'అమెరికాలో లెండి' అని 'అది మీకు తెలిసిన చోటు కాదన్నట్టు'గా బదులిచ్చాడా యువకుడు.
'అమెరికాలో ఎక్కడ?' అడిగాడా పెద్దమనిషి.
'చికాగోలో' చెప్పాడు యువకుడు.
'చికాగోలో ఉన్న అరోరా టెంపుల్‌కి వెళ్లారా' అడిగాడు పెద్దాయన.
'వెళ్లాను..! మీరు కూడా అమెరికాలోనే ఉంటారా ?' అన్నాడా యువకుడు ఆశ్చర్యంగా.
'అదేం లేదు.. ఆ గుడిలో దేవుడికి బంగారు ఆభరణాలు తయారు చేసింది నేనే!' చెప్పాడా పెద్దమనిషి.
అప్పుడు కాని అర్థం కాలేదు 'అమెరికన్ యూత్'కి పెద్దాయన ఎందుకు అడుగుతున్నాడో. ఆయనే తెనాలికి చెందిన శిల్పి అక్కల రామకృష్ణ. ఆయనొక్కడే కాదు. వాళ్లు నలుగురు సోదరులు. అందరూ శిల్పులే. అమెరికాలో ఇంకా ఏయే దేవాలయాలకి ఆభరణాలు చేశారు? అని అడిగితే... ఆ జాబితా విప్పడం కాస్త కష్టం కాని మీరే ఏదైనా ప్రాంతం పేరు చెప్పండి అక్కడున్న ఏ గుడిలో ఏ దేవుడికి ఏ ఆభరణాలు చేశామో చెబుతాం అంటారు వాళ్లు. దాని అర్థం - అమెరికాలో మన దేవుళ్లందరూ అక్కల వారి ఆభరణాలే ధరిస్తున్నారని.
--------------
మనకైతే బంగారు నగలు కొనుక్కోవడానికి పెద్దపెద్ద నగల దుకాణాలుంటాయి. బంగారు కాంతులు, విద్యుద్దీపాల వెలుగులు కలిసి ధగధగ మెరిసిపోయే అద్దాల షోరూంలు అన్నిచోట్లా వెలిశాయి. ఆ షోరూంలకి వెళ్తే చాలు, వందల డిజైన్లు, వేల రకాల నగలు... మరి దేవుళ్లకు నగలు చేయించాలంటేనో... వాటినెవరు తయారు చేస్తారు? అవి కూడా రెడీమేడ్‌గా దొరుకుతాయా అంటే అస్సలు దొరకవు. ఎందుకంటే వాటిని తయారు చేసేది మామూలు బంగారు కొట్ల వాళ్లు కాదు. శిల్పశాస్త్రం తెలిసిన బంగరు శిల్పులు. అలాంటి వాళ్లే 'అక్కల' అన్నదమ్ములు. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కొన్ని వేల దేవాలయాల్లో ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు 'అక్కల' అన్నదమ్ములు చెక్కినవే.
ఆ దేవతామూర్తులను అలంకరించిన ఆభరణాలు కూడా వాళ్లు చేసినవే. విజయవాడ కనకదుర్గకి, నిడదవోలు కోట సత్యమ్మకి బంగారు కిరీటాలు, సింహాచలం నరసింహస్వామికి, వరాహస్వామికి బంగారు కవచాలు, అన్నవరం ఆలయంలో వెండి, పంచలోహ విగ్రహాలు, వాటికి వెండి ఆభరణాలు. నెల్లూరు ఇరుకళల పరమేశ్వరీదేవికి బంగారు కిరీటం, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామికి బంగారు కిరీటం...ఇలా చాలా దేవుళ్ల మెరిసిపోయే కాంతుల వెనక ఉంది వీరి చేతులే. తెలుగునాటే కాదు, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా చాలా ఆలయాలకిఆభరణాలు చేశారు 'అక్కల' సోదరులు. హరిద్వార్‌లో వెంకటేశ్వరస్వామి ధరించిన ఆభరణాలూ వీళ్లే చేశారు.
ఆ నలుగురు...
అక్కల కుటుంబం అరవయ్యేళ్లుగా తెనాలిలో విగ్రహాల తయారీ వృత్తిలో ఉంది. ఆ కుటుంబంలో మూడు తరాల నుండి ఇదే పని చేస్తున్నారు. మొదటి తరం శిల్పి అక్కల రామయ్య తెనాలిలో శిల్పశాలను స్థాపిస్తే ఆయన నలుగురు కొడుకులూ తండ్రి బాటలోనే నడిచారు. వాళ్లే అక్కల మంగయ్య, రామకృష్ణ, రామ మోహన్, శ్రీరాం. వంశపారంపర్యంగా నేర్చుకున్నా తమిళనాడు ప్రభుత్వం శిల్పకళలో నిర్వహించే పరీక్షలో కూడా ఉత్తీర్ణులయ్యారు. మంగయ్య కుమారులు రామలింగేశ్వర కుమార్, రమేష్ కూడా ఇదే వృత్తిని చేపట్టారు. ఈ అరవయ్యేళ్లలో శిల్పకళలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కొత్తకొత్త పద్ధతులు నేర్చుకుంటూ, నల్లరాతి నుంచి ఫైబర్ విగ్రహాల వరకూ రకరకాలు తయారు చేస్తున్నారు అక్కల బ్రదర్స్. మూడు తరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కడెక్కడి నుంచో విగ్రహాలు, ఆభరణాలు చేయమని ఆర్డర్లు వస్తుంటాయని చెప్పారు రామకృష్ణ.
అమెరికా దాకా...
అక్కల సోదరుల కీర్తి వ్యాపించాక 1990లో మొదటిసారి అమెరికా ఆఫర్ వచ్చింది. "అమెరికాలోని లివర్‌మోర్‌లో ఉన్న 'శివా విష్ణు టెంపుల్' వాళ్లు నవరత్నఖచిత వజ్ర కిరీటం తయారు చేయమన్నారు. ఆ గుడిని కట్టించింది తెలుగువాళ్లే. అలా ఆ గుడిలోని వెంకటేశ్వర స్వామికి కిరీటం తయారు చేయడంతో అమెరికా ఆఫర్లు మొదలయ్యాయి. తర్వాత 1992లో టెక్సాస్‌లోని వెంకటేశ్వర స్వామికి కిరీటాన్ని తయారు చేశాం. అప్పట్లో అమెరికాలో ఉన్న గుళ్లన్నీ చిన్నచిన్న మందిరాల్లా ఉండేవి. నగరాల శివారుల్లో ఉండే ఆ మందిరాల్లో దేవుళ్ల ఫోటోలే ఉండేవి. ఏవో కొన్నిట్లో మాత్రమే చిన్నచిన్న విగ్రహాలుండేవి.
1994లో మిసిసిపీ రాష్ట్రం జాక్సన్‌లో మనవాళ్లు దేవాలయం నిర్మిస్తూ ఆ దేవాలయానికి విగ్రహాలు, ఆభరణాలు తయారు చేయటానికి మమ్మల్ని అమెరికాకి ఆహ్వానించారు. అచ్చం తిరుమలలో ఉన్నట్టే కావాలన్నారు. అలా నేను, మా బాబాయి రామకృష్ణ రెండేళ్లపాటు అమెరికాలో ఉండి ఆ గుడికి కావాల్సిన వెండి, బంగారు, పంచలోహ విగ్రహాలు, ఆభరణాలు తయారు చేశాం'' అంటూ వివరించాడు మంగయ్య కుమారుడు రామలింగేశ్వర కుమార్. ఆ సమయంలోనే అమెరికాలో ఉన్న చాలా ఆలయాలకి కూడా ఆభరణాలు చేయమని అక్కల సోదరులని అడిగారు అక్కడి మనవాళ్లు.
అలా ఒక్క గుడితో మొదలై మిసిసిపీలోని వెంకటేశ్వర స్వామికి, అట్లాంటాలోని మరో ఆలయానికి, హూస్టన్ శ్రీమీనాక్షి టెంపుల్ లోని వాసవీ కన్యకా పరమేశ్వరికి బంగారు కవచాలు, సర్వాభరణాలు తయారు చేశారు. "అమెరికాలో మేం చేసిన విగ్రహాలు, ఆభరణాలతో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించాం. ఆ ఎగ్జిబిషన్‌కి మన భారతీయులతో పాటు అమెరికన్ శిల్పులు కూడా వచ్చారు. వారికి మన శిల్పకళ గురించి వివరించాం. వారి వద్ద నుంచి కూడా చాలా నేర్చుకున్నాం. అక్కడి శిల్పులు ఉపయోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ గురించి, దాన్ని మన శిల్పకళలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో కూడా తెలుసుకున్నాం. అమెరికన్లు, అక్కడున్న మనవాళ్లూ క్వాలిటీ విషయంలో రాజీ పడరు. అక్కడ చెప్పిన టైంకి పని పూర్తవ్వాలి.
క్వాలిటీ బాగుండాలి. అవి రెండూ పాటించాం కాబట్టే మేం అమెరికాలో ఉన్న మన దేవాలయాలకి అన్ని ఆభరణాలు చేయగలిగాం. అప్పట్లో హిందూ దేవాలయాలు, మందిరాలు, జైనుల మందిరాలు మొత్తం కలిపి అమెరికాలో 100 నుంచి 120లోపు ఉండేవి. రానురాను దేవాలయాలు పెరిగాయి. మాకు ఆర్డర్లు కూడా పెరిగాయి. అక్కడున్న ఆలయం మొత్తాన్ని ఒకే సారి నిర్మించరు. దాతల విరాళాలను బట్టి కొత్త ఆభరణాలు ఒకటొకటిగా చేయిస్తూ ఉంటారు'' అన్నాడు రామలింగేశ్వర్ కుమార్. దేవుడికి ఆభరణాలు చేయాలంటే ముందుగా అమెరికా వెళ్లి ఆ విగ్రహాల కొలతలు తీసుకొని వస్తారు వాళ్లు. కావాల్సిన బంగారాన్ని, మిగతా వస్తువులను దేవాలయాల నిర్వాహకులే శిల్పులకి ఇస్తారు. తయారు చేసిన ఆభరణాల్ని నిర్వాహకులే తెనాలి వచ్చి తీసుకెళ్తారు. ఒక్కోసారి అక్కల సోదరులే అమెరికా వెళ్లి వాటిని విగ్రహాలకు అమర్చి వస్తారు. 2009లో క్యారీలోని వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు చేసి తీసుకెళ్లి అమర్చి వచ్చారు అక్కల రామకృష్ణ.
అమెరికా నుంచి అక్కల శిల్పుల ప్రతిభ ఆఫ్రికాలో ఉన్న మనవాళ్లకి కూడా తెలిసింది. నైజీరియాలోని హిందూ ఆలయానికి ఆభరణాలు చేసింది అక్కల సోదరులే. కెన్యా రాజధాని నైరోబీలోని వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటం, హస్తాలు కూడా వాళ్లే చేశారు. ఐర్లాండ్‌లోని వినాయకుడి గుడికి విగ్రహాన్ని, ఆభరణాల్ని, మారిషస్‌లోని లక్ష్మీనారాయణ స్వామికి, రామాలయాలకి బంగారు ఆభరణాల్ని చేశారు.
విదేశాలకోసం ఫైబర్ విగ్రహాలు
ఆ తర్వాత కస్టమర్ సంతృప్తి చెందాలి. అది చేయగలుగుతున్నాం కాబట్టే మేం ఇన్నేళ్లుగా రాణిస్తున్నాం అంటారు.వీరి ప్రావీణ్యం దేవతల విగ్రహాలు, ఆభరణాలకే పరిమితం కాలేదు. నేతల విగ్రహాలు చేయడంలో కూడా అక్కల బ్రదర్స్ ముందున్నారు. నేతల విగ్రహాలు తయారు చేయమని రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది వస్తుంటారు. "ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న నీలం సంజీవరెడ్డి విగ్రహం, రామంతపూర్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం, సంజీవరెడ్డినగర్ సిగ్నల్ వద్ద ఉన్న ఉమేష్ చంద్ర విగ్రహం, విశాఖ సముద్ర తీరాన ఉన్న శ్రీశ్రీ విగ్రహం మేం చేసినవే. మద్రాస్‌లో పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసిన ప్రదేశంలో ప్రతిష్టించిన ఆయన విగ్రహం కూడా మేమే చేశాం. తెనాలి మునిసిపాలిటీ శతాబ్ది వేడుకల సందర్భంగా ప్రతిష్టించిన 'తెనాలి రామకృష్ణ' విగ్రహమూ మేం చేసినదే'' అన్నారు రామకృష్ణ.
- నాగేశ్వరరావు తమనం
No comments:
Post a Comment