Thursday, March 17, 2011

లంచం బాధితులకీ ఓ వెబ్‌సైట్

'పాస్‌పోర్టు కోసం అప్లయ్ చేస్తే.. అడ్రస్ వెరిఫికేషన్ ఎప్పటికీ జరగడం లేదు.. పోలీసుకి 500 ఇస్తే కాని ఆ పని పూర్తికాలేదు' 'రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌లను ఫోటో తీసినందుకు కెమెరా లాగేసుకున్నారు పోలీసులు. 400 ఇస్తేకాని కెమెరా తిరిగివ్వలేదు' 'నో పార్కింగ్ ఏరియాలో పెట్టిన బైక్‌ను తీసుకెళ్లిన పోలీసులు 1500 ఇస్తేకాని తిరిగివ్వలేదు. తీరా బండి తీసుకుని చూస్తే అందులో పెట్రోలు లేదు' 'బర్త్ సర్టిఫికెట్‌లో తల్లి పేరు తప్పు రాశారు, దాన్ని సరి చేయడానికి 1000 ఇచ్చుకోవాల్సి వచ్చింది'

'ఐ పెయిడ్ ఎ బ్రైబ్ డాట్‌కామ్' వెబ్‌సైట్‌లోకి వెళ్తే.. ఇలాంటి విషయాలు కొన్ని వేలు చూడొచ్చు. పని జరగక కొందరు, టైంకి పని జరగడానికి కొందరు.. మరేదారి లేనపుడు నిస్సహాయ స్థితిలో లంచం సమర్పించుకోక తప్పడం లేదు. అలాంటి వాళ్లు తమ తమ అనుభవాలను పంచుకోవడానికే కాకుండా అసలు లంచం ఏయే శాఖల్లో ఏయే రూపాల్లో ఎంతగా వేళ్లూనుకొందీ తెలుసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతోందీ వెబ్‌సైట్. బెంగుళూరులోని 'జనాగ్రహ' అనే ఎన్‌జీవో ఈ వెబ్‌సైట్‌ని రూపొందించింది.

లంచం తీసుకోవడమే కాదు.. ఇవ్వడం కూడా నేరమే అని ప్రభుత్వం టీవీల్లో, రేడియోల్లో అరిచి గీ పెడుతున్నా.. పత్రికల్లో ప్రకటనలిస్తున్నా, యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారుల వలలో అవినీతి చేపలెన్నో పడుతూనే ఉన్నా.. అవినీతిని తగ్గకపోగా ఆ విషవృక్షం వేళ్లు మరింత లోనికి వెళ్లి దాన్ని మరింత బలవత్తరం చేస్తూనే ఉన్నాయి. వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే వారి సంఖ్య అయినా పెరుగుతున్నదేమో కాని లంచం తీసుకోకుండా పని చేసే ఉద్యోగుల సంఖ్య మాత్రం పెరగట్లేదని చెప్పొచ్చు. సమాజమెదుర్కొంటున్న చాలా సమస్యలపై పోరాడుతున్న ఉద్యమకారులు, కార్యకర్తలు కూడా లంచగొండితనం విషయానికొచ్చేసరికి ఆ పని చేసే సాహసం చేయట్లేదంటే అది ఎంత పెద్ద సమస్యో అర్థమవుతుంది. ఆ సమస్యపై పోరాడడానికే ఈ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్లో 'లంచం ఇచ్చాను', 'లంచం ఇవ్వడానికి నిరాకరించాను', 'లంచం ఇవ్వాల్సిన అవసరం రాలేదు', 'లంచం ఇవ్వను' అనే నాలుగు సెక్షన్లున్నాయి. 'లంచం ఇచ్చాను' సెక్షన్‌లో నాలుగు వేలకి పైగా ఎంట్రీలుంటే, 'లంచం ఇవ్వడానికి నిరాకరించాను' సెక్షన్‌లో నాలుగొందల ఎంట్రీలే ఉన్నాయి. 'లంచం ఇవ్వాల్సిన అవసరం రాలేదు'లో అయితే 170 మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే లంచం ఇచ్చిన వారితో పోలిస్తే ఇవ్వడానికి నిరాకరించిన వాళ్లు పదో వంతు మాత్రమే ఉన్నారని అర్థమవుతోంది.

హైదరాబాద్ విషయానికే వస్తే.. 'అమెరికా నుంచి విమానం దిగి ఎయిర్‌పోర్ట్‌లో అడుగు పెట్టానో లేదో.. నా మెడలో ఉన్న కెమెరాకు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి లేదని చెప్పాడు ఎయిర్‌పోర్ట్ అధికారి. అవసరం లేదని వాదించినా వినలేదు. చివరికి 14 వేలు చెల్లిస్తే కాని వదిలిపెట్టలేదు. ఎలాంటి రిసీటూ ఇవ్వలేదు' అని లంచం ఇచ్చిన ఒకాయన తన బాధని వెళ్లగక్కాడు. మరొకరైతే.. లంచం అడగని అధికారుల మంచితనాన్ని కొనియాడుతూ.. 'నేను కాప్రా డివిజన్లో బిల్డింగ్ రెగ్యులేషన్ కోసం అప్లికేషన్ పెట్టాను. ప్లాన్‌తో పాటు పెనాల్టీ కూడా కట్టాను. పర్మిషన్ ఇస్తున్నారని తెలిసి వెళ్తే ఎలాంటి లంచం అడగకుండానే అధికారులు నాకు పత్రాలు అందజేశారు' అని లంచం అడగకపోవడం గొప్ప విషయంగా రాశాడు.

అవినీతిని అరికట్టడానికి జనమందరి మద్దతును కూడగట్టుకోవడానికే ఈ వెబ్‌సైట్‌ని రూపొందించామంటున్నారు జనాగ్రహ సంస్థ వాళ్లు. ఎవరైనా ఈ వెబ్‌సైట్లోకెళ్లి తమ అనుభవాల్ని పంచుకోవచ్చు. ఒకవేళ లంచం ఇవ్వడానికి నిరాకరించినా.. ఆ సంఘటనల గురించి కూడా రాయొచ్చు. అలా చేయడం వల్ల మాకేం లాభం అనుకోకండి. అలాంటి సంఘటనల గురించి తెలియజేయడం వల్ల ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాల్లో లంచగొండితనం ఉందో తెలుసుకోవచ్చు. వాటి ఆధారంగా 'ప్రభుత్వ యంత్రాంగం పనితీరుని పరిశీలించే వీలుంటుంది. అవినీతిని నిరోధించడానికి, అవినీతి వ్యతిరేక చట్టాలు అమలయ్యేలా చూసే వీలుంటుంది' అని చెబుతున్నారు నిర్వాహకులు. దేశం నలుమూలల నుంచీ జనం తమ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. తాము ఏయే పనులు పూర్తవడానికి ఎంత లంచం ఇచ్చామో తెలియజేస్తున్నారు. వెబ్‌సైట్‌లో వస్తున్న స్పందనను ఒకసారి పరిశీలిస్తే.. బెంగుళూరు నుంచి ఎక్కువమంది తాము లంచం చెల్లించినట్టు తెలుపుతున్నారు. ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో ముంబై, చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ ఉన్నాయి. నగరాలు, పట్టణాలు, టౌన్లు కలుపుకుని మొత్తం 270 చోట్లనుంచి ప్రజలు తమ అనుభవాల్ని ఈ వెబ్‌సైట్‌లో రాశారు, రాస్తున్నారు.

'జనాగ్రహ సెంటర్ ఫర్ సిటిజన్‌షిప్ అండ్ డెమొక్రసీ' అనే సంస్థ మన దేశంలోని చాలా పట్టణాల్లో నగరాల్లో ప్రభుత్వంతోను ప్రజలతోను కలిసి పనిచేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి పని చేసే సంస్థ. ఈ సంస్థని రమేష్ రామనాధన్, స్వాతి రామనాధన్ 2001లో స్థాపించారు. రోడ్లు, ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్ట్, మంచినీరు లాంటి ప్రజలందరూ ఎదుర్కొనే సమస్యలపై ఇది పనిచేస్తోంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి జనం లంచం చెల్లించాల్సి రావడం వల్లే ఈ వెబ్‌సైట్‌ని రూపొందించామంటున్నారు వాళ్లు.
ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ఉద్యమాలు ఎక్కువయ్యాయి. ఈ ఉద్యమంలో మీరు కూడా పాలు పంచుకోవాలనుకుంటే.. లంచం ఇచ్చినా, ఇవ్వడానికి నిరాకరించినా ఆ విషయాన్ని ఈ వెబ్‌సైట్‌లో రాయండి. లంచం బాధితులుగా మీ అనుభవాన్ని తోటివాళ్లు తెలుసుకునేలా చేయండి.

No comments: