హర్భజన్‌సింగ్‌కి 'టర్బొనేటర్' అనే పేరెవరు పెట్టారు?
లక్ష్మణ్ పేరుని ఎవరు 'వెరీ వెరీ స్పెషల్ ' చేశారు?
ద్రావిడ్‌ని 'ది వాల్' అంటూ అభివర్ణించిందెవరు?
'ఏమో... ఎవరు పెడితే ఏంటి? టీవీలో కామెంటరీ చెప్పేవాళ్లు మాత్రం వారినలాగే పిలుస్తారు' అంటారా? నిజమే.. పిలవడమే కాదు. ఆటగాళ్లకి ఆ పేర్లు పెట్టింది కూడా ఆ 'మాటగాళ్లే'.. ఒకప్పటి ఆటగాళ్లు.. మైక్రోఫోన్ పట్టి కామెంటేటర్లుగా కొత్త అవతారమెత్తుతున్న సీనియర్ క్రికెటర్లు.
-------------------
'వావ్... వాట్ ఎ షాట్ !'
'ఇన్ ది ఎయిర్... అండ్ ఈజ్ టేకెన్'
'ఫౌండ్ ద గ్యాప్...క్లియర్స్ ద రోప్'
'గాన్ ఓవర్ ద టాప్... అండ్ ఇట్స్ ఎ సిక్స్'
ఈ డైలాగులేవీ లేని క్రికెట్ మ్యాచ్ చూడడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సచిన్ క్రీజ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తున్నా, సెహ్వాగ్ ధాటికి ప్రతి బంతి బౌండరీలైన్ దాటుతున్నా... కనిపించే దృశ్యానికి తోడు వినసొంపైన కామెంటరీ లేకుండా క్రికెట్ చూడగలమా..? మూకీ సినిమా చూసినట్టు ఉండదూ ! అందుకే కామెంటరీ అంత ప్రాధాన్యత సంతరించుకొంది. అదే హర్షభోగ్లేని హీరోని చేసింది. రిటైరైన ఆటగాళ్లను మళ్లీ క్రికెట్‌కి దగ్గర చేస్తోంది. అలాంటి వారిలో కొందరు ప్రపంచ క్రికెట్‌లోనే మేటి కామెంటేటర్లుగా ఎదిగారు. టోనీ గ్రెయిగ్, జెఫ్రీ బాయ్‌కాట్ లాంటి మాజీ ఇంగ్లీష్ క్రికెటర్లు నేటి తరానికి మేటి కామెంటేటర్లుగా మాత్రమే తెలుసు. కాస్త వెనక్కెళ్తే... ఆస్ట్రేలియన్ మాజీ టెస్ట్ క్రికెటర్ రిచీ బెనాడ్‌ని 'మాస్టర్ ఆఫ్ మైక్రోఫోన్' అని పిలుస్తారు. ఆయనే మేటి కామెంటేటర్ ఇప్పటికీ.
ఆరడుగుల ఆరంగుళాల ఎత్తుండే ఇంగ్లీష్ మాజీ ఆల్‌రౌండర్ టోనీ గ్రెయిగ్ కామెంటరీ స్టయిల్‌ని మనదేశ కామెంటేటర్లతో పాటు చాలామంది కామెంటేటర్లు అనుకరిస్తారు. జెఫ్రీ బాయ్‌కాట్ ఇంగ్లండ్ మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. మేటి కామెంటేటర్‌గా ఎదిగిన జెఫ్రీకి గొంతు క్యాన్సర్ ఉందని తెలిసినపుడు ఎందరో క్రికెట్ ప్రేమికులు విచారించారు. అయితే జెఫ్రీకి క్యాన్సర్ నయమై మళ్లీ కామెంటరీ బాక్స్‌లో ఎంటరై మైక్రోఫోన్ చేపట్టాడు. పిచ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు తాళంచెవితో పిచ్‌పై గుచ్చుతూ పిచ్ స్వభావాన్ని వివరించే విధానానికి ఆద్యుడు ఆయనే. తర్వాత చాలామంది కామెంటేటర్లు అదే పని చేశారు (అయితే ఆ తర్వాత ఐసిసి అలా తాళంచెవి గుచ్చడాన్ని నిషేధించింది). వీళ్లిద్దరు చేసిన కామెంట్లు కొన్ని సార్లు వివాదాస్పదం కూడా అయ్యాయి. అయినా వారికున్న క్రేజ్ ముందు ఆ వివాదాలేవీ నిలవలేదు.
మన దేశానికి చెందిన చాలామంది మాజీలు కామెంటరీ బాక్స్‌లో అడుగుపెట్టినా రవిశాస్త్రి వారిలో మేటి కామెంటేటర్‌గా ఎదిగాడు. హర్ష భోగ్లే గురించి వేరే చెప్పనవసరం లేదు. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదివి, ఐఐఎమ్ అహ్మదాబాద్ నుంచి మేనేజ్‌మెంట్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ హైదరాబాదీ ఆ తర్వాత క్రికెట్ కామెంటేటర్ అవతారమెత్తాడు.
క్రికెట్ స్టేడియంలో ఓ మూల ఉన్న అద్దాల గదిలో నుండి మైక్రోఫోన్లో గుక్క తిప్పుకోకుండా మాట్లాడే కామెంటేటర్లు మధ్యమధ్యలో ఆటగాళ్లపై కామెంట్లు, చలోక్తులు విసురుతుంటారు.
వారి తప్పుల్ని ఎత్తి చూపుతుంటారు. క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ వీర బాదుణ్ణి, నిప్పులు చెరిగేలా బంతులు విసురుతున్న బౌలర్‌ని, బుల్లెట్‌లా దూసుకుపోతున్న బంతిని మిల్లీ సెకన్లలో అందుకుని.. విజయ గర్వంతో పరుగుతీసే ఫీల్డర్ గురించి ఎంత బాగా వర్ణిస్తారు వాళ్లు! అక్కడితో ఆగిపోరు వాళ్లు, కాలమిస్టులుగా పత్రికల్లో రాస్తూ క్రికెట్‌ని అటు ప్రేక్షకులకి, ఇటు పాఠకులకి మరింత దగ్గర చేస్తారు. రేడియో కామెంటరీ విషయానికి వస్తే... సురేష్ సరయ్యా 40 ఏళ్ల పాటు ఆకాశవాణిలో కామెంటేటర్‌గా పనిచేశారు. దాదాపు 150 వన్డేలకు, నాలుగు ప్రపంచకప్ ఫైనల్స్‌కు కామెంటరీ చెప్పారు. ఆకాశవాణిలోనే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు చెందిన పలు రేడియో స్టేషన్లకు కూడా కామెంటేటర్‌గా పనిచేశారు.
ఒకో కామెంటేటర్ ఒకో రకంగా మాట్లాడతాడు... విషయ పరిజ్ఞానం, విశ్లేషించే గుణం...వీటికి తోడు వాక్చాతుర్యం కలిస్తేనే కామెంటేటర్. అంతే కాదు టెస్ట్ క్రికెట్, వన్డే, టి-20 మూడింటిలో ఒక్కో ఫార్మాట్‌కీ ఒకో రకంగా కామెంటరీ చెబుతారు. ఐదురోజుల పాటు సాగే టెస్ట్ మ్యాచ్‌కి తగ్గట్టుగానే కామెంటరీ కూడా నిదానంగా ఉంటుంది. కామెంటేటర్ల మాటల్లో విశ్లేషణ ఎక్కువగా ఉంటుంది. ఆటగాళ్ల గురించి, జట్ల గురించి ఇద్దరు కామెంటేటర్లు ఒకరితో ఒకరు ముచ్చటించుకున్నట్టుగా ఉంటుంది. అంతేకాని ప్రేక్షకులతో చెప్పినట్లు ఉండదు.
అదే వన్డే మ్యాచ్‌లో ఐతే జట్ల బలాబలాల గురించిన చర్చ కాస్త వాడిగా ఉంటుంది. కామెంటేటర్లు ఒకరితో ఒకరికన్నా ప్రేక్షకులకు చెప్పడం ఎక్కువవుతుంది. ఇక టి-20లో అయితే స్కోర్‌బోర్డ్ ఎంత వేగంగా పరుగెడుతుందో అంతే వేగంగా కామెంటరీ కూడా దూసుకెళ్తుంది. మరోవైపు స్పోర్ట్స్ చానళ్లు కూడా పెరిగాయి. అంతర్జాతీయ టోర్నీలతో పాటు ఇప్పుడు ఐపిఎల్ రాకతో క్రికెట్‌కి మరింత క్రేజ్ పెరిగింది. దానితోపాటు స్టార్ క్రికెట్, నియో క్రికెట్, టెన్ క్రికెట్... ఇలా క్రికెట్‌కే ప్రత్యేకంగా చానళ్లు పుట్టుకొచ్చాయి. వాటిలో ఇరవై నాలుగ్గంటలూ క్రికెట్టే. క్రికెట్ ప్రోగ్రాములు, క్రికెట్ క్విజ్‌లు, చర్చలు, విశ్లేషణలు పెరిగిపోయాయి. అందుకే కామెంటేటర్లు ఆ చానళ్లలో ప్రజెంటర్లుగా కొత్త అవతారమెత్తుతున్నారు.
నెంబర్‌వన్ కామెంటేటర్ ఎవరు?
నెంబర్‌వన్ బ్యాట్స్‌మన్ ఎవరు నెంబర్‌వన్ బౌలర్ ఎవరు అని అడిగితే చటుక్కున సమాధానం చెప్పేస్తాం. బెస్ట్ అంపైర్ ఎవరు అని అడిగితే సైమన్ టౌఫెల్ అనో మరొకరనో చెప్పేస్తాం. అయితే ఎవరు బెస్ట్ కామెంటేటర్ అని అడిగితే ఎవరి పేరు చెప్పాలి? అందుకే క్రిక్ఇన్‌ఫోడాట్‌కామ్ ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించింది. దాని ఆధారంగా టాప్‌టెన్ కామెంటేటర్లను ప్రకటించింది. దాన్లో మొదటి స్థానంలో నిలిచాడు హర్ష భోగ్లే. ఆ తర్వాతి స్థానాన్ని రవిశాస్త్రి, ఆక్రమించాడు. మిగతా స్థానాల్లో రిచీ బెనాడ్, టోనీ గ్రెగ్, జెఫ్రీ బాయ్‌కాట్, ఇయాన్ చాపెల్, మైకెల్ హోల్డింగ్, డేవిడ్ లాయిడ్, సునీల్ గవాస్కర్, రమీజ్ రాజా నిలిచారు.
అయితే 'మోస్ట్ ఎంటర్‌టైనింగ్' క్యాటగిరీలో టోనీ గ్రెయిగ్... జెఫ్రీ బాయ్‌కాట్ కంటే మూడు ఓట్లు ఎక్కువ తెచ్చుకుని నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించాడు. డేవిడ్ లాయిడ్ నంబర్ త్రీతో సరిపెట్టుకుంటే మన భోగ్లే నాలుగో స్థానంలో నిలిచాడు. అంపైర్ల లాగే కామెంటేటర్లు కూడా ఆడే రెండు జట్లలో ఏ ఒక్క దానివైపు పక్షపాతం చూపకూడదు. అలాంటి కామెంటేటర్లనే అందరూ గౌరవిస్తారు. ఈ సర్వేలో 'మోస్ట్ అన్‌బయాస్డ్' కామెంటేటర్‌గా రిచీ బెనాడ్ ఎన్నికయ్యాడు. హర్ష భోగ్లే రెండో స్థానంలో, రవిశాస్త్రి మూడో స్థానంలో నిలిచారు.
కామెంటరీ రైటర్లు
రేడియోలు, టీవీ చానళ్లే కాదు, మేం కూడా లైవ్ కామెంటరీ అందిస్తున్నాం అంటున్నాయి క్రికెట్ వెబ్‌సైట్లు. అయితే వాళ్ల కామెంటరీని చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్ కామెంటేటర్లు చెప్పరు.. రాస్తారు. ఆఫీసుల్లో పని చేస్తూ టీవీ కాని రేడియో కాని అందుబాటులో లేని క్రికెట్ అభిమానులు ఈ కామెంటరీ చదువుకుని సంతోషిస్తారు. బంతిని బౌలర్ ఎంత వేగంతో విసిరాడు... దాన్ని బ్యాట్స్‌మన్ ఎలా షాట్ కొట్టాడు. ఎటువైపుగా బౌండరీకి తరలించాడు లాంటి విషయాల్ని క్షణాల్లో రాసేస్తారు వాళ్లు.
- నాగేశ్వరరావు తమనం
No comments:
Post a Comment