భగవతి బ్రదర్స్
జగదీష్ భగవతి-ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత పాల్‌క్రుగ్మన్ గురువు.
సనత్ ఎన్ భగవతి-ప్రముఖ న్యూరాలజిస్ట్, 'ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ పీడియాట్రిక్ న్యూరోసర్జరీ' మాజీ అధ్యక్షుడు.
ప్రవీణ్ భగవతి-'వరల్డ్ ఫౌండ్రీ ఆర్గనైజేషన్' మాజీ అధ్యక్షుడు.
'భగవతి' పేరు పెట్టుకుంటే ఎవరైనా ఇలాగే గొప్పవాళ్లవుతారా? లేకపోతే ఆ పేరు పెట్టుకున్న ప్రముఖుల్లో వీళ్లు కొందరా? వీళ్లంతా అన్నదమ్ములైతే కాదు కదా... అనుకుంటున్నారా? మీరు ఊహించింది నిజమే. ఈ నలుగురూ అన్నదమ్ములే. వారివారి రంగాల్లో అత్యున్నత స్థానానికి చేరిన 'భగవతి బ్రదర్స్'. అదే వారి స్పెషాలిటీ.
ఈ నలుగురే కాదు. భగవతిలు మొత్తం ఏడుగురు అన్నదమ్ములు. ఒకసారి 1920లలోకి వెళ్తే... ముంబైలో నివాసముంటున్న గుజరాతీ లాయర్ నట్వర్‌లాల్ హెచ్ భగవతికి ఏడుగురు సంతానం. అందరూ కొడుకులే. వారిలో పెద్దవాడైన జస్టిస్ పి ఎన్ భగవతి 1921 డిసెంబర్ 21న పుట్టారు. 'అందరం మగ పిల్లలమే కావడంతో మా తల్లిదండ్రులు మా కజిన్ ఒకమ్మాయిని దత్తత తీసుకున్నారు. అలా మాకొక చెల్లెలు కూడా తోడైంది. అంతేకాదు, చుట్టాల పిల్లలు మరో ఇద్దరు కూడా మా ఇంట్లోనే ఉండి చదువుకునేవారు. మొత్తం పదిమంది పిల్లలవడంతో మాకు నిత్యం సందడే. ఒక్కో రూంలో ఇద్దరం, ముగ్గురం ఉండేవాళ్లం. ఎప్పుడు చూసినా ఎవరోఒకరు అల్లరి చేస్తూనే ఉండేవారు. అలా మా బాల్యమంతా చాలా ఆనందంగా గడిచింది. అందుకేనేమో ఇప్పటికీ నాకు నిశ్శబ్దం అంటే నచ్చదు సరికదా... అలా ఉంటే అసలు పనే చేయలేను. మా అన్నయ్య జస్టిస్ పిఎన్ భగవతి కూడా అంతే. ఓ వైపు ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నా అదేమీ పట్టించుకోకుండా తాను ఇవ్వవలసిన జడ్జిమెంటును స్టెనోకు గంటల తరబడి డిక్టేట్ చేస్తూనే ఉండేవారు' అని జగదీష్ భగవతి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
నట్వర్‌లాల్ హెచ్ భగవతి అప్పటికే పేరుమోసిన లాయర్, ఆయన స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడమే కాకుడా కొడుకుల్ని కూడా పాల్గొనేలా ప్రోత్సహించారు. ఆయన స్ఫూర్తి తోటే జస్టిస్ పిఎన్ భగవతి కాలేజీలో చదువుకునే రోజుల్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్లారు. మిగతా వాళ్లంతా చిన్నపిల్లలు కావడంతో ఉద్యమంలో పాల్గొనక పోయినా ఆ రోజుల్ని కళ్లారా చూసిన వాళ్లే.
స్వాతంత్య్రానంతరం నట్వర్‌లాల్ భగవతి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. రిటైరైన తర్వాత బెనారస్ హిందూ యూనివర్శిటీకి వైస్ చాన్సలర్‌గా కూడా పని చేశారాయన. తండ్రి స్ఫూర్తి తోనే ఆయన కొడుకుల్లో నలుగురు ప్రతిభలో తండ్రిని మించిన కొడుకులయ్యారు. వారిలో పెద్దవాడు జస్టిస్ పిఎన్ భగవతి.
లెక్కలు వదిలి లాయరై...
ఆయన ఇచ్చిన తీర్పువల్ల ప్రయోజనం పొందిన ఒక ఊరి గిరిజనులు తమ ఊరి పేరును భగవతిపురంగా మార్చుకున్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని శ్రామికులకు, బాల కార్మికులకు సంబంధించి ఆయన వెలువరించిన తీర్పులు కేంద్రప్రభుత్వాన్ని ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టేలా చేశాయి. అందుకే జస్టిస్ భగవతిని స్వతంత్రభారత చరిత్రలోనే గొప్ప న్యాయమూర్తిగా పరిగణిస్తారు.
ఆ అన్నయ్యకు ఏమాత్రం తీసిపోలేదు జగదీష్ భగవతి.
గ్లోబలైజేషన్ గురు...
2004లో వచ్చిన 'ఇన్ డిఫెన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్' పుస్తకమే ఆయన్ని గ్లోబలైజేషన్ గురుని చేసింది. 'ఫ్రీ ట్రేడ్' సిద్ధాంతకర్తగా ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆయన్ని మన దేశ ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్‌తో సత్కరించింది. అంతేకాదు... జపాన్ ప్రభుత్వం ఆయన్ని 2006లో 'ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్-గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్'తో గౌరవించింది. చాలాయేళ్లుగా నోబెల్ పురస్కారం అందుకోగల వారి జాబితాలో ఆయన పేరు ఉంటూనే ఉంది. ఆయనకు రాకపోయినా ఆయన ప్రియశిష్యుడు పాల్ క్రుగ్మన్ నోబెల్ బహుమతి పొందారు.
ఇరవయ్యేళ్లకే ఇండియా వదిలి కేంబ్రిడ్జి యూనివర్శిటీలో బిఏ పూర్తి చేసిన జగదీష్ 1967లో అమెరికాలోని 'మసాసుచెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -ఎం.ఐ.టీ' నుండి పీహెచ్‌డీ పూర్తి చేశారు. మన దేశంలోని పలు యూనివర్శిటీలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. దాదాపు అర్ధశతాబ్దంగా ఆయన రాస్తున్న పుస్తకాలు, వ్యాసాలు, చేసిన ప్రసంగాలు ఆయన కీర్తిని మరింత పెంచాయి. మన దేశ ఆర్థికవ్యవస్థ గురించి కూడా ఆయన చాలా రచనలు చేశారు. 'హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ'లో ప్రారంభించబోతున్న 'హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్' కోసం ఆయన్ని మన దేశం తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే గనక జరిగితే 'మా యూనివర్శిటీ కీర్తి గణనీయంగా పెరుగుతుంద'ని విద్యార్థులు, ప్రొఫెసర్లు అంటున్నారు.
ఆర్థికవేత్తగా కీర్తిప్రతిష్టలు మూటగట్టుకున్న జగదీష్ భగవతి నిజానికి 'లా' చదివి న్యాయవాది కావాలని ఆయన తండ్రి కోరిక. 'ఒక కొడుకు లాయర్ అయ్యాడుగా... అది చాలు అని నేను వారించేవాడిని. మా నాన్న కోరిక ఆయన బ్రతికి ఉండగా తీర్చలేకపోయాను కాని ఇప్పుడు నేను ఎకనామిక్స్‌తో పాటు లా ప్రొఫెసర్నయ్యాను. ఆ విధంగా కొంతయినా మా నాన్న కోరిక తీర్చగలిగాను' అని జగదీష్ భగవతి పేర్కొన్నారు.
న్యూరాలజిస్ట్‌గా...
ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ది న్యూరొలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా, ట్రెజరర్‌గా, సెక్రటరీగా... ఆ తర్వాత 1989లో ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో న్యూరోసర్జన్ల సంఘాలలో వివిధ స్థాయిల్లో పని చేశారు. 'ఆసియన్ ఆస్ట్రేలియన్ సొసైటీ ఆఫ్ న్యూరోసర్జన్స్'కి అధ్యక్షుడై, ఆ తర్వాత 2005లో ఇంటర్నేషనల్ న్యూరలాజికల్ పీడియాట్రిక్ సొసైటీకి కూడా అధ్యక్షుడయ్యారు. ప్రపంచంలోనే ఒక న్యూరోసర్జన్‌కి దక్కే అతిపెద్దగౌరవం కూడా అదే.
ఫౌండ్రీ ఇంజనీర్...
***
నలుగురు అన్నదమ్ములూ తమతమ రంగాల్లో ఉన్నతస్థానాలు అ«ధిరోహించిన వైనాన్ని ప్రస్తావిస్తూ జగదీష్ భగవతి ఇలా అన్నారు. "చదువుకి ఉన్న విలువను మా నాన్న నుంచి చిన్నప్పుడే తెలుసుకున్నాం. కేవలం తెలుసుకోవడంతో ఊరుకోకుండా దానిని ఆచరణలో పెట్టాం. భగవతి టౌన్‌షిప్ గనక నిర్మిస్తే అందులో ఉండే వాళ్లందరూ ప్రముఖులే అవుతారని మా ఫెండ్స్ నవ్వుతుంటారు.''
- నాగేశ్వరరావు తమనం
No comments:
Post a Comment