అన్నయ్యొచ్చినాడో... ఎలుగులొ ఎన్నెల్దెచ్చినాడోఅన్నయ్యొచ్చినాడో... హల్‌చల్ చిందుల్దెచ్చినాడో
ఎలుగులొ ఎన్నెల్దెచ్చినాడో... హల్‌చల్ చిందుల్దెచ్చినాడో...
సినిమాల్లో రీయెంట్రీకి రెడీ అయిన చిరు ఓ టీవీ చానల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన స్టూడియోలోకి ఎంటరయ్యేసరికి జోష్ సినిమాలోని ఈ 'అన్నయ్య' పాట వస్తూ ఉంది. అది విన్న చిరంజీవి "అదేంటండీ... ఆ పాట పెట్టారు? మా సినిమా వాళ్లు ఫాలో అయ్యే సంప్రదాయం తెలీదా మీకు. ఏ హీరో సినిమాలో అయినా బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగో, మ్యూజిక్కో వాడాల్సొస్తే ఆ హీరో పాత పాటలే వాడతారు కాని వేరే హీరో పాటల్ని పెట్టరని తెలుసు కదా.
అంతెందుకు ఏ నటవారసుడి సినిమా అయినా చూడండి, వాటిలో వాళ్ల నాన్న పాటో, తాత పాటో అన్నయ్య పాటో పెట్టుకుంటారు కాని వేరే హీరోల పాటల్ని చచ్చినా పెట్టరు. నా సినిమాలు, మా వాళ్ల సినిమాలు ఏమీ చూడలేదా?'' అని ఎప్పట్లాగే కొంత మొహమాటపడుతూ అడిగారు. "అలా ఏం లేద్సార్, మీ రీయెంట్రీకి ఈ పాట అయితేనే బాగా సూటయ్యిద్దనీ... తీసెయ్యాలంటే చెప్పండి. మీరు చెప్పినట్టే చేద్దాం. మీరు ఏ చిన్న విషయాన్నైనా చాలా సీరియస్‌గా తీసుకుంటారని చెప్పారు. మీ అబ్బాయి ఫస్ట్ సినిమా రిలీజైనప్పుడు టీవీ చానళ్లలో ఇంటర్వ్యూ ఇస్తుంటే, కెమేరా ఫ్రేమ్‌లు ఎలా ఉండాలో కూడా మీరే చెప్పారట కదా. చెప్పండి ఠాగూర్ పాటో, స్టాలిన్ సాంగో పెట్టమంటారా'' అడిగాడు టీవీషో ప్రొడ్యూసర్.
"ఇప్పుడు నా కొడుకు గురించెందుకు లెండి. నా రీయెంట్రీ గురించి మీకో ఇంటర్వ్యూ ఇవ్వమన్నారు... వచ్చాను. రాజకీయాల్లో ఎంటరైన తర్వాత మైకుల ముందు మాట్లాడడం ఎక్కువైంది. కెమేరా ఎలా ఉన్నా పర్వాలేదు'' అన్నారు చిరు. "ఇంటర్వ్యూ మొదలు పెడదామా సార్. ప్రశ్నలు ముందే చెప్పమంటారా...'' అడిగాడు యాంకర్.
"అన్నీ నా రీయెంట్రీ గురించైతే అవసరం లేదు. రాజకీయాల గురించైతే మాత్రం ప్రశ్నలు ముందే ఇవ్వాలి. ఇవ్వకుండా అడిగితే నేనింకా రాజకీయాల్లో నేర్చుకోవాల్సింది చాలా ఉందని మాత్రమే చెబుతా. అంతకంటే ఒక్కముక్క కూడా చెప్పనంతే.''
"సరే సార్... మొదలు పెడదామా సార్!''
లాంగ్‌షాట్‌లో యాంకర్, చిరంజీవి ఇద్దరూ కనిపిస్తున్నారు. కట్ చేస్తే యాంకర్ క్లోజప్.
"ఎన్నో యేళ్లపాటు సినీరంగంలో నెంబర్‌వన్ హీరోగా తెలుగు తెరపై నిలిచిన మన చిరు అన్నయ్య తర్వాత సినిమాలకి దూరమై ప్రజలకి దగ్గరయ్యారు.... ఇప్పుడు వెండితెరపైకి మరోసారి రానున్నారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారి రాజకీయ ప్రస్థానం గురించి, సినీరంగంలోకి రీయెంట్రీ గురించి మనతో మాట్లాడనున్నారు'' అని భారీగా ఇంట్రడక్షన్ ఇచ్చాడు యాంకర్. "అదేంటి, నేను ముందే చెప్పాను కదా రాజకీయాల గురించి ఆడగొద్దని. రాజకీయ ప్రస్థానం అంటున్నాడేంటి'' మనసులోనే తిట్టుకున్నారు చిరంజీవి. అయినా తన మనసులోని ఆందోళన ఏ మాత్రం బయటికి కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. వెంటనే కెమేరాని చిరంజీవి మొహం మీదకి ఫోకస్ చేసి క్లోజ్అప్‌లో చూపించారు టీవీ చానల్ వాళ్లు.
"వెల్‌కమ్ టు అవర్ షో సార్. మీరు లావు తగ్గి ప్రజానాయకుడి నుంచి కథానాయకుడిలా తయారై రావడానికి చికిత్స కోసం లండన్ వెళ్లారని వార్తలొచ్చాయి. ఇప్పుడు చూస్తే.....''
"వార్తలు మీరే వేసి మళ్లీ వార్తలొచ్చాయని అంటున్నారు'' అని అనాలనుకున్నాడు కాని అనలేదు. "నన్ను చూసినాక్కూడా ఆ కన్ఫ్యూజన్ ఎందుకు...'' అని మాత్రమే అన్నారు. అంటూ కన్నుగీటారు.
"మీరు రాజకీయాల్లోకి రాకముందు చాలా నెలల పాటు ఇలాగే సస్పెన్స్ సాగింది. మీరు పొలిటికల్ పార్టీ పెడతారా లేదా అనే విషయం కూడా చాలాకాలం పెద్ద సస్పెన్సే. అంతా సినిమా ఫక్కీలోనే జరిగిందనుకోండి. మీరు పార్టీ లాంచ్ చేశాక మీ పార్టీ ఎలాంటి పెనుమార్పులకి శ్రీకారం చుడుతుందనే విషయం గురించి కూడా చాలామంది విశ్లేషకులు తమ ప్రెడిక్షన్స్ చెప్పారు. మీరు వాళ్లకిచ్చిన బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఏంటి?''
"చూడండి, వాళ్లు అన్ని విషయాలూ మాట్లాడారు కాని, నేను ఓడిపోతానా గెలుస్తానా అన్న ఒక్క విషయం మాత్రం ఎవరూ చర్చించనేలేదు. అందుకే నా పాలకొల్లు ఓటమే నేనిచ్చిన బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్'' అని చాలా స్పోర్టివ్‌గా చెప్పారు చిరు.
"సడన్‌గా రాజకీయాలనుంచి బ్రేక్ తీసుకుని సినిమా చేయడానికి కారణం...''
"ఈ విషయం గురించి కూడా చాలాకాలం నుంచి వార్తలొస్తూనే ఉన్నాయి. రజనీకాంత్ స్ఫూర్తితోటే నాకూ మళ్లీ నటించాలనిపించి..''
"అంతేనా... ఇంకేమీ లేదా?''
"పోనీ మీకు తెలిస్తే చెప్పండి''
"అభిమానుల కోరిక మేరకే వస్తున్నానని మీరే చెప్పారు కదా! నిజం చెప్పాలంటే అలాంటి వార్తలు వచ్చినట్టు నాకైతే తెలీదు'' యాంకర్ నీళ్లు నములుతూ అన్నాడు.
"సినిమాల్లో అయితే ఒక్క హిట్ లేకుండా కూడా కొన్నేళ్లపాటు నెంబర్‌వన్‌గా కొనసాగొచ్చు. పాలిటిక్స్‌లో అలా కాదు. ఒక్క ఎన్నికలు చాలు... హీరోలు జీరోలయిపోతారు. తర్వాత ప్రజలకి సేవ చేసే అవకాశం వాళ్లకి రావాలంటే ఎన్నేళ్లో వెయిట్ చెయ్యాలి. అందుకే మళ్లీ సినిమాల్లోకి...'' యాంకర్ ప్రశ్నని ఇగ్నోర్ చేస్తూ అన్నారు.
"ప్రజా సేవంటే గుర్తొచ్చింది. మీరు అంతగా అభిమానించి ఆరాధించే మదర్ థెరిస్సా శతజయంతి ఈ మధ్యే జరిగింది కదా. దేశ విదేశాల్లో కూడా ఆమె జన్మదిన వేడుకలు జరిగితే మరి ఆమె పుట్టిన రోజుని మీ పార్టీ జరిపినట్టు లేదే''
"మా పార్టీ శ్రేణులు జరుపుకున్నాయి లెండి. అయినా మీరు నా సినిమా రీయెంట్రీ గురించి అడుగుతానన్నారు...'' గుర్తు చేశారు అన్నయ్య.
యాంకర్ అక్కడికే వస్తున్నా అన్నట్టు తలూపి... "ఒకప్పుడు సినిమాలు ప్రజల్ని ఎంటర్‌టైన్ చెయ్యడంతోపాటు గొప్ప రాజకీయ నాయకుల్ని కూడా తయారు చేశాయి. ఇప్పుడు ఆ రెంటిలో ఏ పనీ చెయ్యలేకపోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దీని గురించి మీరేమంటారు''
"మీరు ఎవరి గురించి అంటున్నారు?'' సూటిగా అడిగారు చిరు.
"అబ్బే ఎవరి గురించీ కాదు సార్! నా ఉద్దేశం ఇప్పటి సినిమాలు ఎంటర్‌టైన్ చెయ్యలేకపోతున్నాయా అని మాత్రమే''
సర్దుకున్నాడు యాంకర్.
"ఎంటర్‌టైన్ చేసేపని కూడా రాజకీయాలు, మీ న్యూస్ చానళ్లూ కలిసి చేస్తున్నాయి కదా'' చదరంగంలో చెక్ చెప్పినట్టుగా అన్నారు చిరు.
"మా చానళ్ల గురించి ఎందుకు కాని... మీ కొత్త సినిమాకు కథ ఏమనుకుంటున్నారు?'' అసలు విషయానికి వచ్చాడు యాంకర్.
"ముందు మీకేమైనా లీకైతే చెప్పండి. తర్వాత అసలు కథ చెబుతాను''
"చూస్తుంటే సీన్ రివర్సై మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టుంది. సరే చెప్పమన్నారు కాబట్టి చెబుతున్నాను. మీ ఠాగూర్, స్టాలిన్ సినిమాల రేంజ్‌లో కరప్షన్ గురించట. కానీ ఇది కాస్త డిఫరెంటట. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సీట్లమ్ముకుంటే ప్రజల మాట అటుంచి ఆ పార్టీల పరువు, భవిష్యత్తు ఏమైపోవచ్చో, చివరికి ఆ పార్టీలు లీడర్లని, క్యాడర్నీ ఎలా కోల్పోతాయో చెప్పడమే స్టోరీ అని విన్నాం''
"మీకు ఇలా స్టోరీలు లీక్ అవుతున్నాయి కాబట్టే నా సినిమా స్టోరీ ఈ సారి అత్యంత సీక్రెట్‌గా ఉంచాం. సినిమా నా కొడుకే ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి లీక్ అయ్యే చాన్సే లేదు. డైరెక్ట్ చేసేదాకా ఆ స్టోరీ డైరెక్టర్‌కి కూడా తెలీనివ్వం. అంతా సస్పెన్స్. ప్రేక్షకులకి మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం'' ముగిస్తున్నట్టుగా చేతులు జోడించారు చిరు.
"పాలకొల్లు లాంటి సర్‌ప్రైజ్ కాదు కదా'' అనబోయి నాలుక కొరుక్కుని "మీ న్యూలుక్ సూపర్ సార్! మాకూ మిమ్మల్ని మళ్లీ వెండితెరపై చూడాలనుంది. ఆల్ ద బెస్ట్'' అని శెలవు తీసుకున్నాడు యాంకర్.
- తమనం
No comments:
Post a Comment