Saturday, March 26, 2011

లైట్‌హౌస్‌లో హాలిడే

సముద్రయానం చేసేవారికి తీరపు జాడ తెలియజేసే కాంతి రేఖలైన లైట్‌హౌస్‌లు ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఓ వైపు జిపిఎస్‌లు, రాడార్‌లు అమర్చుకొని నావికులకు మెరుగైన సేవలందిస్తూనే మరోవైపు టూరిస్టులనీ ఆకట్టుకుంటున్నాయి. అమెరికా, యూరప్‌లలో ఇప్పుడు ఇదో కొత్త తరహా టూరిజంగా రూపొందుతోంది. ఆ దేశాల మార్గంలోనే నడవాలనుకొంటోంది మన దేశం కూడా.. అందుకే లైట్‌హౌస్‌లకి కొత్త హంగులు సమకూర్చే పనిలో పడింది.

ప్రాచీన కాలంలో భూమి మీద నిర్మించిన అతి ఎత్తయిన కట్టడం లైట్‌హౌసే. అంతేకాదు.. ప్రపంచంలోని ఏడు ప్రాచీన వింతల్లో లైట్‌హౌస్ ఒకటి. ఆ లైట్‌హౌస్‌ని ఇప్పటి ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలో నిర్మించారు. రెండో టాలమీ రాజు దీన్ని నిర్మించాడు. ఇప్పుడైతే తీరప్రాంతాల్లో ఏ రేవుకి వెళ్లినా అక్కడో లైట్‌హౌస్‌ని చూడొచ్చు కాని అప్పటికది పెద్ద విశేషమే. నేడు శాస్త్రసాంకేతిక రంగంలో ఎంతటి అభివృద్ధిని సాధించినా, జిపిఎస్‌లు, శాటిలైట్ ఫోన్లు లాంటి కొత్త పరికరాలు వచ్చినా లైట్‌హౌస్‌లు మాత్రం ప్రాధాన్యతను ఎన్ని కోల్పోలేదు. మన దేశంలో ఇప్పుడు మొత్తం 182 లైట్‌హౌస్‌లు పనిచేస్తుంటే వాటిలో 14 లైట్‌హౌస్‌లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఆ 14లో విశాఖపట్నంలోని డాల్ఫిన్స్ నోస్ లైట్‌హౌస్ కూడా ఉంది.

ఏడు జిల్లాలుగా...

లైట్‌హౌస్‌ల నిర్వహణా బాధ్యత కేంద్రప్రభుత్వానిది. మొత్తం 7517 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ వెంబడి ఉన్న 182 లైట్‌హౌస్‌లను 'డైరెక్టరేట్ ఆఫ్ లైట్‌హౌసెస్ అండ్ లైట్‌షిప్స్' అనే సంస్థ నిర్వహిస్తోంది. సముద్రయానం, రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ (మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్) అధీనంలో ఉంటుందీ సంస్థ. లైట్‌హౌస్‌ల నిర్వహణకోసం తీర రేఖని మొత్తం ఏడు జిల్లాలుగా విభజించారు. అవేంటంటే..1. జామ్‌నగర్, 2. ముంబై, 3. కొచ్చి, 4. చెన్నై, 5. విశాఖపట్నం, 6. కోల్‌కతా, 7. పోర్ట్‌బ్లెయిర్. లైట్‌హౌస్‌లను సాధారణంగా ఎత్తయిన ప్రదేశంలో కడతారు.

సుదూరం నుంచి కూడా కనిపించేలా వాటికి ఎరుపు, తెలుపు, నలుపు రంగులు వేస్తారు. విశాఖపట్నంలో ఉన్న డాల్ఫిన్‌నోస్ లైట్‌హౌస్‌కి నలుపు, తెలుపు రంగులు ఉంటాయి. అదే చెన్నైలో ఉన్న లైట్‌హౌస్‌కి ఎరుపు, తెలుపు ఉంటాయి. రంగుల్లో మాత్రమే కాదు, దాని నుంచి ప్రసరించే కాంతిలో కూడా ఒక్కో లైట్‌హౌస్‌ది ఒక్కో ప్రత్యేకత. కొన్నిట్లో హాలోజెన్ ల్యాంప్‌లు వాడితే కొన్నిట్లో ఎల్ఇడి ల్యాంప్‌లు వాడుతున్నారు. కొన్ని లైట్‌హౌస్‌లలో ఐదు సెకన్లకి ఒకసారి లైట్ వెలిగి ఆరిపోతే, కొన్నిట్లో కొన్నిట్లో ఆ వ్వవధి 10 సెకన్లు ఉంటుంది. కాంతి రంగులో కూడా తేడా ఉంటుంది. అందుకే లైట్‌హౌస్ నుంచి వెలువడుతున్న కాంతిని బట్టి అది ఏ తీరమో తెలుసుకుంటారు నావికులు. వెలుగుతూ ఆరిపోతూ ఉండే లైట్లు ఎందుకంటే.. ఓడలు తీరం దగ్గరికొచ్చేకొద్దీ తీరంలో ఉన్న మిగతా లైట్లు కూడా కనిపిస్తాయి. ఏది లైట్‌హౌసో పోల్చుకోవడానికి వీలుగా వెలుగుతూ ఆరిపోతూ ఉండే లైట్లను అమర్చారు.
లైట్‌హౌసులే కాదు. లైట్‌షిప్‌లు కూడా ఉంటాయి. కొన్ని తీరాలు లైట్‌హౌస్ నిర్మించడానికి అనుకూలంగా లేకపోవచ్చు. అలాంటి తీరాల్లో లైట్‌షిప్‌ని ఉంచుతారు. అది నీళ్లలో నిలకడగా తేలియాడుతూ లైట్‌హౌస్ చేసే పనే చేస్తుంది. మన దేశంలో అలాంటి లైట్‌షిప్ గుజరాత్ తీరంలోని కచ్‌లో మాత్రమే ఉంది.

లైట్‌హౌస్ లవర్స్

'డైరెక్టరేట్ ఆఫ్ లైట్‌హౌసెస్ అండ్ లైట్‌షిప్స్'లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఐసిఆర్ ప్రసాద్‌కి లైట్‌హౌస్‌లంటే ఎనలేని ఆసక్తి. ఆయన చాలా దేశాల్లో పర్యటించి లైట్‌హౌస్‌ల మీద పరిశోధన చేశారు. అమెరికన్లకి లైట్‌హౌస్‌లంటే ఎనలేని అభిమానమని అంటారాయన. "అమెరికన్లు ప్రపంచం మొత్తంలోనే లైట్‌హౌస్ ప్రేమికులు. ఎందుకంటే... అమెరికన్లలో ఎక్కువ శాతం ప్రజలు వలసవచ్చి స్థిరపడిన వారే. ఓడల్లో వస్తున్న తమ పూర్వీకులకు దారి చూపించింది లైట్‌హౌస్‌లేనని వారి నమ్మకం. లైట్‌హౌస్‌ల మీద వారికున్న అభిమానం ఒక తరం నుంచి మరోతరానికి వస్తూ లైట్‌హౌస్‌లు వారి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి.

అందుకే వాళ్లు తమ పిల్లల్ని తీసుకెళ్లి లైట్‌హౌస్‌లను చూపించి, వాటి ప్రాధాన్యతని వివరిస్తారు. అంతగా ప్రేమిస్తారు కాబట్టే ఆ దేశంలో 'లైట్‌హౌస్ లవర్స్ క్లబ్‌లు, అసోసియేషన్లు' చాలా ఉన్నాయి. అంతటితో ఆగిపోకుండా నిరుపయోగంగా ఉన్న లైట్‌హౌస్‌ల పరిరక్షణ బాధ్యతలు చేపట్టడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తారంటే వారికున్న అనుబంధం ఏపాటిదో తెలుసుకోవచ్చు'' అని అంటారాయన. మొట్టమొదటి లైట్‌హౌస్ నగరమైన అలెగ్జాండ్రియా పౌర చిహ్నం లైట్‌హౌసే. ఆ నగరం జండాలోనూ అలెగ్జాండ్రియా యూనివర్శిటీ లోగో మీద కూడా కూడా లైట్‌హౌస్ ఉంటుంది. కట్టడాల్లోనే కాదు పాశ్చాత్య సాహిత్యంలో కూడా లైట్‌హౌస్ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది.

చరిత్ర నిర్మాణంలో..

మన దేశ చరిత్రనే తీసుకుంటే సముద్రతీరం ప్రధాన పాత్ర పోషించింది. పోర్చుగీసు వాళ్లు, బ్రిటీషు వాళ్లు ఓడలెక్కి ఇండియా చేరి మనతో వర్తక వ్యాపారాలు సాగించింది సముద్రమార్గం ద్వారానే. నేటికీ 90 శాతం సరుకుల రవాణా ఓడలమీదే జరుగుతుంది. ఆ ఓడలకి రేవుల జాడ తెలుపుతుంది లైట్‌హౌసులే. సాంకేతికంగా ఎన్నో రకాల పరికరాలు వచ్చినా, జిపిఎస్ పరికరాలు సముద్రంలో ఉన్న వారికి తీరం ఏ దిశలో ఎంత దూరంలో తెలియజేస్తున్నా స్వయంగా తీరాన్ని చూడగలగడం వేరని అంటారు నావికులు. ఒక్కొకసారి తీరాల్లో భద్రతా కారణాల దృష్ట్యా జిపిఎస్ పరికరాల సిగ్నల్స్‌ను జామ్ చేస్తే.. అవి కరెక్టు సమాచారం ఇవ్వలేవు. అందుకే ఆ పరికరాలేవీ లైట్‌హౌస్‌కి ప్రత్యామ్నాయం కాలేకపోయాయి. ఇప్పుడు లైట్‌హౌస్‌లకు రాడార్లను అమర్చి ఓడలను లైట్‌హౌస్‌లతో అనుసంధానం చేస్తున్నారు.
తీర రేఖ చుట్టూ చుక్కల్లా నిల్చుని ఉండే లైట్‌హౌస్‌లు నావికులకు తీరం జాడ తెలపడమే కాదు రాడార్‌ల సాయంతో సముద్ర జలాల్లో ప్రవేశించే శత్రువుల ఆచూకి పసిగట్టడానికి కూడా ఉపయోగపడుతున్నాయి.

లైట్‌హౌస్ టూరిజం

లైట్‌హౌస్‌ల డైరెక్టరేట్ తన సేవల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకుంటూ స్వయంసమృద్ధ సంస్థగా ఎదిగింది. భారత నౌకాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే ఓడల నుంచి 'లైట్ డ్యూటీ' రూపంలో చాలా ఆదాయం వస్తోంది. ఇప్పుడు ఈ సంస్థ పర్యాటక రంగంలోకి అడుగు పెట్టబోతోంది. త్వరలో మీరు కూడా ఒకరోజు లైట్‌హౌస్‌లో గడిపి.. ఆ ఒక్కరోజూ లైట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించవచ్చు. కేంద్ర ప్రభుత్వం మీకా అవకాశాన్ని కలిగించాలని భావిస్తోంది. ఇప్పటికే అమెరికా, యూరప్‌లలో ఈ రకమైన లైట్‌హౌస్ టూరిజం అభివృద్ధి చెందింది. ఇప్పుడు మన దేశం కూడా ఆ బాటలో నడుస్తోంది. కొన్ని ఎంపిక చేసిన లైట్‌హౌస్‌లను మ్యూజియంలుగా అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయించారు. వాటిలో ఉండడానికి గదులు, కేఫెటేరియా, ప్రేక్షకుల గ్యాలరీ, 4డి సినిమా హాలు, అక్వేరియంలు, గేమింగ్ జోన్లు, లేజర్‌షో, స్పా, రిసార్టులు లాంటి రకరకాల సౌకర్యాలు కూడా కల్పించబోతున్నారు.

* తమిళ ప్రాచీన గ్రంధం సిలప్పదిగారం (silappadigaram) లో లైట్‌హౌస్ ప్రస్తావన ఉంది. పూంపుహార్ రేవుకి చేరుకునేందుకు వీలుగా కావేరిపట్టణం తీరంలో ఒక సుందరమైన లైట్‌హౌస్ ఉందని ఆ గ్రంథంలో రాసి ఉంది.
* మనదేశంలో నేటికీ పని చేస్తున్న లైట్‌హౌస్‌లలో ప్రాచీనమైనది ఒరిస్సాలోని పరదీప్ రేవు వద్ద ఉన్న 'ఫాల్స్ పాయింట్ లైట్‌హౌస్'. దీన్ని 1838లో ప్రారంభించారు.
* ఏటా సెప్టెంబర్ 21న మన దేశంలో లైట్‌హౌస్ డే జరుపుకుంటారు. 1927, సెప్టెంబర్ 21న అప్పటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ 'లైట్‌హౌస్ బిల్'కి తన అనుమతి తెలిపాడు. అలా ఆరోజు లైట్‌హౌస్ డే అయింది.
* మన దేశంలో మొదట్లో లైట్‌హౌస్ దీపాల్లో కొబ్బరి నూనె వాడేవారు. కొబ్బరినూనెతో అయితే దీపం తెల్లగా వెలుగుతుందని.
* స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశంలో 17 లైఫ్ మాత్రమే భారత ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. మరో 50 లైట్‌హౌస్‌లు తీరప్రాంతాల్లో ఉన్న సామంత రాజ్యాల అధీనంలో ఉండేవి.
* లైట్‌హౌస్‌లు ఎక్కువగా జనావాసాలకు దూరంగా తీర ప్రాంతాల్లో ఎక్కడెక్కడో నిర్మించాల్సి వస్తుంది కాబట్టి అక్కడ పని చేసే వారికి సరైన సదుపాయాలేవీ ఉండవన్నది వాస్తవం. 2004 లో సంభవించిన తుపాను తాకిడికి తమిళనాడు తీరంలోని నాగపట్టినం, కడలూర్ లైట్‌హౌస్‌లలో ఉద్యోగులు చనిపోయారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఇందిరాపాయింట్ లైట్‌హౌస్‌లో పనిచేస్తున్న మొత్తం 17 మంది ప్రాణాలు విడిచారు.
* గతేడాది తమిళనాడులోని పూంపుహార్‌లో ప్రారంభమైన లైట్‌హౌస్ మనదేశంలో నిర్మించిన వాటిలో కొత్తది.
* మన దేశ తీర రేఖ వెంబడి ప్రతి 30 నాటికల్ మైళ్లకి ఒక లైట్‌హౌస్ నిర్మించే కార్యక్రమాన్ని 2017 కల్లా పూర్తి చేయాలని డైరెక్టరేట్ సంకల్పించింది.

No comments: