్నారు మెల్‌కిబ్బెన్. అందుకే ఆ పేరుతోనే ఒక సంస్థని ఏర్పాటు చేశారు. ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ కూడా 350.ఆర్గ్ చేపడుతున్న కార్యక్రమాలకి తన మద్దతు ప్రకటించారు. "మన ముందు తరాలకి సురక్షితమైన, పరిశుభ్రమైన ప్రపంచాన్ని మనం అందించాలంటే ఈ రోజు మనమందరం ముందుకొచ్చి కాలుష్యరహిత పద్ధతుల్లో ఇంధన వాడకం దిశగా చర్యలు తీసుకోవాలి. గ్లోబల్ వార్మింగ్‌కి పరిష్కారాన్ని సూచించే దిశగా ముందుకు కదలాలి'' అని బాన్ కి మూన్ అన్నారు.

ఈ సంస్థ పిలుపుకి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందనే వచ్చింది. ఎన్నో దేశాల నుండి ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి వారివారి ప్రాంతాల్లో తమకి తోచిన విధంగా చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వాల నుండి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్‌హౌస్ మీద సోలార్ అద్దాలు బిగించాలని ఈ సంస్థ కోరితే ఒబామా నిరాకరించారు. అయితే ఆయన నిరాకరణ కూడా అక్కడ పెద్ద వార్తే అయింది, 350.ఆర్గ్ తమ సందేశాన్ని ముందుకి తీసుకెళ్లేందుకు అది కూడా తోడ్పడింది. గత ఏడాది కూడా ఈ సంస్థ పిలుపుతో 180 దేశాల్లో 5,200 కార్యక్రమాలు జరిగాయి. ఈ సంస్థ చేపడుతున్న పనులకి మద్దతు తెలుపుతూ అదే దిశలో పయనిస్తున్న సంస్థ మరొకటుంది.

10:10 క్యాంపెయిన్

ప్రపంచంలో కార్బన్ ఉద్గారాన్ని ఏడాదికి 10 శాతం చొప్పున తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలనే నినాదంతో ఏర్పడినదే ఈ 10:10 క్యాంపెయిన్. 'ఏజ్ ఆఫ్ ది స్టుపిడ్' అనే డాక్యుమెంటరీతో వెలుగులోకి వచ్చిన బ్రిటన్ మహిళ ఫ్రాన్నీ ఆర్మ్‌స్ట్రాంగ్ ఈ సంస్థని స్థాపించింది. ఇప్పటికి డెబ్బై వేలకి పైగా ప్రజలు, వ్యాపార సంస్థలు, స్కూళ్లు, కాలేజీలు ఈ క్యాంపెయిన్‌లో చేరాయి. వీరి కార్యక్రమాలకి కూడా భలే గుర్తింపొచ్చింది. అందుకే ఇప్పుడు బ్రిటన్‌లో 10:10 గుర్తుని మెడలో వేసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఈ సంస్థ బోయింగ్ ఒక 747 విమానాన్ని కూడా కొనుగోలు చేసింది. దాన్నెక్కి తిరుగుతూ క్యాంపెయిన్ చెయ్యడానికి కాదు, 10:10 గుర్తుల్ని తయారు చేయడానికి ముడి పదార్థం కోసమని. కూలిపోయిన ఆ విమానాన్ని కొనుగోలు చేసి వాటి శకలాలతో 10:10 గుర్తుల్ని తయారు చేశారు వాళ్లు. ఇప్పుడు దేశమంతటా కొన్ని ప్రత్యేక షాపుల్లో ఆ గుర్తుల్ని అమ్ముతున్నారు. ఈ రోజుల్లో ఏపని చేసినా కొంత కళాత్మకంగా చేస్తేనే వాటికి తగిన గుర్తింపు వస్తుందని బలంగా నమ్మినట్టున్నారు.

గ్లోబల్ వర్క్ పార్టీ

350.ఆర్గ్ ఈ రోజు కార్యక్రమాల్ని 'గ్లోబల్ వర్క్ పార్టీ' అని పిలుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పనుల్ని పార్టీల్లా చేపడుతున్నారు కాబట్టే దీనికి ఈ పేరు పెట్టారు. గత ఏడాది 180 దేశాల్లో వివిధ కార్యక్రమాలు జరిపి సాధించిన విజయం ఇచ్చిన ఉత్సాహంతోటే ఈ రోజు ఈ పార్టీ జరుపుతున్నామని అంటున్నారు ఆ సంస్థ వాళ్లు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఒకే విషయంపై ఒకే రోజు భారీ సంఖ్యలో జనం దృష్టి సారించడం ఒక రికార్డు. ఇలాంటి క్యాంపెయిన్లు విజయవంతంగా చేపట్టడంలో ఇంటర్నెట్ పాత్ర కీలకం అని అంటున్నారు వాళ్లు. 10-10-10న జరిగే ఈ కార్యక్రమాలు వచ్చే డిసెంబరులో మెక్సికోలో జరగబోయే ఐరాస పర్యావరణ సమావేశాన్ని కొంతవరకైనా ప్రభావితం చేస్తాయని ఆశిద్దాం అంటున్నారు మెక్‌కిబ్బెన్.
***
మీరు కూడా ఈ రోజున కార్బన్ ఉద్గారాన్ని తగ్గించే పనేదైనా చేయండి. పర్యావరణ సమస్యని ఒక్కరోజులోనే పరిష్కరించలేం. పరిష్కరించే దిశగా అడుగు వేయడం ముఖ్యం.

ఈ పనులు చేద్దాం...

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జనం తమకు తాముగా ముందుకొచ్చి చేస్తున్న పనుల్లో ముఖ్యమైనవి ఓ పది ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ చేసేలా ప్రజల్ని కదిలించడం ఒకటి రెండు రోజుల్లో జరిగింది కాదు. దీని వెనక మూడేళ్ల కృషి ఉంది. ఆ పనులేవంటే...
* మొక్కలు నాటడం
* సౌరశక్తితో నడిచే పరికరాల్ని వినియోగించడం
* పెరట్లోనే సేంద్రీయ కూరగాయల్ని పండించడం
* సైకిళ్లు వాడడం
* వాయుశక్తిని వినియోగించుకోవడం
* విద్యుత్ వినియోగాన్ని తగ్గించే లైట్లను వాడడం
* మత కూడికల్లో 'గ్లోబల్ వార్మింగ్' గురించి చర్చించడం
*'రీసైక్లింగ్' చేసిన వస్తువుల్ని వాడడం
*10:10 క్యాంపెయిన్‌లో భాగస్వాములవడం.

Monday, September 27, 2010

The Grand Design


కవర్‌స్టోరీ

స్టీఫెన్ హాకింగ్-ఐన్‌స్టీన్ తర్వాత అంతటి పేరుప్రఖ్యాతుల్ని, గౌరవాన్ని సంపాదించుకున్న శాస్త్రవేత్త. ఆయన పేరు వినగానే రెండు విషయాలు మనసులో మెదులుతాయి. ఒకటి వీల్‌చైర్‌కి అంకితమైపోయిన ఆయన శరీరం, రెండోది ఆయన రాసిన 'ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్'. అనంత విశ్వం పుట్టుక గురించి రాసిన పుస్తకం. 1988లో అచ్చైన ఆ పుస్తకమే ఆయన్ని సామాన్య జనకోటికి సుపరిచితుణ్ణి చేసింది. ఒక్క ఇంగ్లీషులోనే 90 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. వందకి పైగా భాషల్లోకి అనువాదమైంది. ఆ స్టీఫెన్ హాకింగే ఇప్పుడు మరొక శాస్త్రవేత్త లియొనార్డ్ మ్లాదినోవ్‌తో కలిసి 'ద గ్రాండ్ డిజైన్' అనే పుస్తకం రాశారు. ఈ నెల 7న విడుదలైన ఆ పుస్తకం విశ్వం గురించిన 'శాస్త్రీయ అవగాహన చరిత్ర'ను మరోసారి పరిశీలిస్తుంది. ఆ పుస్తకంలోని కొన్ని భాగాలే ఈ వారం కవర్‌స్టోరీ.


"మనుషుల జీవితకాలం చాలా తక్కువ. ఆ కొద్ది కాలంలో ఈ విశ్వంలోని ఏ కొద్ది భాగాన్నో మాత్రమే మనం శో«ధిస్తాం. మనలో తలెత్తిన ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతాం.... మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనమెలా అర్థం చేసుకోవాలి? ఈ విశ్వం ఇలాగే ఎందుకుంది? ఇది అసలెక్కడినుంచి వచ్చింది? ఎవరైనా సృష్టించారా? మనల్ని ఈ సందేహాలు నిత్యం వేధించకపోయినా ఎప్పుడో ఒకసారి అయినా మనం వాటిగురించి ఆలోచించకుండా ఉండలేం.
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాల్సింది తత్వశాస్త్రం. అయితే తత్వశాస్త్రానికి ఎప్పుడో కాలం చెల్లింది. శాస్త్రీయ రంగం, ముఖ్యంగా భౌతికశాస్త్ర రంగంలో జరుగుతున్న అభివృద్ధిని అర్థం చేసుకునేంతగా తత్వశాస్త్రం ఎదగలేదు. జ్ఞానాన్వేషణ అనే ప్రయాణంలో శాస్త్రవేత్తలే కాగడా పట్టుకు ముందుకు నడిపించే నాయకులయ్యారు. ఆ క్రమంలోనే ఈ మధ్యకాలంలో కనుగొన్న విషయాలు, చేసిన సైద్ధాంతిక ప్రతిపాదనలు మన ప్రశ్నలకి సమాధానాలిస్తున్నాయి. వాటిని అందించడమే ఈ పుస్తకం ఉద్దేశం.......

ఆధునిక భౌతికశాస్త్రం అభివృద్ధి చెందేవరకు ప్రపంచాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకోవచ్చని అనుకునే వాళ్లు. మనకి కనిపిస్తున్నట్టే వస్తువులు ఉంటాయని, మనం అవగతం చేసుకున్నదే వాస్తవమని మనం అనుకోవచ్చు గాక. కాని ఆధునిక భౌతిక శాస్త్రం అలా భావించదు. మనకి కనిపించే దృశ్యాల్ని మనం అర్థం చేసుకునే తీరు, అవే దృశ్యాల్ని ఆధునిక భౌతికశాస్త్రం విశ్లేషించే తీరు ఒకలా ఉండవు. అందుకే విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి 'మోడల్ డిపెండెంట్ రియలిజం'ని ఉపయోగించాలి. అంటే ఏమిటంటే... మన ఇంద్రియాలు మెదడుకి చేరవేసే సంకేతాల్ని బట్టి మన మెదడులో మన చుట్టూ ఉన్న ప్రపంచ నమూనా ఏర్పడుతుంది. మన చుట్టూ జరిగే ప్రక్రియల్ని ఆ నమూనా వివరించగలిగితే ఆ వాస్తవాన్నే మనం నిజం అని నమ్ముతాం. అయితే ఒకే భౌతిక సందర్భాన్ని వేర్వేరు సిద్ధాంతాలు వేర్వేరుగా వివరించవచ్చు. ఏదైనా ఒక ప్రక్రియని రెండు భిన్న సిద్ధాంతాలు వేర్వేరుగా వివరించినపుడు వాటిలో ఏది మెరుగో చెప్పలేం కాని మనకి అనుకూలంగా ఉన్న సిద్ధాంతాన్ని ఉపయోగించుకోవచ్చు.

శాస్త్ర విజ్ఞాన రంగంలో వచ్చిన మార్పుల్ని గమనిస్తే... ఒకదాని తర్వాత ఒకటిగా మెరుగైన సిద్ధాంతాలు, నమూనాలు వస్తూనే ఉన్నాయి. ప్లాటో నుంచి న్యూటన్ సిద్ధాంతాల దాకా, క్వాంటమ్ సిద్ధాంతాల దాకా మనం కొత్తకొత్త నియమాలను తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ క్రమానికి ముగింపు లేదా అని అనుకుంటూనే ఉన్నా ఈ విశ్వానికి సంబంధించిన ప్రతి కదలికను, మన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని వివరించగలిగే ఒకే ఒక సిద్ధాంతం ఉండదా? ఈ ప్రశ్నకి సమాధానం మనవద్ద లేదు కాని అలాంటి సిద్ధాంతం గనక ఒకటుంది అనుకుంటే అదే ఎం. సిద్ధాంతం. ఆ సిద్ధాంతంపై ఆధారపడే ఈ చర్చ మొత్తం జరగనుంది. ఎం-సిద్ధాంతం ప్రకారం మన విశ్వం ఒక్కటే కాదు, మరెన్నో విశ్వాలున్నాయి. వాటి సృష్టికి ఏ దేవుడి అవసరమూ లేకపోయింది. భౌతిక సిద్ధాంతాలను బట్టి చూసినపుడు ఆ విశ్వాలన్నీ వాటంతటవే ఏర్పడ్డాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే మనలాంటి జీవులు ఉండడానికి అనుకూలంగా ఉంటాయి. మొత్తం విశ్వాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే ఆ విశ్వం ఎలా ప్రవర్తిస్తుందో మాత్రమే తెలుసుకుంటే సరిపోదు, అలా ప్రవర్తించడానికి కారణాలు తెలుసుకోవాలి.

ఈ విశ్వం ఎందుకుంది? శూన్యమే ఉండొచ్చుగా!
మనం ఎందుకున్నాం?
ఈ విశ్వాన్ని గురించి తెలియజేయడానికి కొన్ని సిద్ధాంతాలు మాత్రమే ఎందుకున్నాయి, వేరేవి ఎందుకు లేవు?

జీవితానికి, విశ్వానికి... సమస్తానికి సంబంధించి ఇవే అంతిమ ప్రశ్నలు. ఈ పుస్తకంలో పై ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తాం.......

***

వాస్తవం అంటే ఏమిటి?

కొన్నేళ్ల క్రితం సంగతి... ఇటలీలోని మోంజా అనే నగర కౌన్సిల్ గోల్డ్ ఫిష్‌లను గోళాకార గాజు పాత్రల్లో ఉంచకూడదని నగర పౌరులను కోరింది. గుండ్రంగా ఉన్న గాజు గోడల గుండా చేప బయటి ప్రపంచాన్ని చూసినపుడు, దాని కళ్లకి బాహ్య ప్రపంచం వంగినట్టు కనిపిస్తుందని వారి వాదన. మరి మనం చూసేది సత్యమని మనకెలా తెలుసు? మనం కూడా గోల్డ్ ఫిష్‌లాగే ఒక మహాగోళంలో నుండి బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నామేమో. గోల్డ్ ఫిష్ చూసేదానికి మనం చూసేదానికి తేడా ఉన్నా, మనం చూసేదే వాస్తవమని మనం ఎలా చెప్పగలం? నేరుగా వెళుతున్న ఏదైనా వస్తువు గోల్డ్ ఫిష్‌కి వలయాకారంలో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. దాన్నిబట్టి ఆ చేప వేరే శాస్త్రీయ పరిశీలనలు చేయొచ్చు, ఆ ఫిష్‌బౌల్ నుండి చూసినపుడు అవన్నీ కరెక్టే అని కూడా అనిపించవచ్చు...... ఖగోళంలోని వస్తువుల కదలికల ఆధారంగా టాలమీ క్రీ.శ. 150లో ప్రకృతి నియమాలను ప్రతిపాదించాడు. దాని ప్రకారం భూమి విశ్వానికి కేంద్రం... కాని 16వ శతాబ్దంలో కొపెర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

పై రెండు సిద్ధాంతాల్లో ఏది వాస్తవమో తెలుసుకోవడం కంటే, మనం చేస్తున్న పరిశోధనలకి ఏది పనికొస్తుందని భావిస్తామో దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఫిష్‌బౌల్ లోపల ఉన్నపుడు ఆ చేపకి కనిపిస్తున్న వాస్తవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కాని బయట నుండి చూసినపుడు అది పనికి రాదు... అందుకే ఎం-సిద్ధాంతం కొన్ని సిద్ధాంతాల సముదాయం కాబట్టి ఆ సిద్ధాంతం ఉపయోగించి విశ్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ విశ్వంలో ప్రతి వస్తువు కదలికలను, ప్రవర్తనను శాస్త్రీయ సిద్ధాంతాలతో వివరించవచ్చు...

***

సృష్టి గురించి....

సృష్టికి సంబంధించి చైనీయులు 1782లో ఒక సంఘటన జరిగిందని నమ్ముతారు. దాని ప్రకారం.... అప్పుడు ఒక్కసారిగా విశ్వం మొత్తం మారిపోయింది. పది సూర్యగ్రహాలు ఒకేసారి ప్రత్యక్షమయ్యాయి. వాటి వేడికి ప్రజలందరూ ఇబ్బంది పడడంతో అప్పటి చక్రవర్తి ఒక్క సూర్యుణ్ణి మాత్రం ఉంచి మిగిలిన వాటిని బాణంతో కూల్చేయమని ఆజ్ఞాపించాడు..... సౌరమండలంలో ఎక్కువ సూర్యులుంటే జీవానికి అనువుగా ఉండదని చైనీయులు గ్రహించారు... సౌరమండలంలోని గ్రహాలలో కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి కాబట్టే ఇక్కడ జీవం ఆవిర్భవించింది. అయితే ఈ సౌరమండలంలో గ్రహాల గమనానికి సంబంధించి శాస్త్రవేత్తల ప్రతిపాదించిన నియమాలను ఇక్కడ ప్రస్తావించాం. సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాల గమనం కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటుందన్న విషయాన్ని వివరించాం. అందుకే దేవుడు, దెయ్యం లాంటి మరే ఇతర శక్తి తమ ఇష్టం వచ్చినట్టుగా ఈ విశ్వాన్ని నడపలేదని మేం అంటున్నాం.

***

నియమం అంటే ఏమిటి?


ఒక నియమానికి ఒక క్రమం ఉంటుంది. ఏదైనా చర్య జరిగినపుడు ఆ చర్య జరిగిన క్రమాన్ని బట్టి శాస్త్రవేత్తలు దాని తర్వాత ఏం జరుగుతుందో అంచనా వేస్తారు. అయితే మనం చూసినదల్లా నియమం అయిపోదు. రోజూ సూర్యుడు తూర్పున ఉదయించడం మనం చూస్తున్నంత మాత్రాన 'సూర్యుడు తూర్పున ఉదయించును' అని సిద్ధాంతీకరించలేం కదా. దాన్ని శాస్త్రీయ నియమంగా గుర్తించలేం....
ఆధునిక శాస్త్రంలో అన్ని నియమాలూ గణిత సమీకరణాల్లో ఇమిడి ఉంటాయి. వాటిలో కొన్ని నియమాలకి ఖచ్చితమైన విలువలు ఉండొచ్చు, కొన్నిటికి ఉండకపోవచ్చు. ఆ నియమాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వర్తించవచ్చు. న్యూటన్ గమన నియమాలు భూమ్మీద ప్రయాణించే వస్తువులకి వర్తిస్తాయి కాని కాంతి వేగంతో ప్రయాణం చేస్తున్న వస్తువులకు వర్తించవు. అయినా వాటిని నియమాలుగా గుర్తించాం... ఈ సృష్టి కొన్ని నియమాలకి కట్టుబడి ప్రవర్తిస్తుందని చెప్పింది శాస్త్రవేత్తలే.

సృష్టి ఆ నియమాలకు తగ్గట్టుగా ప్రవర్తించేలా రూపొందించిందెవరు?
ఆ నియమాలకి మినహాయింపు ఉంటుందా?
అసలు ఆ నియమాలు ఎందుకు?

ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు వారి వారి సమాధానాలిచ్చారు. అయినా ఈ నియమాలన్నీ సృష్టించింది దేవుడే అనుకునేవారు కూడా ఉన్నారు. ఈ సృష్టి నియమాల సముదాయమే దేవుడని అంటారు వారు. ఒకవేళ అవి దేవుడి సృష్టే అయితే వాటికి మినహాయింపులు ఉంటాయా? ఆయనే సృష్టించిన వాటికి మినహాయింపులు కల్పించడం ఏమిటి.....

ఖగోళంలోని గ్రహ, నక్షత్రాలకు సంబంధించి మాత్రమే అలాంటి నియమాలు వర్తిస్తాయని, భూమిపైన జరిగే రకరకాల ప్రక్రియలకు, మానవుల ప్రవర్తనకు ఆ నియమాలు వర్తించవని మొదట్లో భావించే వారు. ఎందుకంటే భూమ్మీద జరిగే వాటికి కారణాలను ప్రాచీన నాగరికులు కనుగొనలేక పోయారు. అయితే క్రమంగా ఖగోళమే కాదు, భూమ్మీద జరిగే ప్రతి క్రియకి కొన్ని నియమాలున్నాయని, వాటికి కట్టుబడే అవి జరుగుతాయని కనుగొన్నారు....
ఈ మొత్తం విశ్వం ఒకానొక నిర్ధారిత సమయంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి తగిన నియమాలు ఉన్నపుడు మాత్రమే ఆ నిర్ధారిత సమయం నుంచి విశ్వంలో క్రమంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో పరిశీలించగలం, అధ్యయనం చేయగలం. ఆ నియమాలన్నీ అన్ని వేళలా నిరూపించబడాలి. అప్పుడే అవి నియమాలవుతాయి. వాటికి మినహాయింపులు ఉండకూడదు. అంటే... వాటికి కట్టుబడి కాకుండా ఏ అద్భుతాలో జరగడానికి తావుండకూడదు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించడంలో దేవుళ్లు దెయ్యాల ప్రమేయం ఉండకూడదు.....
శాస్త్రీయ నిర్ధారణ అనే ఆలోచన వచ్చాకే న్యూటన్ గమన నియమాలు మనకు తెలిశాయి. ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్దాంతంతో శాస్త్రీయ నిర్ధారణ మరో అడుగు ముందుకేసింది. ఆ తర్వాత వచ్చిన మరికొన్ని నియమాలు విశ్వాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడంలో దోహదపడ్డాయి. అయితే ఈ నియమాలన్నీ విశ్వానికి సంబంధించినంత వరకు వివిధ చర్యలు ఎలా జరుగుతున్నాయనే విషయాన్నే పరిశీలిస్తున్నాయి కాని ఎందుకలా జరుగుతున్నాయనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాయి.

ఆ ప్రశ్నకి సమాధానం దేవుడని, ఈ విశ్వాన్ని సృష్టించింది దేవుడేనని కొందరంటారు. ఈ సృష్టికి మూలం దేవుడైనపుడు ఆ దేవుణ్ణి సృష్టించినవారెవరు అనే ప్రశ్న కూడా తలెత్తకుండా ఉండదు. అలా వాదించుకుంటూ పోతే... ఏదైనా వస్తువుని ఎవరూ సృష్టించనవసరం లేదని, అది అలా ఏర్పడవచ్చని, అదే దేవుడని కూడా వాదించే వారున్నారు. అయితే ఈ సృష్టి ఎందుకలా ఏర్పడిందన్న ప్రశ్నకి సమాధానం చెప్పడానికి దేవుడు అవసరం లేదు. సైన్సే వాటికి సమాధానం చెబుతుందని మేమంటున్నాం."
(ఎలాగో తెలుసుకోవాలంటే ఎం. సిద్ధాంతాన్ని తెలుసుకోవాల్సిందే, పుస్తకం చదవాల్సిందే)

ఎం-సిద్ధాంతం అంటే...

పరమాణు స్థాయిలో పదార్థాల ప్రవర్తనని అభ్యసించేది క్వాంటమ్ సిద్ధాంతం. ఖగోళంలోని గ్రహాల, నక్షత్రాల గురించి అభ్యసించేది సాపేక్ష సిద్ధాంతం. ఈ రెండిటినీ కలిపి ప్రతిపాదించినది స్ట్రింగ్ సిద్ధాంతం. ఇది పరమాణువు నుంచి అనంత విశ్వం దాకా దేనిగురించి అయినా అభ్యసించడానికి దోహదపడుతుంది. కాబట్టి దీన్ని 'థియరీ ఆఫ్ ఎవ్విరిథింగ్' అని అంటారు. దీని కొనసాగింపుగానే ఎం. సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎం. అంటే మెంబ్రేన్.

Sunday, September 19, 2010

Bhagwati Brothers

భగవతి బ్రదర్స్

జస్టిస్ ప్రఫుల్లచంద్ర ఎన్ భగవతి- సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.
జగదీష్ భగవతి-ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత పాల్‌క్రుగ్మన్ గురువు.
సనత్ ఎన్ భగవతి-ప్రముఖ న్యూరాలజిస్ట్, 'ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ పీడియాట్రిక్ న్యూరోసర్జరీ' మాజీ అధ్యక్షుడు.
ప్రవీణ్ భగవతి-'వరల్డ్ ఫౌండ్రీ ఆర్గనైజేషన్' మాజీ అధ్యక్షుడు.
'భగవతి' పేరు పెట్టుకుంటే ఎవరైనా ఇలాగే గొప్పవాళ్లవుతారా? లేకపోతే ఆ పేరు పెట్టుకున్న ప్రముఖుల్లో వీళ్లు కొందరా? వీళ్లంతా అన్నదమ్ములైతే కాదు కదా... అనుకుంటున్నారా? మీరు ఊహించింది నిజమే. ఈ నలుగురూ అన్నదమ్ములే. వారివారి రంగాల్లో అత్యున్నత స్థానానికి చేరిన 'భగవతి బ్రదర్స్'. అదే వారి స్పెషాలిటీ.


ఈ నలుగురే కాదు. భగవతిలు మొత్తం ఏడుగురు అన్నదమ్ములు. ఒకసారి 1920లలోకి వెళ్తే... ముంబైలో నివాసముంటున్న గుజరాతీ లాయర్ నట్వర్‌లాల్ హెచ్ భగవతికి ఏడుగురు సంతానం. అందరూ కొడుకులే. వారిలో పెద్దవాడైన జస్టిస్ పి ఎన్ భగవతి 1921 డిసెంబర్ 21న పుట్టారు. 'అందరం మగ పిల్లలమే కావడంతో మా తల్లిదండ్రులు మా కజిన్ ఒకమ్మాయిని దత్తత తీసుకున్నారు. అలా మాకొక చెల్లెలు కూడా తోడైంది. అంతేకాదు, చుట్టాల పిల్లలు మరో ఇద్దరు కూడా మా ఇంట్లోనే ఉండి చదువుకునేవారు. మొత్తం పదిమంది పిల్లలవడంతో మాకు నిత్యం సందడే. ఒక్కో రూంలో ఇద్దరం, ముగ్గురం ఉండేవాళ్లం. ఎప్పుడు చూసినా ఎవరోఒకరు అల్లరి చేస్తూనే ఉండేవారు. అలా మా బాల్యమంతా చాలా ఆనందంగా గడిచింది. అందుకేనేమో ఇప్పటికీ నాకు నిశ్శబ్దం అంటే నచ్చదు సరికదా... అలా ఉంటే అసలు పనే చేయలేను. మా అన్నయ్య జస్టిస్ పిఎన్ భగవతి కూడా అంతే. ఓ వైపు ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నా అదేమీ పట్టించుకోకుండా తాను ఇవ్వవలసిన జడ్జిమెంటును స్టెనోకు గంటల తరబడి డిక్టేట్ చేస్తూనే ఉండేవారు' అని జగదీష్ భగవతి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

నట్వర్‌లాల్ హెచ్ భగవతి అప్పటికే పేరుమోసిన లాయర్, ఆయన స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడమే కాకుడా కొడుకుల్ని కూడా పాల్గొనేలా ప్రోత్సహించారు. ఆయన స్ఫూర్తి తోటే జస్టిస్ పిఎన్ భగవతి కాలేజీలో చదువుకునే రోజుల్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్లారు. మిగతా వాళ్లంతా చిన్నపిల్లలు కావడంతో ఉద్యమంలో పాల్గొనక పోయినా ఆ రోజుల్ని కళ్లారా చూసిన వాళ్లే.
స్వాతంత్య్రానంతరం నట్వర్‌లాల్ భగవతి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. రిటైరైన తర్వాత బెనారస్ హిందూ యూనివర్శిటీకి వైస్ చాన్సలర్‌గా కూడా పని చేశారాయన. తండ్రి స్ఫూర్తి తోనే ఆయన కొడుకుల్లో నలుగురు ప్రతిభలో తండ్రిని మించిన కొడుకులయ్యారు. వారిలో పెద్దవాడు జస్టిస్ పిఎన్ భగవతి.

లెక్కలు వదిలి లాయరై...

జస్టిస్ పి ఎన్ భగవతి బొంబాయి మొత్తంలోనే మెట్రిక్యులేషన్‌లో రెండో ర్యాంక్ సా«ధించారు. ఆ తర్వాత బొంబాయి లోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజి నుండి 1941లో గణితంలో బిఏ ఆనర్స్ చేసి అదే కాలేజిలో గణితశాస్త్రంలోనే ఎంఏలో చేరారు. 1942లో స్వాతంత్రోద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. తర్వాత నాలుగు నెలలపాటు అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే 'లా' చదవాలని నిర్ణయించుకున్నారు. బొంబాయి ప్రభుత్వ లా కాలేజిలో లా పూర్తి చేసి బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1960లో గుజరాత్ హైకోర్టు జడ్జిగా, 1967లో అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1973లో సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపికై 1985-86లో భారత ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన హయాంలోనే 'ప్రజాప్రయోజనాల వ్యాజ్యాల' స్వీకరణ మొదలైంది. జస్టిస్ భగవతి ఎన్నో అంతర్జాతీయ మానవహక్కుల సంస్థల్లో వివిధ స్థాయిల్లో పనిచేశారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిటీకి చైర్మన్‌గా కూడా ఉన్నారు.

ఆయన ఇచ్చిన తీర్పువల్ల ప్రయోజనం పొందిన ఒక ఊరి గిరిజనులు తమ ఊరి పేరును భగవతిపురంగా మార్చుకున్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని శ్రామికులకు, బాల కార్మికులకు సంబంధించి ఆయన వెలువరించిన తీర్పులు కేంద్రప్రభుత్వాన్ని ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టేలా చేశాయి. అందుకే జస్టిస్ భగవతిని స్వతంత్రభారత చరిత్రలోనే గొప్ప న్యాయమూర్తిగా పరిగణిస్తారు.
ఆ అన్నయ్యకు ఏమాత్రం తీసిపోలేదు జగదీష్ భగవతి.

గ్లోబలైజేషన్ గురు...

ప్రపంచంమొత్తంలో ఇప్పుడు ఎక్కువమంది చర్చిస్తున్న అంశం ఏదంటే 'ప్రపంచీకరణ' అని తడుముకోకుండా చెప్పేయొచ్చు. ఈ వివాదాస్పద సిద్ధాంతాన్ని నిస్సంకోచంగా సపోర్ట్ చేసి 'గ్లోబలైజేషన్ గురు'గా పేరొందిన ఆర్థికవేత్త జగదీష్ భగవతి. ప్రస్తుతం కొలంబియా యూనివర్శిటీకి చెందిన 'స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్'లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. 76 ఏళ్ల భగవతి గౌరవార్థం ఆయన పేరుమీద అదే యూనివర్శిటీలో 'జగదీష్ భగవతి చైర్' కూడా ప్రారంభించారు.

2004లో వచ్చిన 'ఇన్ డిఫెన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్' పుస్తకమే ఆయన్ని గ్లోబలైజేషన్ గురుని చేసింది. 'ఫ్రీ ట్రేడ్' సిద్ధాంతకర్తగా ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆయన్ని మన దేశ ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్‌తో సత్కరించింది. అంతేకాదు... జపాన్ ప్రభుత్వం ఆయన్ని 2006లో 'ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్-గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్'తో గౌరవించింది. చాలాయేళ్లుగా నోబెల్ పురస్కారం అందుకోగల వారి జాబితాలో ఆయన పేరు ఉంటూనే ఉంది. ఆయనకు రాకపోయినా ఆయన ప్రియశిష్యుడు పాల్ క్రుగ్మన్ నోబెల్ బహుమతి పొందారు.

ఇరవయ్యేళ్లకే ఇండియా వదిలి కేంబ్రిడ్జి యూనివర్శిటీలో బిఏ పూర్తి చేసిన జగదీష్ 1967లో అమెరికాలోని 'మసాసుచెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -ఎం.ఐ.టీ' నుండి పీహెచ్‌డీ పూర్తి చేశారు. మన దేశంలోని పలు యూనివర్శిటీలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. దాదాపు అర్ధశతాబ్దంగా ఆయన రాస్తున్న పుస్తకాలు, వ్యాసాలు, చేసిన ప్రసంగాలు ఆయన కీర్తిని మరింత పెంచాయి. మన దేశ ఆర్థికవ్యవస్థ గురించి కూడా ఆయన చాలా రచనలు చేశారు. 'హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ'లో ప్రారంభించబోతున్న 'హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్' కోసం ఆయన్ని మన దేశం తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే గనక జరిగితే 'మా యూనివర్శిటీ కీర్తి గణనీయంగా పెరుగుతుంద'ని విద్యార్థులు, ప్రొఫెసర్లు అంటున్నారు.

ఆర్థికవేత్తగా కీర్తిప్రతిష్టలు మూటగట్టుకున్న జగదీష్ భగవతి నిజానికి 'లా' చదివి న్యాయవాది కావాలని ఆయన తండ్రి కోరిక. 'ఒక కొడుకు లాయర్ అయ్యాడుగా... అది చాలు అని నేను వారించేవాడిని. మా నాన్న కోరిక ఆయన బ్రతికి ఉండగా తీర్చలేకపోయాను కాని ఇప్పుడు నేను ఎకనామిక్స్‌తో పాటు లా ప్రొఫెసర్నయ్యాను. ఆ విధంగా కొంతయినా మా నాన్న కోరిక తీర్చగలిగాను' అని జగదీష్ భగవతి పేర్కొన్నారు.

న్యూరాలజిస్ట్‌గా...

భగవతి కుటుంబంలోనే మరొకరు డాక్టరై ప్రతిభలో తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. ఆయనే సనత్ ఎన్. భగవతి. 1952లో మెడిసిన్ డిస్టింక్షన్‌తో పూర్తి చేశారు. 1956లో లండన్‌లోని ప్రఖ్యాత ఆట్కిన్‌సన్ మార్లీ హాస్పిటల్‌లో 'రిజిస్ట్రార్'గా చేరారు. ఆ సమయంలో గ్రేట్ బ్రిటన్‌లోనే గొప్ప న్యూరోసర్జన్‌గా పేరొందిన కెన్నెత్ టిల్ అనే డాక్టర్‌తో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్న సనత్ ఆ తర్వాత చికాగోలోని చ్రిల్డన్స్ మెమోరియల్ హాస్పిటల్‌లో పని చేశారు. ఆ సమయంలోనే తన ప్రతిభాపాటవాలతో గొప్ప న్యూరోసర్జన్‌గా పేరు సంపాదించి స్వదేశం తిరిగొచ్చారు. 1962లో బాంబే హాస్పిటల్‌లో కన్సల్టెంట్ న్యూరోసర్జన్‌గా, గ్రాంట్ మెడికల్ కాలేజిలో గౌరవ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. అప్పటి నుండి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ది న్యూరొలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా, ట్రెజరర్‌గా, సెక్రటరీగా... ఆ తర్వాత 1989లో ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో న్యూరోసర్జన్ల సంఘాలలో వివిధ స్థాయిల్లో పని చేశారు. 'ఆసియన్ ఆస్ట్రేలియన్ సొసైటీ ఆఫ్ న్యూరోసర్జన్స్'కి అధ్యక్షుడై, ఆ తర్వాత 2005లో ఇంటర్నేషనల్ న్యూరలాజికల్ పీడియాట్రిక్ సొసైటీకి కూడా అధ్యక్షుడయ్యారు. ప్రపంచంలోనే ఒక న్యూరోసర్జన్‌కి దక్కే అతిపెద్దగౌరవం కూడా అదే.

ఫౌండ్రీ ఇంజనీర్...

అన్నల్లాగే పేరు తెచ్చుకున్నాడు ప్రవీణ్ భగవతి కూడా. పూనే ఇంజనీరింగ్ కాలేజిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రవీణ్ ఉన్నత చదువులకోసం జర్మనీ వెళ్లారు. ఆ దేశంలోని 'ఆచెన్ హోచూల్' నుండి 1962లో పిహెచ్‌డీ పూర్తి చేశారు. తన అన్నల్లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించారో ఏమో ప్రవీణ్ తన పరిశోధనా జ్ఞానంతో వ్యాపారం వైపు దృష్టి సారించారు. అహ్మదాబాద్‌లో 'భగవతి ఆటోకాస్ట్స్ లిమిటెడ్' స్థాపించారు. మన దేశంలోని అన్ని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలకి కావాల్సిన స్పేర్‌పార్ట్‌లను తయారు చేస్తుంది ఆ సంస్థ. వ్యాపారంతోపాటు పరిశోధనలో కూడా రాణించిన ఆయన 'ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఫౌండ్రీమెన్'కు అధ్యక్షుడయ్యారు. మన దేశంలో ఆటోమొబైల్స్‌కి పెరుగుతున్న గిరాకీతోపాటు ఆటోకాస్ట్ ఇండస్ట్రీ కూడా గతంలో మరెన్నడూ లేనంతగా ఎదుగుతోంది. అయితే దానికో దిశను నిర్దేశించింది మాత్రం ప్రవీణే. అందుకే ఆయన చేసిన కృషి ఫలితంగా 2006లో 'వరల్డ్ ఫౌండ్రీమెన్ ఆర్గనైజేషన్'కి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

***

నలుగురు అన్నదమ్ములూ తమతమ రంగాల్లో ఉన్నతస్థానాలు అ«ధిరోహించిన వైనాన్ని ప్రస్తావిస్తూ జగదీష్ భగవతి ఇలా అన్నారు. "చదువుకి ఉన్న విలువను మా నాన్న నుంచి చిన్నప్పుడే తెలుసుకున్నాం. కేవలం తెలుసుకోవడంతో ఊరుకోకుండా దానిని ఆచరణలో పెట్టాం. భగవతి టౌన్‌షిప్ గనక నిర్మిస్తే అందులో ఉండే వాళ్లందరూ ప్రముఖులే అవుతారని మా ఫెండ్స్ నవ్వుతుంటారు.''

- నాగేశ్వరరావు తమనం

Monday, September 6, 2010

caught on facebook


కవర్‌స్టోరీ

చౌరస్తాలో నిలబడ్డట్టే

కన్నతల్లికోసం ముప్పయ్యేళ్లు ఎదురు చూసిన ఒకామెకి ఆ తల్లిని ఒకే ఒకరోజులో వెతికి పెట్టింది.
చెయ్యని నేరానికి జైలు కెళ్లిన ఓ యువకుణ్ణి నిర్దోషిగా నిరూపించింది.
ఒంట్లో బాగోలేదని సాకులు చెప్పి పని ఎగ్గొట్టిన ఒక ఉద్యోగి గుట్టు బయటపెట్టింది.
డిప్రెషన్‌లో ఉన్నానంటూ హెల్త్ ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్ చేసుకుని ఆ సమయమంతా పార్టీల్లో ఎంజాయ్ చేసిన ఒకామెకి ఆ డబ్బు రాకుండా చేసింది.
లాగ్ అవుట్ చెయ్యని పాపానికి ఒకాయన చేసిన దొంగతనాలన్నీ బయటపెట్టింది.
మనసులో ఉన్నదాన్ని వ్యక్తపరిచినందుకు మరొకరి ఉద్యోగమే పోగొట్టింది.
ఈ 'మంచి చెడు'లన్నీ చేస్తున్నది ఏ నిఘా సంస్థో కాదు. వికీలీక్స్ అంతకన్నా కాదు. అదో ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్క్. ఇంటర్నెట్ వాడే వాళ్లందరికీ చిరపరిచితమైన ఫేస్‌బుక్. ఆ విశేషాలే ఈ వారం కవర్‌స్టోరీ.


ఆన్‌లైన్లో అమ్మ దొరికింది

డానా లారీకి ఇప్పుడు 41 ఏళ్లు. కాలిఫోర్నియాలోని రోజ్‌విల్లెలో నర్స్‌గా పని చేస్తున్న ఆమెకి తనని పసితనంలోనే దత్తత తీసుకొన్నారని తెలుసు. ఆ ఒక్కముక్క తప్ప తన అసలు తల్లిదండ్రులెవరో, వాళ్లు ఎక్కడుంటారో తెలీదు. వాళ్ల గురించి తెలుసుకోవడానికి లారీ చేయని ప్రయత్నం లేదు. పిల్లల్ని దత్తత ఇచ్చే ఎన్నో సంస్థల్ని సంప్రదించింది. వాళ్ల రికార్డులన్నీ తిరగేసింది. 'ఎడాప్షన్ ఏజెన్సీలు' ఆన్‌లైన్లో పొందు పరిచిన జాబితాలన్నీ జల్లెడ పట్టింది. ఇలా కొన్నాళ్లపాటు వెతికినా ఎలాంటి ఆధారాలుగానీ, కనీసం వారి ఆనవాళ్లు గానీ ఏమీ దొరకలేదు ఆమెకి.

ఈ సంవత్సరం జనవరి 10న ఫేస్‌బుక్‌లో చేరి తన తల్లికోసం వెతుకుతున్నట్లు చెప్పుకుంది. ఫేస్‌బుక్ ద్వారా ఈ వార్త లక్షల మందికి చేరింది. వారిలో కొందరు 'అమ్మ'ను వెతకడానికి పూనుకున్నారు. ఆ నోటా ఈ నోటా పాకి అది చివరకు వాళ్లమ్మను చేరింది. దీనంతటికీ పట్టింది 24 గంటలే. అంటే కొన్నేళ్లుగా తాను వెతుకుతున్న అమ్మని ఆమె ఫేస్‌బుక్‌లో 24 గంటల్లోనే వెతుక్కోగలిగింది. అంతేకాదు జనవరి 15 కల్లా తన తండ్రిని కూడా కలుసుకోగలిగింది.

ఇన్నేళ్లుగా తనకీ ఆలోచన ఎందుకు రాలేదు అనుకుని ఆశ్చర్యపోతోంది లారీ. ఇంటర్నెట్‌లేని రోజుల్లో దత్తత తీసుకోబడిన చాలామందికి వారి అసలు తల్లిదండ్రులెవరో తెలుసుకోవడం కొంచెం..కాదు కాదు చాలా కష్టం. అయితే లారీ తన తల్లిదండ్రుల్ని కనుగొనడంతో ఇప్పుడు చాలామంది ఇదే బాట పడుతున్నారు. అయితే వాళ్లని దత్తత తీసుకున్న పేరెంట్స్‌కి ఇది పెద్ద సమస్య అవుతోంది. వాళ్లు అసలు తల్లిదండ్రులకే దగ్గరైపోతారేమోనని దత్తత తీసుకున్న వాళ్లు ఆందోళన చెందుతుంటే, తమ పిల్లల్ని ఆన్‌లైన్లో చూసి వారి గురించి తెలుసుకుని పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని పశ్చాత్తాపం చెందుతున్నారు అసలు తల్లిదండ్రులు.

రెండేళ్లు వెనక్కి వెళితే- లారీయే 19 ఏళ్ల క్రితం దత్తత ఇచ్చిన తన కొడుకుని 'మై స్పేస్' అనే మరో సోషల్ నెట్‌వర్క్ ద్వారా కలుసుకోగలిగింది. ఇప్పుడు లారీ తన కొడుకు, అమ్మ, నాన్న... అందరినీ కలవగలిగింది. ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడూ కలుసుకుంటారు. ఫేస్‌బుక్ ఉంది కాబట్టి ఎవరెక్కడుంటున్నారో తెలుసుకోవడం సులభమవుతోంది అంటున్నారు.

మెసేజ్ సేవ్ చేసింది...

న్యూయార్క్‌కి చెందిన 19 ఏళ్ల రోడ్నీ ఫేస్‌బుక్ సహకారంతో జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. అలా తప్పించుకున్న మొట్టమొదటి వ్యక్తి అతనే అని అక్కడి న్యాయవాదులు అంటున్నారు. 2009 అక్టోబర్‌లో ఓ మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తుల్ని గన్‌తో బెదిరించి ఎవరో దోచుకున్నారు. అయితే అంతకుముందు ఓ దొంగతనం కేసులో రోడ్నీ హస్తం ఉండడంతో ఇది కూడా తనే చేశాడని పోలీసులు భావించి అతన్ని జైల్లో పెట్టారు. దొంగతనాన్ని చూసిన వాళ్లు కూడా అది చేసింది రోడ్నీయే అని సాక్ష్యం చెప్పడంతో అతనికి శిక్ష ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే రోడ్నీకి తెలుసు నిజమేమిటో. కానీ అదెలా నిరూపించాలో తెలియలేదు.

చివరికి ఫేస్‌బుక్‌తో అది సాధ్యమైంది. ఆ దొంగతనం జరిగినప్పుడు రోడ్నీ మాన్‌హాటన్‌లోని తన తండ్రి అపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు. ఆయన కంప్యూటర్ నుండి రోడ్నీ తన గర్ల్‌ఫ్రెండ్‌కి ఫేస్‌బుక్‌లో మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్‌ను రోడ్నీ తండ్రి కోర్టుకు సమర్పించాడు. జడ్జి కూడా ఫేస్‌బుక్ ఓపెన్ చేసి ఆ మెసేజ్ ఏ టైమ్‌కి వెళ్లిందో, ఏ 'ఐపి' అడ్రస్ నుంచి వెళ్లిందో పరిశీలించి రోడ్నీ తండ్రి ఐపి అడ్రస్ నుంచే వెళ్లిందని నిర్ధారించుకున్నాడు. ఒకే వ్యక్తి రెండు చోట్లా ఎలా ఉంటాడు అని అడిగి కేసు కొట్టి వేశాడు. మొత్తం మీద రోడ్నీని ఫేస్‌బుక్ అలా రక్షించింది. ఇంటర్నెట్‌లో మనం మెసేజ్‌లు పంపించినా, చాటింగ్ చేసినా, మెయిల్ చేసినా ఆ సమయం రికార్డు అవుతుంది. దాన్ని ట్యాంపర్ చెయ్యడం ఎవరి వల్లా కాదు. అందుకే ఇప్పుడది 'అథెంటిక్ ప్రూఫ్' అని న్యూయార్క్ పోలీసులు అంటున్నారు.

వైట్‌హౌస్ 'సెక్యూరిటీ'ని బయట పెట్టింది...

మిచెల్లె, తరిక్ సలాహిలు వాషింగ్టన్ వాసులు. ఆ నగరంలోని 'బ్రేవో' అనే టెలివిజన్ చానల్ నిర్వహించే 'ది రియల్ హౌజ్‌వైవ్స్ ఆఫ్ డి.సి.' అనే రియాలిటీ షోలో ఎలాగైనా పాల్గొనాలని నిశ్చయించుకున్నారు ఈ జంట. అయితే ఆ షోలో పాల్గొనే అవకాశం రావడం అంత తేలిక కాదు. రాత్రికి రాత్రే ఇన్‌స్టంట్‌గా పాపులర్ అయిన వ్యక్తులకి మాత్రమే దాంట్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ. ఏదో ఒక వింత పనో కొంటె పనో చేస్తే తప్ప అప్పటికప్పుడే అంత పాపులారిటీ ఎలా వస్తుంది చెప్పండి? అందుకే అలాంటి పని ఒకటి చేయాలనుకున్నారు ఆ జంట. మన దేశ ప్రధాని గత ఏడాది నవంబర్‌లో అమెరికా సందర్శించినపుడు ఆయన గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు నవంబర్ 24 సాయంత్రం విందు ఇచ్చారు. ఆ విందుకి ఆహ్వానం కొద్దిమంది ప్రముఖులకి తప్ప మరెవరికీ ఉండదు.

అయినా దానిలోకి ఆహ్వానం లేకుండా చొరబడాలనుకున్నారు. అనుకోవడమే కాదు, అంత పని చేసి చూపించారు కూడా. అమెరికా అధ్యక్ష భవనం సెక్యూరిటీని కూడా దాటుకుని ఎలాగైతేనేం లోపలికెళ్లారు. బరక్ ఒబామాతోటి, ఇతర ప్రముఖులతోటి కరచాలనాలు, పలకరింపులు లాంటివి జరిగాయి. అందరు నాయకులతోటి ఫోటోలు కూడా దిగారు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోలన్నీ మిచెల్లె ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది. వైట్‌హౌస్ సెక్యూరిటీ ఎంతబాగా పనిచేస్తోందో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోవడమే కాకుండా మిచెల్లె, తరిక్ సలాహీలు సెలబ్రిటీలయిపోయారు. ఫేస్‌బుక్‌లో వాళ్లకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అనుకున్నట్టుగానే వాళ్లు ఆ రియాలిటీ షోలో పాల్గొనడానికి ఎంపికయ్యారు.

అంత ఆసక్తి పనికి రాదు...

హాలిడేస్‌లో మనం ఎక్కడెక్కడ తిరిగామో, ఏయే ప్రదేశాలు సందర్శించామో... ఎంత ఎంజాయ్ చేశామో... ఆ వింతలూ విశేషాలూ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌తో అప్పటికప్పుడే పంచుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చెయ్యొచ్చు, వాటి గురించి రాయొచ్చు. అందరిలాగే అదే పని చేశాడు మ్యాక్సి సోపో. ఆ విశేషాలే ఆయన్ని జైలు పాలు చేశాయి. అమెరికాలోని సీటిల్‌కి చెందిన 26 ఏళ్ల సోపో ఓ బ్యాంకు నుండి రెండులక్షల డాలర్లు కాజేసి మెక్సికో పారిపోయాడు. తన వద్ద ఉన్న డబ్బుతో అక్కడ తెగ ఎంజాయ్ చేశాడు. చేస్తే చేశాడు కాని ఆ విశేషాలన్నీ ఎవరికీ చెప్పకుండా ఉంటే బాగుండేది. కాని సోపో మాత్రం 'నేను స్వర్గంలో ఉన్నాన'ంటూ ఫేస్‌బుక్‌లో తన విహార యాత్ర విశేషాలన్నీ రాశాడు. అంతటితో ఆగకుండా ఆ విశేషాల్ని సాధ్యమైనంత ఎక్కువమందితో పంచుకోవాలనుకుని ఫేస్‌బుక్‌లో ఎవరిని పడితే వారిని ఫ్రెండ్స్ లిస్ట్‌లో చేర్చుకుని ఆ విశేషాలన్నీ తెలిపాడు. ఐతే సోపో అమెరికా న్యాయశాఖ అధికారి ఒకాయన్ని కూడా ఫ్రెండ్స్ లిస్ట్‌లో చేర్చుకోవడంతో ఆయన సోపో గురించి ఆరాతీశాడు. చివరికి సోపోని మెక్సికోలో అరెస్టు చేసి అమెరికా తీసుకొచ్చారు.

గ్రూప్ తెచ్చిన కష్టాలు....

ఒక దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగేంత కెపాసిటీ ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌కి ఉందో లేదో కాని క్రొయేషియా ప్రధాని మాత్రం ఆ గ్రూప్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. ఆ దేశ ప్రధాని ఇవో శానాడర్‌ను 'ఇష్టపడని వాళ్లని కనీసం 5000 మందినన్నా కూడగడతాను' అనే పేరుతో ఓ ఫేస్‌బుక్ గ్రూప్‌ను 22 ఏళ్ల నిక్సా క్లెకాక్ అనే యువకుడు ప్రారంభించాడు. ఆ విషయం ప్రభుత్వాధికారులకి తెలిసి ఆయన్ని అరెస్టు చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రభుత్వం హరించి వేస్తున్నదని జనం ఆ అరెస్టుని నిరసించారు.

అయితే అరెస్టుకి కారణం క్లెకాక్ ఆ గ్రూప్‌ని మొదలుపెట్టడం కాదని, ఆ గ్రూప్‌లో ఉంచిన ప్రధాని ఫోటో గురించి అని చెప్పారు. నాజీ యూనిఫార్మ్‌లో ఆయన ఫోటో పెట్టాడు. కాబట్టి ప్రధానిని ఆ డ్రస్‌లో చూపడం నేరమని అన్నారు. చివరికి తేలిందేమిటంటే ఆ గ్రూప్‌లో చేరిన వాళ్లలో ఎవరో ఆ ఫోటోని పెట్టారని, క్లెకాక్‌కి దానితో ఏ సంబంధం లేదని. అయితే అప్పటికే ఆ యువకుడు జైలుకెళ్లాల్సి వచ్చింది.

ఆఫీస్‌కి డుమ్మా కొడితే....

21 ఏళ్ల కైల్ డాయిల్ 2008 అక్టోబర్‌లో ఓ రోజు ఫేస్‌బుక్ ఓపెన్ చేసి తన స్టేటస్ మెసేజ్‌లో 'ఫుల్‌గా తాగాను...అందుకే ఆఫీసుకి పోవట్లేదు' అని రాసుకున్నాడు. ఆస్ట్రేలియాకి చెందిన డాయిల్ ఒక కాల్ సెంటర్ ఉద్యోగి. మీ సీక్రెట్‌లు ఇతరులకి తెలిస్తే దానికి మేం బాధ్యులం కాదు అని ఫేస్‌బుక్ పదేపదే పేర్కొంటున్నా డాయిల్ లాంటి చాలామంది తామేం చేసినా ఫేస్‌బుక్‌లో రాసుకుంటున్నారు. ఒంట్లో బాగోలేదని ఆఫీస్‌కి సెలవు పెట్టిన డాయిల్ ఫేస్‌బుక్ పేజ్‌ని ఆఫీస్‌లో వాళ్లు చూశారు.
అనారోగ్యం సాకుతో శెలవు తీసుకున్నాడని గ్రహించి జీతంలో కోత విధించారు. అయితే ఫేస్‌బుక్‌లో తాను అలా రాసినందువల్లే జీతంలో కోత పడిందని డాయిల్‌కి తెలీదు. అకారణంగా తన జీతంలో కోత విధించారని, తాను అనారోగ్యం వల్లనే ఆఫీస్‌కి రాలేదని బుకాయించాడు. అప్పుడు తాను ఫేస్‌బుక్‌లో రాసిన దాన్ని తీసి ఆయనకే మెయిల్ చేశారు. జీతంలో కోత పడినా డాయిల్‌కు మాత్రం కొందరు ఫాన్స్ దొరికారు. ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఫేస్‌బుక్ గ్రూపులు కూడా మొదలు పెట్టారు.

లాగవుట్ చెయ్యకపోతే అంతే మరి...

ఫేస్‌బుక్‌కి ఎంతగా బానిస అయిపోయినా దొంగతనానికి వెళ్లినపుడు ఆ పనేదో చూసుకోవాలి కాని కంప్యూటర్ కనపడిందని ఫేస్‌బుక్‌లోకి ఎంటరైపోకూడదు. రోమ్‌లో జొనాథన్ పార్కర్ అనే దొంగ ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. కంప్యూటర్ కనిపించడంతో ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. అయితే దొంగతనం చేయాలనే హడావిడిలో లాగ్అవుట్ చెయ్యడం మర్చిపోయి వెళ్లిపోయాడు. తర్వాత సీన్‌లోకి ఎంటరైన పోలీసులు ఆ ఫేస్‌బుక్ ఎకౌంట్ ఓపెన్ చేసి ఉండడం చూసి ఆయనే దొంగ అని నిర్థారించుకుని దాంట్లో ఉన్న వివరాల ద్వారా ఎలాగైతేనేం ఆయన్ని పట్టుకున్నారు.

పార్టీలకెళ్తే...హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా వస్తుంది?

ఉద్యోగులు, ఉద్యోగార్థులు తమ ఆన్‌లైన్ ఇమేజ్‌ని కాపాడుకోవాలని, తమకి సంబం«ధించినంత వరకు ఎలాంటి నెగటివ్ విషయాలు ఎక్కడా రాకుండా ఉండాలని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా ఇరుక్కుపోతారు. అలాగే దొరికిపోయింది నటాలీ బ్లెంకార్డ్ అనే కెనడాలోని క్యుబెక్ వాసి. పని వత్తిడి వల్ల డిప్రెషన్‌కి లోనయ్యానని, అందుకు గాను తనకు రావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని అప్లయ్ చేసుకొంది. అయితే ఆమె ఆ శెలవు రోజుల్లో పార్టీలకి, ఫంక్షన్లకి తిరుగుతూ ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలని ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఆ ఫొటోలని చూసిన ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె ఇప్పుడు కోర్టుకెక్కింది. మరి కోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.

'మా మంచి అమ్మ'గా ఉంటే అంతే

అమెరికాలోని ఒహయోలోని ఓ స్కూల్లో పార్ట్ టైం టీచర్‌గా పనిచేసే మేరీ ఎలెన్ హౌస్ మంచి అమ్మగా ఉండాలనుకుందో ఏమో తన కొడుకుతో పాటు మరో ముగ్గురు విద్యార్థులు తన ఇంట్లో మందు తాగడానికి పర్మిషన్ ఇచ్చేసింది. అయితే ఆ టీనేజ్ స్టూడెంట్స్ పార్టీ చేసుకుని ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. విద్యార్థులు ఆన్‌లైన్లో ఏయే వెధవ వేషాలేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉన్న ఆ స్కూల్ రిసోర్స్ ఆఫీసర్ ఆ ఫొటోలు చూశాడు. తన ఇంట్లో మందు తాగనిచ్చినందుకు మేరీకి 30 రోజులు జైలు శిక్షతోపాటు 500 డాలర్ల ఫైన్ వేశారు.

అన్నీ అనుకున్నట్టు జరగవుగా. ఇలాంటి సంఘటనల వలనో లేదా రోజూ గంటల కొద్దీ ఫేస్‌బుక్‌లో గడపడం వల్ల బోర్ కొట్టిందో ఏమో ఇప్పుడు దాని నుంచి బయటపడాలనుకునే వారు కూడా ఎక్కువవుతున్నారు. అందుకే గూగుల్‌లో '"how to delete Facebook account'' అనే సెర్చ్‌లు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఈ జనరేషన్ అంతే. ఏ నెట్‌వర్క్‌లోనైనా చేరడం, అంతలోనే అది నచ్చక బయటికొచ్చేయడం అన్నీ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతున్నాయి.

ఫేస్‌బుక్ జనాభా ఎంత?

యాభై కోట్లు దాటిందని ఆ మధ్య పత్రికల్లో కూడా వచ్చింది. అవును... దాన్నే గనక ఒక దేశం అనుకుంటే జనాభా పరంగా అది ప్రపంచంలోనే మూడో పెద్ద దేశమవుతుంది. ప్రపంచంలోని ప్రతి నలుగురు నెటిజన్లలో ఒకరు ఫేస్‌బుక్ యూజర్. నిజానికి దానిది స్కూల్లో చేరే వయస్సే... అంటే జస్ట్ సిక్స్ ఇయర్స్. అవును పుట్టిన ఆరేళ్లకే ఈ సోషల్ నెట్‌వర్క్ అంతగా ఎదిగి ఇంటర్నెట్ సూపర్‌పవర్స్‌లో ఒకటిగా మారింది. హార్వర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ మార్క్ జూకర్‌బర్గ్ రూపొందించిన ఈ నెట్‌వర్క్ ఇప్పుడు ప్రపంచంలోనే మరే నెట్‌వర్క్‌కి లేనంతమంది యూజర్లని సంపాదించుకుంది. దీన్ని రూపొందించినపుడు జూకర్‌బర్గ్ వయసు 21 ఏళ్లు.

మైక్రోసాఫ్ట్ మనకి కంప్యూటర్లని చేరువ చేయడమే గాక వాటిని ఉపయోగించడం సులభతరం చేసింది. కావల్సిన సమాచారాన్ని గూగుల్ ఒక సెర్చ్‌తో మన కళ్లముందు ప్రత్యక్షమయ్యేలా చేసింది. యూట్యూబ్ మనల్ని వీడియోలతో ఎంటర్టెయిన్ చేస్తూనే ఉన్నది. అయితే ఫేస్‌బుక్ అలాకాదు. మనల్ని కంప్యూటర్‌కి అతుక్కుపోయేలా చేస్తుంది. మన భావాల్ని వ్యక్తపరచడానికి, కొత్త స్నేహాల్ని ఏర్పరచుకోవడానికి, పాత స్నేహితుల్ని వెదుక్కోవడానికి అదో అవకాశంగా మారింది. అందుకే ఎప్పుడో స్కూల్లో కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహాల గురించి ఆరా తీయాలన్నా ఇప్పుడు జనమంతా మరోమారు ఆలోచించకుండా ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేస్తున్నారు.

13 ఏళ్లు దాటితే చాలు

13 ఏళ్లు దాటిన వాళ్లెవరైనా ఫేస్‌బుక్‌లో చేరొచ్చనడంతో హైస్కూల్ స్టూడెంట్స్ కూడా ఫేస్‌బుక్‌లో ఎకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. విద్యార్థులేం చేస్తున్నారో ఆరా తీయడానికి టీచర్లు... పిల్లలేం చేస్తున్నారో తెలుసుకోవడానికి తల్లిదండ్రులు... ఫ్రెండ్స్ గురించి తెలుసుకోడానికి తోటి వాళ్లు... ఇలా అన్ని వయసుల వాళ్లూ ఫేస్‌బుక్‌లో చేరుతున్నారు. అందుకే ఇప్పుడు నెటిజెన్లకి అది క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. ఎవరెక్కడున్నా, ఏం చేస్తున్నా ఆ విశేషాలన్నీ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమవుతున్నాయి.

ఇతరులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి, తొంగి చూసే అలవాటు ఎంతో కొంత అందరిలోనూ సహజంగా ఉండేవే కాబట్టి అలాంటి వారందరూ ఫేస్‌బుక్‌లో ఎదుటివాళ్ల గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. ఫేస్‌బుక్ జనాభా పెరుగుతున్నట్టే దాంట్లో తమ సొంత విషయాల్ని పేర్కొనడం కూడా ఎక్కువైంది. ఇంతకు ముందు వ్యక్తిగతం అనుకున్న చాలా విషయాలు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో రాస్తున్నారు. అందుకే ఇప్పుడు ఒక్కొక్కరి ఫేస్‌బుక్ ఎకౌంటూ ఒక్కో ఓపెన్ డైరీ. ఉద్యోగులు తమ బాస్‌ల గురించి, విద్యార్థులు లెక్చరర్ల గురించి కామెంట్లు రాయడానికి ఫేస్‌బుక్‌నే ఎంచుకొంటున్నారు.

ఈ మెయిల్‌లా కాకుండా ఫేస్‌బుక్‌లో రాసిన వాటిని ఎవరైనా చూడొచ్చు. సగటున ఒక్కొక్కరూ కనీసం గంట సేపు ఫేస్‌బుక్ వాడుతున్నారు. రోజుకి కోట్లలో మెసేజ్‌లు రాస్తున్నారు. వారానికి పదికోట్ల కొత్త ఫొటోలొచ్చి ఫేస్‌బుక్‌లో చేరుతున్నాయి. పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లు, పుట్టినరోజులు దగ్గర్నుంచి వీకెండ్ పార్టీల దాకా ఏ చిన్న విశేషమైనా దాని ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టడం, వాటి సంగతుల్ని వివరించడం ఇప్పుడు నెటిజన్లకి ఫేవరైట్ పాస్‌టైం. అయితే ఒక్కోసారి ఆ ఫోటోలు, మనం రాసే రాతలే మనల్ని ఇరకాటంలో పెట్టొచ్చు. ఒక్కోసారి మనల్ని రక్షించనూ వచ్చు. అందుకే ప్రైవసీ గురించి కొత్త చర్చని లేవనెత్తింది ఫేస్‌బుక్. దాచుకోవడం నుంచి ప్రదర్శించడం వైపు ఆ చర్చ మళ్లింది.