Tuesday, February 22, 2011

ఆటగాళ్ల వెనుక మాటగాళ్లు

సచిన్ టెండూల్కర్‌కి 'లిటిల్ మాస్టర్' అనే పేరెలా వచ్చింది?
హర్భజన్‌సింగ్‌కి 'టర్బొనేటర్' అనే పేరెవరు పెట్టారు?
లక్ష్మణ్ పేరుని ఎవరు 'వెరీ వెరీ స్పెషల్ ' చేశారు?
ద్రావిడ్‌ని 'ది వాల్' అంటూ అభివర్ణించిందెవరు?
'ఏమో... ఎవరు పెడితే ఏంటి? టీవీలో కామెంటరీ చెప్పేవాళ్లు మాత్రం వారినలాగే పిలుస్తారు' అంటారా? నిజమే.. పిలవడమే కాదు. ఆటగాళ్లకి ఆ పేర్లు పెట్టింది కూడా ఆ 'మాటగాళ్లే'.. ఒకప్పటి ఆటగాళ్లు.. మైక్రోఫోన్ పట్టి కామెంటేటర్లుగా కొత్త అవతారమెత్తుతున్న సీనియర్ క్రికెటర్లు.
-------------------
'వావ్... వాట్ ఎ షాట్ !'
'ఇన్ ది ఎయిర్... అండ్ ఈజ్ టేకెన్'
'ఫౌండ్ ద గ్యాప్...క్లియర్స్ ద రోప్'
'గాన్ ఓవర్ ద టాప్... అండ్ ఇట్స్ ఎ సిక్స్'
ఈ డైలాగులేవీ లేని క్రికెట్ మ్యాచ్ చూడడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సచిన్ క్రీజ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తున్నా, సెహ్వాగ్ ధాటికి ప్రతి బంతి బౌండరీలైన్ దాటుతున్నా... కనిపించే దృశ్యానికి తోడు వినసొంపైన కామెంటరీ లేకుండా క్రికెట్ చూడగలమా..? మూకీ సినిమా చూసినట్టు ఉండదూ ! అందుకే కామెంటరీ అంత ప్రాధాన్యత సంతరించుకొంది. అదే హర్షభోగ్లేని హీరోని చేసింది. రిటైరైన ఆటగాళ్లను మళ్లీ క్రికెట్‌కి దగ్గర చేస్తోంది. అలాంటి వారిలో కొందరు ప్రపంచ క్రికెట్‌లోనే మేటి కామెంటేటర్లుగా ఎదిగారు. టోనీ గ్రెయిగ్, జెఫ్రీ బాయ్‌కాట్ లాంటి మాజీ ఇంగ్లీష్ క్రికెటర్లు నేటి తరానికి మేటి కామెంటేటర్లుగా మాత్రమే తెలుసు. కాస్త వెనక్కెళ్తే... ఆస్ట్రేలియన్ మాజీ టెస్ట్ క్రికెటర్ రిచీ బెనాడ్‌ని 'మాస్టర్ ఆఫ్ మైక్రోఫోన్' అని పిలుస్తారు. ఆయనే మేటి కామెంటేటర్ ఇప్పటికీ.

నలభయ్యేళ్లకు పైగా రేడియో, టీవీ కామెంటేటర్‌గా పని చేసిన రిచీ బెనాడ్ కామెంటేటర్ వృత్తికే గౌరవాన్ని తీసుకొచ్చాడు. మేటి కామెంటేటర్ అవుతాడని ముందే గ్రహించాడో ఏమో 26 ఏళ్ల వయసులోనే.. మేటి ఆల్‌రౌండర్‌గా క్రికెట్ జట్టులో సుస్థిర స్థానం ఉండగానే బీబీసీ రేడియో ప్రెజెంటర్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఓ వైపు క్రికెట్ ఆడుతూనే మరోవైపు వేరే జట్లు ఆడే మ్యాచ్‌లకు రేడియో కామెంటేటర్‌గా పని చేసేవాడు. తర్వాత ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఎన్నికై ఆరేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వహించి 1964లో రిటైర్ అయ్యాడు. తర్వాత తన పూర్తి సమయాన్ని కామెంటరీకే కేటాయించాడు. టీవీ రంగప్రవేశం చేయడంతో రేడియోని వదిలి టీవీ కామెంటేటర్‌గా మారాడు. 2009 దాకా టీవీ కామెంటేటర్‌గా పని చేసిన ఆయన వయసు అప్పటికి ఎనభయ్యేళ్లు. ఆయన తర్వాత ఎంతోమంది కామెంటేటర్లు వచ్చినా అంతర్జాతీయంగా అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించింది మాత్రం ఇంగ్లీష్ క్రికెటర్లయిన జెఫ్రీ బాయ్‌కాట్, టోనీ గ్రెగ్‌లే.

ఆరడుగుల ఆరంగుళాల ఎత్తుండే ఇంగ్లీష్ మాజీ ఆల్‌రౌండర్ టోనీ గ్రెయిగ్ కామెంటరీ స్టయిల్‌ని మనదేశ కామెంటేటర్లతో పాటు చాలామంది కామెంటేటర్లు అనుకరిస్తారు. జెఫ్రీ బాయ్‌కాట్ ఇంగ్లండ్ మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. మేటి కామెంటేటర్‌గా ఎదిగిన జెఫ్రీకి గొంతు క్యాన్సర్ ఉందని తెలిసినపుడు ఎందరో క్రికెట్ ప్రేమికులు విచారించారు. అయితే జెఫ్రీకి క్యాన్సర్ నయమై మళ్లీ కామెంటరీ బాక్స్‌లో ఎంటరై మైక్రోఫోన్ చేపట్టాడు. పిచ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు తాళంచెవితో పిచ్‌పై గుచ్చుతూ పిచ్ స్వభావాన్ని వివరించే విధానానికి ఆద్యుడు ఆయనే. తర్వాత చాలామంది కామెంటేటర్లు అదే పని చేశారు (అయితే ఆ తర్వాత ఐసిసి అలా తాళంచెవి గుచ్చడాన్ని నిషేధించింది). వీళ్లిద్దరు చేసిన కామెంట్లు కొన్ని సార్లు వివాదాస్పదం కూడా అయ్యాయి. అయినా వారికున్న క్రేజ్ ముందు ఆ వివాదాలేవీ నిలవలేదు.

మన దేశానికి చెందిన చాలామంది మాజీలు కామెంటరీ బాక్స్‌లో అడుగుపెట్టినా రవిశాస్త్రి వారిలో మేటి కామెంటేటర్‌గా ఎదిగాడు. హర్ష భోగ్లే గురించి వేరే చెప్పనవసరం లేదు. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదివి, ఐఐఎమ్ అహ్మదాబాద్ నుంచి మేనేజ్‌మెంట్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ హైదరాబాదీ ఆ తర్వాత క్రికెట్ కామెంటేటర్ అవతారమెత్తాడు.
క్రికెట్ స్టేడియంలో ఓ మూల ఉన్న అద్దాల గదిలో నుండి మైక్రోఫోన్లో గుక్క తిప్పుకోకుండా మాట్లాడే కామెంటేటర్లు మధ్యమధ్యలో ఆటగాళ్లపై కామెంట్లు, చలోక్తులు విసురుతుంటారు.

వారి తప్పుల్ని ఎత్తి చూపుతుంటారు. క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ వీర బాదుణ్ణి, నిప్పులు చెరిగేలా బంతులు విసురుతున్న బౌలర్‌ని, బుల్లెట్‌లా దూసుకుపోతున్న బంతిని మిల్లీ సెకన్లలో అందుకుని.. విజయ గర్వంతో పరుగుతీసే ఫీల్డర్ గురించి ఎంత బాగా వర్ణిస్తారు వాళ్లు! అక్కడితో ఆగిపోరు వాళ్లు, కాలమిస్టులుగా పత్రికల్లో రాస్తూ క్రికెట్‌ని అటు ప్రేక్షకులకి, ఇటు పాఠకులకి మరింత దగ్గర చేస్తారు. రేడియో కామెంటరీ విషయానికి వస్తే... సురేష్ సరయ్యా 40 ఏళ్ల పాటు ఆకాశవాణిలో కామెంటేటర్‌గా పనిచేశారు. దాదాపు 150 వన్డేలకు, నాలుగు ప్రపంచకప్ ఫైనల్స్‌కు కామెంటరీ చెప్పారు. ఆకాశవాణిలోనే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు చెందిన పలు రేడియో స్టేషన్లకు కూడా కామెంటేటర్‌గా పనిచేశారు.

ఫార్మాట్‌కి తగ్గట్టుగానే కామెంటరీ

ఒకో కామెంటేటర్ ఒకో రకంగా మాట్లాడతాడు... విషయ పరిజ్ఞానం, విశ్లేషించే గుణం...వీటికి తోడు వాక్చాతుర్యం కలిస్తేనే కామెంటేటర్. అంతే కాదు టెస్ట్ క్రికెట్, వన్డే, టి-20 మూడింటిలో ఒక్కో ఫార్మాట్‌కీ ఒకో రకంగా కామెంటరీ చెబుతారు. ఐదురోజుల పాటు సాగే టెస్ట్ మ్యాచ్‌కి తగ్గట్టుగానే కామెంటరీ కూడా నిదానంగా ఉంటుంది. కామెంటేటర్ల మాటల్లో విశ్లేషణ ఎక్కువగా ఉంటుంది. ఆటగాళ్ల గురించి, జట్ల గురించి ఇద్దరు కామెంటేటర్లు ఒకరితో ఒకరు ముచ్చటించుకున్నట్టుగా ఉంటుంది. అంతేకాని ప్రేక్షకులతో చెప్పినట్లు ఉండదు.

అదే వన్డే మ్యాచ్‌లో ఐతే జట్ల బలాబలాల గురించిన చర్చ కాస్త వాడిగా ఉంటుంది. కామెంటేటర్లు ఒకరితో ఒకరికన్నా ప్రేక్షకులకు చెప్పడం ఎక్కువవుతుంది. ఇక టి-20లో అయితే స్కోర్‌బోర్డ్ ఎంత వేగంగా పరుగెడుతుందో అంతే వేగంగా కామెంటరీ కూడా దూసుకెళ్తుంది. మరోవైపు స్పోర్ట్స్ చానళ్లు కూడా పెరిగాయి. అంతర్జాతీయ టోర్నీలతో పాటు ఇప్పుడు ఐపిఎల్ రాకతో క్రికెట్‌కి మరింత క్రేజ్ పెరిగింది. దానితోపాటు స్టార్ క్రికెట్, నియో క్రికెట్, టెన్ క్రికెట్... ఇలా క్రికెట్‌కే ప్రత్యేకంగా చానళ్లు పుట్టుకొచ్చాయి. వాటిలో ఇరవై నాలుగ్గంటలూ క్రికెట్టే. క్రికెట్ ప్రోగ్రాములు, క్రికెట్ క్విజ్‌లు, చర్చలు, విశ్లేషణలు పెరిగిపోయాయి. అందుకే కామెంటేటర్లు ఆ చానళ్లలో ప్రజెంటర్లుగా కొత్త అవతారమెత్తుతున్నారు.

నెంబర్‌వన్ కామెంటేటర్ ఎవరు?

నెంబర్‌వన్ బ్యాట్స్‌మన్ ఎవరు నెంబర్‌వన్ బౌలర్ ఎవరు అని అడిగితే చటుక్కున సమాధానం చెప్పేస్తాం. బెస్ట్ అంపైర్ ఎవరు అని అడిగితే సైమన్ టౌఫెల్ అనో మరొకరనో చెప్పేస్తాం. అయితే ఎవరు బెస్ట్ కామెంటేటర్ అని అడిగితే ఎవరి పేరు చెప్పాలి? అందుకే క్రిక్ఇన్‌ఫోడాట్‌కామ్ ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించింది. దాని ఆధారంగా టాప్‌టెన్ కామెంటేటర్లను ప్రకటించింది. దాన్లో మొదటి స్థానంలో నిలిచాడు హర్ష భోగ్లే. ఆ తర్వాతి స్థానాన్ని రవిశాస్త్రి, ఆక్రమించాడు. మిగతా స్థానాల్లో రిచీ బెనాడ్, టోనీ గ్రెగ్, జెఫ్రీ బాయ్‌కాట్, ఇయాన్ చాపెల్, మైకెల్ హోల్డింగ్, డేవిడ్ లాయిడ్, సునీల్ గవాస్కర్, రమీజ్ రాజా నిలిచారు.

అయితే 'మోస్ట్ ఎంటర్‌టైనింగ్' క్యాటగిరీలో టోనీ గ్రెయిగ్... జెఫ్రీ బాయ్‌కాట్ కంటే మూడు ఓట్లు ఎక్కువ తెచ్చుకుని నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించాడు. డేవిడ్ లాయిడ్ నంబర్ త్రీతో సరిపెట్టుకుంటే మన భోగ్లే నాలుగో స్థానంలో నిలిచాడు. అంపైర్ల లాగే కామెంటేటర్లు కూడా ఆడే రెండు జట్లలో ఏ ఒక్క దానివైపు పక్షపాతం చూపకూడదు. అలాంటి కామెంటేటర్లనే అందరూ గౌరవిస్తారు. ఈ సర్వేలో 'మోస్ట్ అన్‌బయాస్డ్' కామెంటేటర్‌గా రిచీ బెనాడ్ ఎన్నికయ్యాడు. హర్ష భోగ్లే రెండో స్థానంలో, రవిశాస్త్రి మూడో స్థానంలో నిలిచారు.

కామెంటరీ రైటర్లు

రేడియోలు, టీవీ చానళ్లే కాదు, మేం కూడా లైవ్ కామెంటరీ అందిస్తున్నాం అంటున్నాయి క్రికెట్ వెబ్‌సైట్లు. అయితే వాళ్ల కామెంటరీని చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్ కామెంటేటర్లు చెప్పరు.. రాస్తారు. ఆఫీసుల్లో పని చేస్తూ టీవీ కాని రేడియో కాని అందుబాటులో లేని క్రికెట్ అభిమానులు ఈ కామెంటరీ చదువుకుని సంతోషిస్తారు. బంతిని బౌలర్ ఎంత వేగంతో విసిరాడు... దాన్ని బ్యాట్స్‌మన్ ఎలా షాట్ కొట్టాడు. ఎటువైపుగా బౌండరీకి తరలించాడు లాంటి విషయాల్ని క్షణాల్లో రాసేస్తారు వాళ్లు.

- నాగేశ్వరరావు తమనం

అమెరికన్ గాడ్స్‌కి 'అక్కలా'భరణాలు

'మీరెక్కడుంటారు' అమెరికా నుంచి వచ్చిన ఓ యువకుణ్ణి అడిగాడో పెద్దమనిషి.
'అమెరికాలో లెండి' అని 'అది మీకు తెలిసిన చోటు కాదన్నట్టు'గా బదులిచ్చాడా యువకుడు.
'అమెరికాలో ఎక్కడ?' అడిగాడా పెద్దమనిషి.
'చికాగోలో' చెప్పాడు యువకుడు.
'చికాగోలో ఉన్న అరోరా టెంపుల్‌కి వెళ్లారా' అడిగాడు పెద్దాయన.
'వెళ్లాను..! మీరు కూడా అమెరికాలోనే ఉంటారా ?' అన్నాడా యువకుడు ఆశ్చర్యంగా.
'అదేం లేదు.. ఆ గుడిలో దేవుడికి బంగారు ఆభరణాలు తయారు చేసింది నేనే!' చెప్పాడా పెద్దమనిషి.
అప్పుడు కాని అర్థం కాలేదు 'అమెరికన్ యూత్'కి పెద్దాయన ఎందుకు అడుగుతున్నాడో. ఆయనే తెనాలికి చెందిన శిల్పి అక్కల రామకృష్ణ. ఆయనొక్కడే కాదు. వాళ్లు నలుగురు సోదరులు. అందరూ శిల్పులే. అమెరికాలో ఇంకా ఏయే దేవాలయాలకి ఆభరణాలు చేశారు? అని అడిగితే... ఆ జాబితా విప్పడం కాస్త కష్టం కాని మీరే ఏదైనా ప్రాంతం పేరు చెప్పండి అక్కడున్న ఏ గుడిలో ఏ దేవుడికి ఏ ఆభరణాలు చేశామో చెబుతాం అంటారు వాళ్లు. దాని అర్థం - అమెరికాలో మన దేవుళ్లందరూ అక్కల వారి ఆభరణాలే ధరిస్తున్నారని.
--------------
మనకైతే బంగారు నగలు కొనుక్కోవడానికి పెద్దపెద్ద నగల దుకాణాలుంటాయి. బంగారు కాంతులు, విద్యుద్దీపాల వెలుగులు కలిసి ధగధగ మెరిసిపోయే అద్దాల షోరూంలు అన్నిచోట్లా వెలిశాయి. ఆ షోరూంలకి వెళ్తే చాలు, వందల డిజైన్లు, వేల రకాల నగలు... మరి దేవుళ్లకు నగలు చేయించాలంటేనో... వాటినెవరు తయారు చేస్తారు? అవి కూడా రెడీమేడ్‌గా దొరుకుతాయా అంటే అస్సలు దొరకవు. ఎందుకంటే వాటిని తయారు చేసేది మామూలు బంగారు కొట్ల వాళ్లు కాదు. శిల్పశాస్త్రం తెలిసిన బంగరు శిల్పులు. అలాంటి వాళ్లే 'అక్కల' అన్నదమ్ములు. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కొన్ని వేల దేవాలయాల్లో ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు 'అక్కల' అన్నదమ్ములు చెక్కినవే.

ఆ దేవతామూర్తులను అలంకరించిన ఆభరణాలు కూడా వాళ్లు చేసినవే. విజయవాడ కనకదుర్గకి, నిడదవోలు కోట సత్యమ్మకి బంగారు కిరీటాలు, సింహాచలం నరసింహస్వామికి, వరాహస్వామికి బంగారు కవచాలు, అన్నవరం ఆలయంలో వెండి, పంచలోహ విగ్రహాలు, వాటికి వెండి ఆభరణాలు. నెల్లూరు ఇరుకళల పరమేశ్వరీదేవికి బంగారు కిరీటం, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామికి బంగారు కిరీటం...ఇలా చాలా దేవుళ్ల మెరిసిపోయే కాంతుల వెనక ఉంది వీరి చేతులే. తెలుగునాటే కాదు, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా చాలా ఆలయాలకిఆభరణాలు చేశారు 'అక్కల' సోదరులు. హరిద్వార్‌లో వెంకటేశ్వరస్వామి ధరించిన ఆభరణాలూ వీళ్లే చేశారు.

ఆ నలుగురు...


అక్కల కుటుంబం అరవయ్యేళ్లుగా తెనాలిలో విగ్రహాల తయారీ వృత్తిలో ఉంది. ఆ కుటుంబంలో మూడు తరాల నుండి ఇదే పని చేస్తున్నారు. మొదటి తరం శిల్పి అక్కల రామయ్య తెనాలిలో శిల్పశాలను స్థాపిస్తే ఆయన నలుగురు కొడుకులూ తండ్రి బాటలోనే నడిచారు. వాళ్లే అక్కల మంగయ్య, రామకృష్ణ, రామ మోహన్, శ్రీరాం. వంశపారంపర్యంగా నేర్చుకున్నా తమిళనాడు ప్రభుత్వం శిల్పకళలో నిర్వహించే పరీక్షలో కూడా ఉత్తీర్ణులయ్యారు. మంగయ్య కుమారులు రామలింగేశ్వర కుమార్, రమేష్ కూడా ఇదే వృత్తిని చేపట్టారు. ఈ అరవయ్యేళ్లలో శిల్పకళలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కొత్తకొత్త పద్ధతులు నేర్చుకుంటూ, నల్లరాతి నుంచి ఫైబర్ విగ్రహాల వరకూ రకరకాలు తయారు చేస్తున్నారు అక్కల బ్రదర్స్. మూడు తరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కడెక్కడి నుంచో విగ్రహాలు, ఆభరణాలు చేయమని ఆర్డర్లు వస్తుంటాయని చెప్పారు రామకృష్ణ.

అమెరికా దాకా...

అక్కల సోదరుల కీర్తి వ్యాపించాక 1990లో మొదటిసారి అమెరికా ఆఫర్ వచ్చింది. "అమెరికాలోని లివర్‌మోర్‌లో ఉన్న 'శివా విష్ణు టెంపుల్' వాళ్లు నవరత్నఖచిత వజ్ర కిరీటం తయారు చేయమన్నారు. ఆ గుడిని కట్టించింది తెలుగువాళ్లే. అలా ఆ గుడిలోని వెంకటేశ్వర స్వామికి కిరీటం తయారు చేయడంతో అమెరికా ఆఫర్లు మొదలయ్యాయి. తర్వాత 1992లో టెక్సాస్‌లోని వెంకటేశ్వర స్వామికి కిరీటాన్ని తయారు చేశాం. అప్పట్లో అమెరికాలో ఉన్న గుళ్లన్నీ చిన్నచిన్న మందిరాల్లా ఉండేవి. నగరాల శివారుల్లో ఉండే ఆ మందిరాల్లో దేవుళ్ల ఫోటోలే ఉండేవి. ఏవో కొన్నిట్లో మాత్రమే చిన్నచిన్న విగ్రహాలుండేవి.

1994లో మిసిసిపీ రాష్ట్రం జాక్సన్‌లో మనవాళ్లు దేవాలయం నిర్మిస్తూ ఆ దేవాలయానికి విగ్రహాలు, ఆభరణాలు తయారు చేయటానికి మమ్మల్ని అమెరికాకి ఆహ్వానించారు. అచ్చం తిరుమలలో ఉన్నట్టే కావాలన్నారు. అలా నేను, మా బాబాయి రామకృష్ణ రెండేళ్లపాటు అమెరికాలో ఉండి ఆ గుడికి కావాల్సిన వెండి, బంగారు, పంచలోహ విగ్రహాలు, ఆభరణాలు తయారు చేశాం'' అంటూ వివరించాడు మంగయ్య కుమారుడు రామలింగేశ్వర కుమార్. ఆ సమయంలోనే అమెరికాలో ఉన్న చాలా ఆలయాలకి కూడా ఆభరణాలు చేయమని అక్కల సోదరులని అడిగారు అక్కడి మనవాళ్లు.


అలా ఒక్క గుడితో మొదలై మిసిసిపీలోని వెంకటేశ్వర స్వామికి, అట్లాంటాలోని మరో ఆలయానికి, హూస్టన్ శ్రీమీనాక్షి టెంపుల్ లోని వాసవీ కన్యకా పరమేశ్వరికి బంగారు కవచాలు, సర్వాభరణాలు తయారు చేశారు. "అమెరికాలో మేం చేసిన విగ్రహాలు, ఆభరణాలతో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించాం. ఆ ఎగ్జిబిషన్‌కి మన భారతీయులతో పాటు అమెరికన్ శిల్పులు కూడా వచ్చారు. వారికి మన శిల్పకళ గురించి వివరించాం. వారి వద్ద నుంచి కూడా చాలా నేర్చుకున్నాం. అక్కడి శిల్పులు ఉపయోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ గురించి, దాన్ని మన శిల్పకళలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో కూడా తెలుసుకున్నాం. అమెరికన్లు, అక్కడున్న మనవాళ్లూ క్వాలిటీ విషయంలో రాజీ పడరు. అక్కడ చెప్పిన టైంకి పని పూర్తవ్వాలి.

క్వాలిటీ బాగుండాలి. అవి రెండూ పాటించాం కాబట్టే మేం అమెరికాలో ఉన్న మన దేవాలయాలకి అన్ని ఆభరణాలు చేయగలిగాం. అప్పట్లో హిందూ దేవాలయాలు, మందిరాలు, జైనుల మందిరాలు మొత్తం కలిపి అమెరికాలో 100 నుంచి 120లోపు ఉండేవి. రానురాను దేవాలయాలు పెరిగాయి. మాకు ఆర్డర్లు కూడా పెరిగాయి. అక్కడున్న ఆలయం మొత్తాన్ని ఒకే సారి నిర్మించరు. దాతల విరాళాలను బట్టి కొత్త ఆభరణాలు ఒకటొకటిగా చేయిస్తూ ఉంటారు'' అన్నాడు రామలింగేశ్వర్ కుమార్. దేవుడికి ఆభరణాలు చేయాలంటే ముందుగా అమెరికా వెళ్లి ఆ విగ్రహాల కొలతలు తీసుకొని వస్తారు వాళ్లు. కావాల్సిన బంగారాన్ని, మిగతా వస్తువులను దేవాలయాల నిర్వాహకులే శిల్పులకి ఇస్తారు. తయారు చేసిన ఆభరణాల్ని నిర్వాహకులే తెనాలి వచ్చి తీసుకెళ్తారు. ఒక్కోసారి అక్కల సోదరులే అమెరికా వెళ్లి వాటిని విగ్రహాలకు అమర్చి వస్తారు. 2009లో క్యారీలోని వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు చేసి తీసుకెళ్లి అమర్చి వచ్చారు అక్కల రామకృష్ణ.

అమెరికా నుంచి అక్కల శిల్పుల ప్రతిభ ఆఫ్రికాలో ఉన్న మనవాళ్లకి కూడా తెలిసింది. నైజీరియాలోని హిందూ ఆలయానికి ఆభరణాలు చేసింది అక్కల సోదరులే. కెన్యా రాజధాని నైరోబీలోని వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటం, హస్తాలు కూడా వాళ్లే చేశారు. ఐర్లాండ్‌లోని వినాయకుడి గుడికి విగ్రహాన్ని, ఆభరణాల్ని, మారిషస్‌లోని లక్ష్మీనారాయణ స్వామికి, రామాలయాలకి బంగారు ఆభరణాల్ని చేశారు.

విదేశాలకోసం ఫైబర్ విగ్రహాలు

విదేశీ ఆలయాల కోసం ఈ మధ్య దేవతల విగ్రహాలను, వాహనాలను ఫైబర్‌తో తయారు చేస్తున్నారు. దేవతల విగ్రహాలు ఫైబర్‌తో మొదటిసారి చేసింది మేమే అంటారు ఈ శిల్పులు. "ఫైబర్ విగ్రహాలయితే విదేశాలకి తీసుకెళ్లడానికి తేలికగా ఉంటాయి. ఆ విగ్రహాల్ని సులువుగా శుభ్రం చేయొచ్చు. అందుకే 'ఈజీ టు క్యారీ, ఈజీ టు క్లీన్'గా ఉండాలని దేవతా విగ్రహాలన్నీ ఫైబర్‌తో చేస్తున్నాము. వాటితో మనం అనుకున్న శరీర ఆకృతిని, రూపురేఖల్ని కూడా తీసుకురావచ్చు. ఫైబర్‌తో వచ్చినంత అందంగా మెటల్‌తో కూడా రావు. విదేశాల్లోని మనవాళ్లు ఫైబర్‌తో చేసిన వాటినే ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గజవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనాలు ఈ మధ్యే అమెరికాకి పంపించాం'' అని ఫైబర్ దేవుళ్ల గురించి చెప్పారు రామకృష్ణ. ఎన్ని విగ్రహాలు చేసినా, ఆభరణాలు చేసినా అక్కల సోదరులు చెప్పేది మాత్రం ఒక్కటే... మేం చేసిన పని చూసి ముందు మేం సంతృప్తి చెందాలి.

ఆ తర్వాత కస్టమర్ సంతృప్తి చెందాలి. అది చేయగలుగుతున్నాం కాబట్టే మేం ఇన్నేళ్లుగా రాణిస్తున్నాం అంటారు.వీరి ప్రావీణ్యం దేవతల విగ్రహాలు, ఆభరణాలకే పరిమితం కాలేదు. నేతల విగ్రహాలు చేయడంలో కూడా అక్కల బ్రదర్స్ ముందున్నారు. నేతల విగ్రహాలు తయారు చేయమని రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది వస్తుంటారు. "ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న నీలం సంజీవరెడ్డి విగ్రహం, రామంతపూర్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం, సంజీవరెడ్డినగర్ సిగ్నల్ వద్ద ఉన్న ఉమేష్ చంద్ర విగ్రహం, విశాఖ సముద్ర తీరాన ఉన్న శ్రీశ్రీ విగ్రహం మేం చేసినవే. మద్రాస్‌లో పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసిన ప్రదేశంలో ప్రతిష్టించిన ఆయన విగ్రహం కూడా మేమే చేశాం. తెనాలి మునిసిపాలిటీ శతాబ్ది వేడుకల సందర్భంగా ప్రతిష్టించిన 'తెనాలి రామకృష్ణ' విగ్రహమూ మేం చేసినదే'' అన్నారు రామకృష్ణ.

- నాగేశ్వరరావు తమనం

Thursday, February 3, 2011

విత్తనాల గ్రామాలు

ఏపుగా పెరిగి.. విరక్కాసిన పైరును చూసుకుని కళ్లతోటే కడుపులు నింపుకుంటారు రైతులు.
'ఏ ఊరి విత్తనం వేశావ్' అని ఆశ్చర్యంగా అడిగేస్తారు ఆ కాపు చూసిన తోటి రైతులు.
అంతటితో ఆగకుండా, 'విత్తనాలకి వదిలిపెడుతున్నావా, మొత్తం కాయల్ని కోసేస్తున్నావా' అని అడుగుతారు వాళ్లలో కొందరు. అది వాళ్లకెందుకు?
ఎందుకంటే... వచ్చే ఏడాది ఆ పంటనుంచి తీసిన విత్తనాల్నే తమ చేలల్లో కూడా విత్తుకుందామని.
పంటలు అన్ని గ్రామాల్లోనూ పండిస్తున్నా ఆ పంట విత్తనాన్ని పండించేది మాత్రం కొన్ని గ్రామాల్లోనే. అదే ఆ గ్రామాల ప్రత్యేకత. కాబట్టే ఆ గ్రామాల వాళ్లే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల రైతులందరూ కూడా ఆ ఊళ్ల విత్తనాల్నే విత్తుతారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల విత్తనాల్ని కాదని ఈ రైతుల్నే ఆశ్రయిస్తారు. అలాంటి 'విత్తనాల గ్రామాలు' మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా కూరగాయలు పండే ప్రాంతాల్లోఏదో ఒక విత్తనాల గ్రామం తప్పక ఉంటుంది. సాగులో విత్తనాల సాగు వేరయా అంటున్న విత్తనాల గ్రామాల విశేషాలే ఈ వారం కవర్ స్టోరీ!
-----------------------

గుంటూరు జిల్లాలోని మామిళ్లపల్లి, ఎర్రబాలెం గ్రామాలది ఓ ప్రత్యేక అనుబంధం. అలాగని ఆ రెండు ఊళ్లు పక్కపక్కనే ఉండవు. మామిళ్లపల్లి పొన్నూరు మండలంలో ఉంటే ఎర్రబాలెం మంగళగిరి మండలంలో ఉంటుంది. వాటి మధ్య దూరం యాభై కిలోమీటర్ల పైనే ఉంటుంది. రెండు ఊళ్ల మధ్య చుట్టరికం కూడా లేదు. అయినా ఆ రెండు గ్రామాల బంధం ఇచ్చిపుచ్చుకునేదే. అదే విత్తనాలు ఇచ్చిపుచ్చుకునే బంధం. ఊరికే ఏమీ కాదులెండి డబ్బుకే. ఎర్రబాలెం బీర విత్తనాలు మా ఊళ్లో విరగ్గాస్తాయని మామిళ్లపల్లి రైతులు అంటే మామిళ్లపల్లి విత్తనానికి తిరుగు లేదని ఎర్రబాలెం వాళ్లంటారు.

ఆ రెండు ఊళ్లలోని నేల తీరే అంత... అందుకే ఆ పొలాల్లో తీసిన విత్తనానికి అంత గిరాకీ అని చుట్టుపక్కల గ్రామాల వాళ్లంటారు. గుంటూరు జిల్లాలో బీరకాయ చాలా ఊళ్లలో పండిస్తున్నా విత్తనాలు సాగు చేసేది మాత్రం ఈ రెండు గ్రామాల్లోనే. అందుకే ఏ ఊరి బీర రైతుని అడిగినా ఆ రెండు గ్రామాల విత్తనాల గురించి, ఆ కాయల సైజు గురించి, నాణ్యత గురించి తెగ పొగిడేస్తాడు. కేవలం గుంటూరు జిల్లాలోనే కాదు అటు కృష్ణా జిల్లా, ఇటు ప్రకాశం జిల్లా రైతులు కూడా తొలకరి వచ్చిందంటే సంచులు తీసుకొని ఆ ఊళ్లొచ్చేస్తారు. ఆ రెండు గ్రామాల రైతులు బీరకాయలమ్మి ఎంత సంపాదిస్తారో విత్తనాలు అమ్మి కూడా అంత సంపాదిస్తారు.

ఈ రెండు గ్రామాల్లాంటిదే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడ. అది కూడా బీర విత్తనాల గ్రామమే. ఆ ఊరి బీరని 'ఏడు ఆకుల బీర' అని పిలుస్తారు. గత యాభయ్యేళ్లుగా అక్కడ బీర విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విత్తనాలు కొనడానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి కూడా రైతులు వస్తుంటారు. అంతేకాదు విదేశాల్లో ఉండే తెలుగువాళ్లు కూడా చిత్రాడ బీరకాయలంటే మోజుతో ఇక్కణ్ణుంచి విత్తనాలు పంపమని అడుగుతుంటారట. అందుకే గత మూడేళ్లుగా చిత్రాడ బీర విత్తనాలు విదేశాలకి కూడా తరలి వెళ్తున్నాయి.
ఈ మూడు గ్రామాల విత్తనాలకి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, రైతులెవ్వరూ కాయల్నుంచి విత్తనాలు తీసి నిల్వ ఉంచరు. కాయల్నే నిల్వ ఉంచుతారు. విత్తనాలు కావాల్సిన వాళ్లు వచ్చినపుడు వారిముందే కాయలనుంచి విత్తనాలు కార్చి ఇచ్చేస్తారు. విత్తనాలు ముందే కార్చేస్తే ఆ కాయల సైజు, వాటి నాణ్యత గురించి కొనే వాళ్లకి తెలీదు. అందుకే కాయల్ని చూసి విత్తనాలు కొనాలంటారు రైతులు. ఈ అవకాశం విత్తన దుకాణాల్లో ఉండదు.

విత్తనాలకి మెట్టపైరే!

బీర అన్ని కాలాల్లోనూ అన్ని నేలల్లోనూ పండే పంట. మాగాణిలో అయినా పండుతుంది. మెట్టలో అయినా పండుతుంది. తొలకరి పంటను మే, జూన్ నెలల్లోనూ రెండవ పంటను ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనూ వేస్తే మూడవ పంటను జనవరి, ఫిబ్రవరిలలో వేస్తారు. సాగు నీరు లభ్యమయ్యే ప్రాంతాల్లో వరి కోతలయ్యాక మాగాణి నేలల్లో బీర వేస్తారు. మూడు పంటలు పండినా రెండవ, మూడవ పంటల్నుండి మాత్రమే... అది కూడా మెట్ట పొలంలో పండే పంట నుంచి మాత్రమే విత్తనాలు తీస్తారు. ఆ పంటల్ని పైర బీరలు అని అంటారు.
విత్తిన 35 రోజులకే బీరతోట కోతకు వస్తుంది. అప్పుడు మంచి సైజు ఉన్న కాయల్ని కోయకుండా విత్తనాలకు వదిలేస్తారు రైతులు. ఆ కాయలు బాగా ముదిరి, పండిన తర్వాత ఎండడం మొదలవుతుంది. అప్పుడు వాటిని కోసి పదిపదిహేను రోజులు ఎండబెడతారు. ఆ తర్వాత కాయల్ని ఇళ్లలోనూ, గొడ్ల చావిళ్లలోనూ నిల్వ ఉంచుతారు. అలా అది రెండు నెలల పాటు నిద్రావస్థలో వుంటుంది. ఎండిన వెంటనే చేలలో నాటినా మొలుస్తాయి కాని కాపు కాయవు. కనీసం ఐదు నెలలు నిల్వ ఉన్న విత్తనాలను నాటితేనే ఫలితం బాగుంటుంది. కాయల్ని నిల్వ ఉంచే సమయంలో వాటికి పొగ తగలకుండా, మిరపకాయల పొగరు తగలకుండా జాగ్రత్తపడాలి. అదే జరిగితే విత్తనాలు మొలకెత్తవు. ఈ కాయలకి ఎలుకల బెడద కూడా ఎక్కువే.

ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఈ విత్తనాల రేటు కూడా కాస్త ఎక్కువే. గిరాకీని బట్టి మానిక విత్తనాల ధర రెండు వేల నుండి రెండువేల ఐదొందల దాకా ఉంటుంది. ఒకవేళ పచ్చి బీరకాయలకు గనక ధర ఎక్కువగా ఉంటే ఆ తర్వాత సంవత్సరం విత్తనాలకి డిమాండ్ మరీ ఎక్కువగా ఉంటుంది. విత్తనాల కోసం ఉంచే బదులు కాయల్ని కోసి అమ్ముకుంటే ఆ డబ్బులేవో ముందే వచ్చేస్తాయని అనుకుంటారు రైతులు. అయినా కొందరు మాత్రం అంతకన్నా ఎక్కువ డబ్బులొస్తాయని విత్తనాలకు వదిలేస్తారు. ఒక వేళ పచ్చి కూరగాయలకి ఎక్కువ ధర లేకపోతే మాత్రం చాలా మంది విత్తనాలకోసం వదిలేస్తారు. అప్పుడు విత్తనాల ధరలు కాస్త తగ్గుతాయి.

కాకుమాను గోరుచిక్కుడు

మామిళ్లపల్లి బీర రైతులందరికీ కాకుమాను గురించి తెలుసు. ఎందుకంటే మామిళ్లపల్లిలో బీరతోటలన్నీ అల్లుకునేది కాకుమాను చిక్కుడు చెట్లమీదే. ఎలాగంటే... ఏడాదికి మూడు పంటలు పండే మామిళ్లపల్లి భూముల్లో మొదటి పంటగా గోరుచిక్కుళ్లు వేస్తారు. ఆ విత్తనాల్ని కాకుమాను నుంచి తెస్తారు. చిక్కుడు పంట కాలం పూర్తయ్యేనాటికి ఆ చేలోనే బీర విత్తనాలు నాటుతారు. బీర తీగలు అల్లుకోవడానికి వీలుగా చిక్కుడు చెట్లను వంచి పందిరిలా చేస్తారు. తొలకరి వర్షాలు రాగానే మెట్ట ప్రాంతాల్లో కూరగాయల సాగు మొదలవుతుంది. ఆ సమయంలో గోరు చిక్కుడు ఎక్కువగా వేస్తారు. వారికోసమే అన్నట్టు కాకుమానులో గోరుచిక్కుడు విత్తనాల్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. బీరకాయల రైతుల్లా కాకుండా కేవలం విత్తనాల కోసమే వేల ఎకరాల్లో చిక్కుడు తోటలు వేస్తారు ఆ ఊళ్లో.గోరుచిక్కుడు విత్తనాల్ని అంత ఎక్కువగా ఉత్పత్తి చేసే ఊరు మరోటి మన రాష్ట్రంలోనే లేదంటారు వాళ్లు.

గత 30 ఏళ్లుగా కాకుమాను ప్రాంత రైతులు గోరుచిక్కుడును వాణిజ్య పంటగా పండిస్తున్నారు. పండించిన విత్తనాలను కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంత రైతులకు, విత్తన వ్యాపారులకు కూడా అమ్ముతున్నారు. కాకుమానులో ఉండేది తెల్లమసక నేల, అది గోరుచిక్కుడు సాగుకు అనువుగా వుంటుందని రైతులు అంటారు. పైగా విత్తిన నాలుగు నెలల్లో విత్తనాలు చేతికొచ్చేస్తాయి. కాబట్టి ఆ చేలో మరో పంట వేసుకోవచ్చు. అంతే కాకుండా మిగతా మెట్ట పంటలతో పోలిస్తే చిక్కుడు సాగుకు ఖర్చు తక్కువ. అయితే దిగుబడి కూడా తక్కువే. ఎకరాకు 5 వేల రూపాయల పెట్టుబడి పెడితే మూడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటా విత్తనాలు రూ. పది వేలు ధర చొప్పున ఎకరాకు రూ. 30 వేలు ఆదాయం వస్తుంది. అదే కిలోల చొప్పున రిటెయిల్‌గా అమ్ముకుంటే కిలో 150 రూపాయల రేటు వస్తుంది. అందుకే ఎక్కువ మంది రైతులు చిల్లరగానే విత్తనాల్ని అమ్ముతారు. ఈ విత్తనాల్ని చిక్కుళ్లను పండించడానికే కాకుండా నూలు తీయటానికి, జిగురు (గమ్ము) తయారీకి కూడా ఉపయోగిస్తారు.

పెదవడ్లపూడి కరివేపాకు విత్తనం

గుంటూరు జిల్లాలో మరో రెండు విత్తన గ్రామాలు కూడా ఉన్నాయి. అవే పెదవడ్లపూడి, అంగలకుదురు. నేడు రాష్ట్రంలో పెదవడ్లపూడి పేరు చెబితే 'కరివేపాకు' ఠక్కున గుర్తుకొస్తుంది. అంతకుముందు ఇళ్ల పెరళ్లలో మాత్రమే పెంచుకునే కరివేపాకు 'సాగు' రూపంలో దేశమంతా విస్తరించింది పెదవడ్లపూడి నుండే.
ఇదెలా సాధ్యమైందంటే... రకరకాల పూలు, పండ్ల మొక్కల నారు పెంచడం పెదవడ్లపూడిలో ఎప్పటినుంచో వస్తున్న వ్యాపార వ్యవసాయ విధానం. ఆ గ్రామ రైతులు నారింజ, కరివేపాకు, నిమ్మ, అశోక, జామ, సపోటా, మల్లె, జాజి, బంతి లాంటి చాలా రకాల మొక్కలను నారు పోసి అమ్ముతారు. సరిగ్గా 29 ఏళ్ల క్రితం ఆ మొక్కలతో పాటు కరివేపాకు నారు కూడా పోసి అమ్మకానికి ఉంచారు. అయితే ఆ నారు ఎవరూ కొనలేదు. దాంతో అది ఏపుగా పెరిగిపోయింది. అలా ఎదిగిన కరివేపాకును సమీపంలోని మంగళగిరి, తెనాలి, విజయవాడ, గుంటూరు మార్కెట్‌లకు తీసుకెళ్తే అది బాగా అమ్ముడుపోయి రైతులకు మంచి లాభం వచ్చింది. ఇదేదో బాగుందే అనుకున్న కొందరు రైతులు ఆ తరువాతి ఏడాది నుంచి కరివేపాకు సాగు చేయడం మొదలెట్టారు. అధిక లాభాలను ఆర్జించారు. అలా వడ్లపూడిలో కరివేపాకు సాగు వందల ఎకరాలకు విస్తరించింది.

కరివేపాకు తోటలను ఏడాదికి మూడు సార్లు కోస్తారు. ఎవరూ కాయలు కాసేదాకా ఉంచరు. కొందరు మాత్రమే విత్తనాల కోసం ఉంచుతారు. కాబట్టి విత్తనాల ఉత్పత్తి తక్కువ. అయినా పెదవడ్లపూడి నుండి కరివేపాకు ఎగుమతి కావడం మూలంగా అది విత్తనాలకు కూడా కేంద్రమైంది. పెదవడ్లపూడి చుట్టుపక్కల ప్రాంతాలలో పెంచే కరివేపాకు చెట్ల నుంచి తీసిన విత్తనాన్ని రైతులు పెదవడ్లపూడికి తీసుకువస్తారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, ఖమ్మం జిల్లా భద్రాచలం, కృష్ణాజిల్లా విస్సన్నపేట నుంచి కూడా రైతులు కరివేపాకు విత్తనాలు పెదవడ్లపూడికి తెస్తారు. ఏటా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఈ విత్తనాలు వస్తాయి. తెలంగాణలో మెదక్, జహీరాబాద్, రాయలసీమలో తాడిపత్రి ప్రాంతాల నుంచే కాకుండా పుణె నుంచి కూడా రైతులొచ్చి వడ్లపూడి కరివేపాకు విత్తనాలను కొనుక్కెళ్తూ ఉంటారు. ఆ మూడునెలల్లో 270 నుంచి 300 టన్నుల విత్తనాలను వడ్లపూడిలో అమ్ముతారు. ఆ విధంగా చుట్టుపక్కల గ్రామాల రైతులు తమ విత్తనాల్ని అమ్ముకునే కేంద్రంగా పెదవడ్లపూడి ఎదిగింది. ఎకరం పంట వేయడానికి 200 కిలోల నుంచి 300 కిలోల విత్తనం అవసరమవుతుంది. ధర కిలోకి 50 నుంచి 70 రూపాయలుంటుంది.

స్వయంగా విత్తనోత్పత్తి చేసి లాభాలు గడిస్తున్న గ్రామాల గురించి తెలుసుకున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కంపెనీల కోసం విత్తనోత్పత్తి చేయమని రైతుల్ని ఆశ్రయించాయి. మామిళ్లపల్లినే తీసుకుంటే ఆ ఊళ్లో కూరగాయలతో పాటు మొక్కజొన్న కూడా ఎక్కువగా పండుతుంది. అందుకే పయనీర్ సంస్థ హైబ్రిడ్ విత్తనాలు తయారీ కోసం ఆ గ్రామ రైతుల్ని ఆశ్రయించింది. మార్కెట్‌లో లభించే ధరకన్నా ఎక్కువ చెల్లించి హైబ్రిడ్ విత్తనాలు ఉత్పత్తి చేయించింది.

ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ, జాతీయ విత్తన సంస్థలు కూడా ప్రతి జిల్లాలోనూ పంటలు బాగా పండే ప్రాంతాల్లో ఏటా రైతులకు విత్తనాలిచ్చి వారిచేత కొత్త వంగడాలు ఉత్పత్తి చేయిస్తున్నాయి. అయితే ఈ సంస్థలు కేవలం వరి, మినుము లాంటి ప్రధాన ఆహార పంట విత్తనాల ఉత్పత్తికే పరిమితమవుతున్నాయి. కూరగాయల విత్తనాల ఉత్పత్తి ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే, అది కూడా తక్కువ మొత్తంలో తప్ప చేయించడం లేదు. అందుకే దోస, బెండ, బీర లాంటి కూరగాయల విత్తనాలను ఇప్పటికీ రైతులే ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటున్నారు.

అంకాపూర్ జొన్నలు, సజ్జలు

పైన పేర్కొన్న గ్రామాల్లో రైతులు చేస్తున్న విత్తనోత్పత్తిని చూసి పెద్దపెద్ద సంస్థలే ఆ గ్రామా ల రైతుల్ని ఆశ్రయిస్తే అంకాపూర్‌లో దీనికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నియమ నిబంధనలతో విసిగిపోయిన రైతులు వాళ్లే స్వయంగా విత్తనాల్ని ఉత్పత్తి చేయడం మొదలెట్టారు.
మార్కెట్లో లభ్యమవుతున్న వెరైటీల్ని తెచ్చి వాటి నుంచి కొత్తకొత్త హైబ్రిడ్ రకాల్ని ఉత్పత్తి చేయడం, వాటికి కొత్త పేర్లు పెట్టి అమ్మడం అంకాపూర్ రైతులకు అలవాటే. జొన్న, సజ్జల్లో వేర్వేరు రకాల ఆడ, మగ విత్తనాల్ని తెచ్చి సంకరంచేసి కొత్త విత్తనాల్ని ఉత్పత్తి చేస్తారు. కొత్త వెరైటీలు తయారు చేయడానికి మీరేమైనా వ్యవసాయ శాస్త్రవేత్తలా అంటే... అవును మేం సర్టిఫికెట్లు లేని సైంటిస్టులం అని కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు వాళ్లు.

ఇదంతా ఎలా జరిగిందంటే... అంకాపూర్‌లో మొదటిసారి 1976లో 'నేషనల్ సీడ్ కార్పోరేషన్' వాళ్లు సజ్జ విత్తనాలు ఇచ్చి విత్తనోత్పత్తికి నాంది పలికారు. 1980లో ప్రైవేటు కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. పయనీర్ సీడ్స్ ఫౌండేషన్ ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చి రైతుల చేత విత్తనోత్పత్తి చేయించడం మొదలుపెట్టింది. కంపెనీలు, రైతుల మధ్య ముందుగానే ఒప్పందం జరిగేది. పండించిన పంటకు ధర ఖరారు చేసుకున్న తర్వాత విత్తేవారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి ధర ఎక్కువగా ఉన్నా ఒప్పందం ధరకే విక్రయించాలి. కాని ధర తగ్గి ఆ వ్యాపారులు ఒప్పందం కంటే తక్కువ ధర ఇచ్చినా విత్తనాన్ని అదే వ్యాపారికి అమ్మాలి.

దాంతో రైతులు ఎవరితోనూ ఒప్పందం చేసుకోకుండా సొంతంగా విత్తుకుని ఎక్కువ ధర ఇచ్చిన వారికి నేరుగా అమ్మడం మొదలుపెట్టారు. అంతే కాదు, సంకర విత్తనాలు చేయడం నేర్చుకుని కొత్తకొత్త రకాల్నీ తయారు చేయడం మొదలుపెట్టారు. అంకాపూర్ విత్తనాలకి పేరు రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా దూర ప్రాంతాల రైతులు కూడా ఇక్కడికొచ్చి విత్తనాలు కొనుక్కెళ్తున్నారు. అలా అంకాపూర్ విత్తనాల గ్రామమైంది. ఇప్పుడు రైతులు పెద్దపెద్ద సీడ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని విత్తనాలను గ్రేడింగ్, ప్యాకింగ్ చేసి మరీ అమ్ముతున్నారు. ఇక్కడి ఎర్రజొన్నలు, సజ్జ విత్తనాలు ఉత్తరభారతదేశానికి కూడా ఎగుమతి అవుతాయి.

విత్తనోత్పత్తి పంటలు పరిచయం అయిన తర్వాత అంకాపూర్ ప్రాంత రైతుల దశ మారిపోయింది. ఈ పంటలతోనే రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించారు. వరి, మొక్కజొన్న, పసుపు పంటల వల్ల వరుసగా నాలుగైదేళ్ల పాటు నష్టపోయినా ఎర్రజొన్నలు, సజ్జల వల్ల మాత్రం ఎవరూ నష్టపోలేదు. ఆ పంటల వల్ల వచ్చిన నష్టాన్ని విత్తన పంటలు పూడ్చాయని అంటారు వాళ్లు.

కాశీపట్నం సేంద్రీయ వంకాయ

సేంద్రీయ ఎరువులతో సాగు చేసే కాశీపట్నం వంకాయకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో గిరాకీ బాగా ఎక్కువ. ఈ వంకాయల్ని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మార్కెట్లలో ప్రత్యేక కూరగాయగా అమ్ముతారు. గత సీజన్‌లో కాశీపట్నం వంకాయ కేజీ ఎనబై రూపాయల ధర పలికింది. అనంతగిరి మండలంలోని కాశీపట్నం, గరుగుబిల్లి, గుమ్మకోట, భీంపోలు, చిలకలగెడ్డ ప్రాంతాల్లో ఈ వంకాయ పండిస్తున్నా అన్నిట్నీ కాశీపట్నం వంకాయ గానే పిలుస్తారు. ఆ ప్రాంతాల్లోని గిరిజనులు సుమారు అయిదు వందల ఎకరాల్లో ఈ వంకాయల్ని పండిస్తారు.

ఏటా అక్టోబరు నెలలో కాపు మొదలయ్యే ఈ వంకాయలను కొనడానికి కాశీపట్నంలోనే ప్రతీ సోమ, బుధ, శనివారం ప్రత్యేక సంత జరుగుతుంది. వంకాయలకి గిరాకీ పెరగడంతో సహజంగానే వాటి విత్తనాలకీ గిరాకీ పెరిగింది. అందుకే వంగ రైతులు విత్తనాలు తీయడంపై ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. పంటలో మంచి సైజున్న కాయల్ని విత్తనాల కోసం చెట్లకే వదిలేస్తున్నారు. ముదిరిన వంకాయల్నుంచి విత్తనాలు తీసి ఎండబెట్టి భద్రపరుస్తున్నారు. తర్వాతి సంవత్సరం ఆ విత్తనాలతో నారు పోసి పెరిగిన వంగ నారుని ఒక్కొక్క మొక్కను రెండు, మూడు రూపాయలకు అమ్ముతున్నారు. విశాఖ జిల్లాతోపాటు విజయనగరం జిల్లాల రైతులు కూడా ఈ మొక్కల్ని కొనుక్కెళ్లి తమ ప్రాంతాల్లో కూడా వంకాయని సాగు చేస్తున్నారు. ఆవిధంగా ఇప్పు డు కాశీపట్నం వంకాయ సాగు విస్తృతమైంది.

విత్తన బ్యాంక్‌లు

ఇప్పటి దాకా పేర్కొన్న ఊళ్లలోని రైతులు విత్తనాలను అమ్మి లాభాలు గడిస్తే మెదక్ జిల్లా పస్తాపూర్ వాసులు మాత్రం విత్తనాల్ని 'బ్యాంక్'లలో దాచుకుంటున్నారు. అందుకే రకరకాల నాటు రకం మెట్టధాన్యాల్ని ఎలా పండించాలో, ఆ విత్తనాల్ని భద్రపరచడం ఎలాగో తెలియాలంటే జహీరాబాద్ సమీపంలోని పస్తాపూర్, దాని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాల్సిందే.

డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చాలా కాలంగా మహిళా రైతులు జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు లాంటి మెట్ట ధాన్యాల్ని సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నారు. అక్కడితో ఆగిపోకుండా వాళ్లు ఏటా పండించిన విత్తనాల్లో కొంత భాగాన్ని వేరు చేసి వాటిని చిన్న చిన్న మట్టి పాత్రల్లో పోసి, వాటికి పురుగు పట్టకుండా, వేపాకులు కలిపి భద్రపరుస్తారు. ఈ విధంగా సుమారు అరవై రకాల విత్తనాలతో సీడ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి గ్రామంలోనూ ఒక విత్తన బ్యాంక్ ఉంటుందక్కడ. ఆ విత్తన బ్యాంకులు అందరి ఆస్తి. వాటిని మహిళా సంఘాలే నిర్వహిస్తాయి. రైతులంతా వారివారికి కావాల్సిన విత్తనాల్ని ఆ బ్యాంక్ నుంచే ఏటా తీసుకెళతారు. పండిన పంటల నుంచి కొంత మొత్తాన్ని మళ్లీ బ్యాంక్‌కి ఇస్తారు. అలా మూడేళ్లు గడిచే నాటికి ఆ గ్రామాల్లో రైతులు రెండున్నర వేల ఎకరాలకు కావాల్సిన విత్తనాలను సేకరించగలిగారని డెక్కన్‌డెవలప్‌మెంట్ సొసైటీ అంటుంది. అందుకే వాళ్లిప్పుడు విత్తనాల కోసం వేల రూపాయలు వెచ్చించనవసరం లేదు. విత్తన సంస్థలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు.

***

రాష్ట్రంలో వ్యవసాయానికి కావాల్సిన విత్తనాలన్నీ పండించేది రైతులే. అయితే వాటిని కొని మళ్లీ రైతులకు అమ్మే విత్తన సంస్థలు మాత్రం రైతులకు చెల్లించే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తానికి అమ్ముకుంటూ కోట్ల లాభా ల్ని ఆర్జిస్తున్నాయి. విత్తనాలు నేరుగా అమ్ముకునే గ్రామాల్లో మాత్రం ఆ లాభమంతా పండించే రైతుకే దక్కడం విశేషం. ఇలాంటి గ్రామాలు మన రాష్ట్రం లో ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని గ్రామాలు కొన్ని విత్తనాలకు పేరు పడి ఒకనాటి స్వయంపోషక గ్రామీణ వ్యవస్థకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మొదట్లో వ్యవసాయం రైతుల చేతుల్లోనే ఉన్నా రానురాను విత్తనాల కంపెనీలు, ఎరువులు, పురుగు మందుల కంపెనీల రాకతో అది కాస్తా వ్యాపార సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. కొన్ని ఊళ్ళలో మాత్రమే ఇంకా రైతుల చేతుల్లో ఉందనడానికి ఈ గ్రామాలే ఉదాహరణ. ఇప్పుడు సేంద్రీయ సాగుపై ఆసక్తి పెరగడం వల్ల వ్యవసాయం మళ్లీ పూర్తిగా రైతుల చేతుల్లోకెళ్లే రోజు వస్తుందని, సాగుకి తగిన ఫలం రైతులకు అందుతుందని ఆశిద్దాం.

- ఆన్‌లైన్ న్యూస్‌నెట్‌వర్క్ సహకారంతో